ఆర్‌ఎస్‌ఎస్సే గాంధీని హత్య చేసింది


కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌
భీవండి, మార్చి 6 (జనంసాక్షి) :
రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ బాధ్యులే మహాత్మాగాంధీని హత్య చేశారని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన నాయకుడే జాతిపితను హతమార్చారని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రలో రెండు రోజుల పర్యటనలో భాగంగా రాహుల్‌ థానే జిల్లాలోని భీవండిలో నిర్వహించిన కాంగ్రెస్‌ ర్యాలీలో మాట్లాడారు. బీజేపీ నాయకులు అబద్ధాలను నిజాలుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలోకి కంప్యూటర్లు తీసుకువచ్చింది తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీయేనని ఆయన గుర్తు చేశారు. మహాత్మాగాంధీని, సర్దార్‌ పటేల్‌ను వ్యతిరేకించిన వారే ఇప్పుడు వారి గురించి మాట్లాడుతున్నారని బీజేపీ తీరును దుయ్యబట్టారు. తన తండ్రి, శ్యామ్‌పిట్రోడ మరికొందరు నాయకులు దేశంలో కంప్యూటర్లు ప్రవేశపెట్టారని, అప్పుడు పార్లమెంట్‌లో ప్రతిపక్షంలో ఉన్న చాలా మంది నాయకులు ఉద్యోగాలను కొళ్లగొట్టే కరప్యూటర్లు దేశానికి అవసరం లేదంటూ వ్యతిరేకించారని అన్నారు. ఇప్పుడు దేశంలో పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు. కంప్యూటర్లు వద్దన్న నేతలే పదేళ్ల తర్వాత కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్ల వ్యవస్థ తెచ్చింది తామేనని గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. వీళ్లే మరో ఐదేళ్ల తర్వాత గ్రామీణ ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం తెచ్చింది కూడా తామేనని గొప్పలు చెప్పుకుంటారని అన్నారు.