మమత సభకు అన్నా డుమ్మా

జనం బేజార్‌

బెడిసికొట్టిన తృణమూల్‌ వ్యూహం

న్యూఢిల్లీ, మార్చి 12 (జనంసాక్షి) :

ఇన్నాళ్లు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అండగా నిలిచిన సామాజిక కార్యకర్త అన్నాహజారే ఆమెకు చేయిచ్చారు. ఢిల్లీలో బుధవారం తృణమూల్‌ కాంగ్రెస్‌ నిర్వహించిన ర్యాలీకి ఆయన దూరంగా ఉన్నారు. గతంలో మమతకు మద్దతు పలికిన అన్నా దీనికి హాజరు కాలేదు. ర్యాలీలో పాల్గొనవలసిందిగా చివరి నిమిషం వరకు అన్నా హజారేను ఒప్పించేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అయితే ఇందుకు గల కారణం తృణమూల్‌ ర్యాలీకి జనం తక్కువ రావడం అన్నాకు అసంతృప్తి కలిగించినట్టు సమాచారం. మరోవైపు అన్నా తీరుపై దీదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. బెంగాల్‌లో పనంతా వదిలిపెట్టి వచ్చానని మమత నిష్టూరమాడారు. ఏ పార్టీని ప్రచారం చేయనని భీష్మించుకు కూర్చున్న అన్నా హజారే ఈ మధ్య తన పంతం పక్కన పెట్టి తృణమూల్‌ తరపున ప్రచారం చేస్తానని గతంలోనే ప్రకటించారు. ముఖ్యమంత్రి అయినా మమతా బెనర్జీ అత్యంత సాధారణ జీవితం గడుపుతున్న వ్యక్తని మమతను అన్నాహజారే ప్రశంసించిన విషయం తెలిసిందే. అయితే అన్నా రాకున్నా మమత ర్యాలీలో పాల్గొన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌  ధనిక పార్టీ కాదని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. రాంలీలా మైదానంలో టీఎంసీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. మోడీ దగ్గర ధనం ఉంది కానీ ఆయన మతతత్వ వాది అని చెప్పారు. బీజేపీని అధికారంలోకి రానిచ్చే ప్రసక్తే లేదని ఆమె తేల్చిచెప్పారు. కాంగ్రెస్‌, బీజేపీ, సీపీఎంలపై ఆమె విమర్శలు గుప్పించారు. ఈ మూడు పార్టీలు ప్రజల కోసం చేసిందేవిూ లేదని తెలిపారు. ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతదని మమత స్పష్టం చేశారు.