పునర్నిర్మాణం మా వల్లే సాధ్యం

మాజీ మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, మార్చి 14 (జనంసాక్షి) :

తెలంగాణ పునర్నిర్మాణం కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల హామీల కమిటీ చైర్మన్‌ శ్రీధర్‌బాబు వెల్లడించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా దీనిని అభివృద్ధి చేసే సత్తా తమకే ఉందన్నారు. కాంగ్రెస్‌కు తెలంగాణపై ఓ నిర్దుష్ట విధానం ఉందన్నారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షల మేరకు అభివృద్ది చేసే విజన్‌ ఉందన్నారు. గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార, ప్రణాళిక కమిటీ సమావేశాలు ముగిశాయి. అనంతరం శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ, సామాజిక న్యాయం, సంక్షేమం, అభివృద్ధికి మేనిఫెస్టోలో పెద్దపీట వేస్తామన్నారు. అందరికి సంక్షేమ ఫలాలు అందించే దిశగా చర్యలు ఉంటాయన్నారు. తెలంగాణ పునర్‌ నిర్మాణం కాంగ్రెసు పార్టీతోనే సాధ్యమని శ్రీధర్‌ బాబు చెప్పారు. అందరి సూచనలకు అనుగుణంగా కాంగ్రెస్‌ విజన్‌ డాక్యుమెంట్‌ ఉంటుందన్నారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అన్నారు. అభివృద్ధి, పునర్నిర్మాణం కాంగ్రెసుతోనే సాధ్యమన్నారు. తాము జెఏసి సూచనలు కూడా తీసుకుంటామని మల్లుభట్టి విక్రమార్క చెప్పారు. బంగారు తెలంగాణ సాధనకు కృషి చేస్తామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. గాంధీభవన్‌లో తెలంగాణ ఎన్నికల ప్రచార, మేనిఫెస్టో కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అందరి సలహాలు తీసుకుని పార్టీని పటిష్టం చేస్తామని చెప్పారు. వివిధ వర్గాల ప్రజలతో సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకుని ఆ దిశగా ముందుకు వెళ్తామని తెలిపారు. సామాజిక న్యాయం తమతోనే సాధ్యమన్నారు. అంతకుముందు సుదీర్గంగా జరిగిన గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార, ప్రణాళిక కమిటీ సమావేశాలు ముగిశాయి. 5,6 అంశాలను మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రస్తావించాలని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ సూచించినట్లు సమాచారం. చేనేత కార్మికుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై సలహాలు స్వీకరించేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ ఏర్పాటు చేయాలని, ఈనెల 22 లోగా మేనిఫెస్టోకు ప్రాథమిక రూపం ఇవ్వాలని దిగ్విజయ్‌ సూచించినట్లు తెలిసింది. ప్రసార, సామాజిక మాధ్యమాలను ప్రచారానికి వినియోగించుకోవాలని, ఇరు ప్రాంతాల్లో 30మంది ప్రధాన ప్రచారకర్తలను గుర్తించాలని నేతలకు దిశానిర్దేశర చేశారు. అభ్యర్థిత్వాలపై అభిప్రాయాలను మూడు రోజుల్లోగా కుంతియాకు తెలపాలని ఎన్నికల కమిటీకి దిగ్విజయ్‌ సూచించారు. సమావేశం ముగిసిన తర్వాత దిగ్విజయ్‌సింగ్‌ గాంధీభవన్‌లో నేతలతో విడివిడిగా సమావేశమై అభిప్రాయాలు సేకరించారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార, ప్రణాళిక కమిటీతో ఆంధప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్‌సింగ్‌ భేటీ అయి పలు సూచనలు చేశారు. ఐదారు అంశాలను మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రస్తావించాలని సూచించారు. సీమాంధ్ర ప్రాంతాల్లో ముప్పై మందిని స్టార్‌ కంపెయినర్లుగా ఎంచుకోవాలని సూచించారు. ప్రసార, సామాజిక మాధ్యమాలను ప్రచారానికి వినియోగించుకోవాలన్నారు. జాతీయస్థాయి నేతలు కొందరు ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు. బిసి, ఎస్టీ, ఎస్సీ సంఘాలతో చర్చించాలని, మేనిఫెస్టోలో అందుకు సంబంధించిన అంశాలను పొందు పర్చాలన్నారు. కాగా, గాంధీ భవన్లో దిగ్విజయ్‌ నేతలతో విడివిడిగా మంతనాలు జరిపారు. మరోవైపు దిగ్విజయ్‌ సింగ్‌ సమక్షంలో తెలంగాణ ప్రజాసంఘాల ఐకాస ఛైర్మన్‌ గజ్జెల కాంతం శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాబోయే ఎన్నికల్లో కరీంనగర్‌ జిల్లా చొప్పదండి స్థానం నుంచి అసెంబ్లీ టిక్కెట్‌ ఇస్తానని ఆయనకు ద్విగ్విజయ్‌ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. డిగ్గీ పలు సూచనలు చేశారన్నారు. రేణుకను తొలగించాలని లేఖ కాంగ్రెసు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి తెలంగాణ ప్రాంత ఎంపీలు లేఖ రాశారు. తెలంగాణ కాంగ్రెసు ఎన్నికల కమిటీ నుండి రేణుకా చౌదరిని తొలగించాలని వారు తమ లేఖలో కోరారు. తెలంగాణ కోసం పోరాడిన వారిని కించపరిచేలా రేణుక గతంలో మాట్లాడారని వారు లేఖలో పేర్కొన్నారు.