తొందరపాటు నిర్ణయాలతో అనర్థాలు
రాజకీయాల్లో తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు చర్యలు ఎంతటి అనర్థాలను సృష్టిస్థాయో ఆమ్ ఆద్మీ పార్టీని చూస్తే అర్థమవుతుంది. అవినీతి వ్యతిరేక ఉద్యమం, సమాచార హక్కు చట్టం అమలుపై ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా సుపరిచుతులైన అరవింద్ కేజ్రీవాల్ వ్యవస్థల్లో వేళ్లూనుకుపోయిన అవినీతిని అంతమొందించడానికి రాజకీయాల్లోకి రావడమే సరైన నిర్ణయమని ముండుగు వేశారు. అవినీతి వ్యతిరేక ఉద్యమానికి నేతృత్వం వహించిన సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే వారించినా కేజ్రీవాల్ పార్టీ స్థాపన విషయంలో వెనుకడుగు వేయలేదు. ఢిల్లీలో మహిళలపై జరుగుతున్న వరుస అత్యాచారాలకు వ్యతిరేకంగా భారీ ఉద్యమాన్ని నడపడంలో ఆప్ కీలక భూమికే పోషించింది. మూడు పర్యాయాలు షీలాదీక్షిత్ పాలనలో అవినీతి పెచ్చుమీరిందని, కామన్వెల్త్ కుంభకోణంలో ఆమెకు భారీగా ముడుపులందాయని, ప్రభుత్వానికి జవాబుదారీ తనం లేదంటూ ఆరోపణలు ఎక్కుపెట్టిన కేజ్రీవాల్ అవినీతి కుళ్లును ఊడ్చిపారేస్తామంటూ చీపురుతో ఉద్యమాన్ని ముమ్మరం చేశాడు. పార్టీ పేరునే ఆమ్ ఆద్మీగా పెట్టుకున్న కేజ్రీవాల్ ఆ ఆమ్ ఆద్మీకి స్వల్ప వ్యవధిలోనే చేరువయ్యాడు. ఆటోవాలాలు, సాధారణ ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు ఆప్‌కు అండగా నిలిచారు. బహుశా దేశ రాజకీయాల్లోనే ధనస్వామ్య ప్రమేయం లేకుండా అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీ ఆమ్ ఆద్మీ ఒక్కటేనేమో. ఢిల్లీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ అంపశయ్యపై ఉన్న భారత ప్రజాస్వామ్య వ్యవస్థ వికాసం కూడా సాధ్యమే అనే అభిప్రాయాన్ని కలిగించింది. ఎంతో చైతన్యవంతమైన ఢిల్లీ ప్రజలను తనవైపు తిప్పుకోగలిగిన ఆమ్ ఆద్మీ పార్టీ దేశ వ్యాప్తంగా తన ప్రక్షాళన రాజకీయాలను ప్రారంభించాలని కూడా ప్రజాస్వామికవాదులు ఆకాంక్షించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ అసెంబ్లీలో 27 స్థానాలను దక్కించుకొని రెండో అతిపెద్ద పార్టీగా నిలవగా, బీజేపీ 33 స్థానాలతో మ్యాజిక్ ఫిగర్‌కు మూడు సీట్ల దూరంలో ఆగిపోయింది. 15 ఏళ్లు ఏకబిగిన అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్ పార్టీ ఏడు సీట్లతో సింగిల్ డిజిట్‌కు పరిమితమైంది. మూడు స్థానాలు ఇతరులు దక్కించుకున్నారు. ఢిల్లీ ఓటర్ ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వని పరిస్థితుల్లో కాంగ్రెస్, బీజేపీలు ఆమ్ ఆద్మీకి స్నేహహస్తాన్ని చాచాయి. అయితే ఏ పార్టీతో కలిసి సాగాలనే విషయంపై ఆప్ పబ్లిక్ హియరింగ్‌కు వెళ్లింది. ప్రజల అభిప్రాయాల మేరకు కాంగ్రెస్‌తో కలిసి మైనార్టీ సర్కారు ఏర్పాటుకు ముందుకు వచ్చింది. కేవలం 49 రోజులు మాత్రమే అధికారంలో కొనసాగిన ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. ఢిల్లీ ప్రజలకు హామీ ఇచ్చినట్లుగానే ఉచితంగా మంచినీరు, విద్యుత్ చార్జీలను సగానికి తగ్గించడంతో పాటు కేంద్రం ఆధిపత్యంలోని ఢిల్లీ పోలీసులను రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోకి తీసుకువచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేసింది. దేశ రాజధానిగా ఉన్న ఢిల్లీ శాంతిభద్రతలు లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలోనే ఉంటాయి. ఈ విషయంపై మాజీ సీఎం షీలాదీక్షిత్ కూడా పలుమార్లు అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరుగుతున్న వరుస అత్యాచారాలకు కారణం కూడా స్థానిక ప్రభుత్వానికి పోలీసులను నియంత్రించే అధికారం లేకపోవడమే కారణం అనే ఆరోపణలూ ఉన్నాయి. కీలక ప్రాంతాల శాంతి భద్రతలను కేంద్రం తన అధీనంలో ఉంచుకొని సాధారణ ప్రాంతాల్లో పౌర రక్షణకు ఢిల్లీ ప్రభుత్వానికి కట్టబెట్టాలనేది కేజ్రీవాల్ డిమాండ్. ఇది రాబోయే రోజుల్లో ప్రధాన డిమాండ్ అయి తీరుతుంది. ముఖ్యమంత్రి సహా మొత్తం పాలన వ్యవస్థను జన్‌లోక్‌పాల్ పరిధిలోకి తీసుకువచ్చేందుకు కేజ్రీవాల్ చేసిన ప్రయత్నం విఫలమైంది. రాజకీయాల్లో అవినీతికి ఎవరికి ఎవరూ తీసిపోరు. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఈ విషయంలో కాస్త ముందు వరసలోనే ఉంటాయి. జన్‌లోక్‌పాల్‌కు చట్టబద్ధత కల్పించడం ద్వారా తమ వేలితో తమ కంటినే పొడుచుకునేందుకు ఏ రాజకీయ పార్టీ కూడా సిద్ధపడదు. అందుకే కేజ్రీవాల్ ప్రయత్నాన్ని కాంగ్రెస్, బీజేపీ కలిసే అడ్డుకున్నాయి. కేజ్రీవాల్ గద్దె దిగక తప్పనిసరి పరిస్థితిని సృష్టించాయి. అధికారంపై ఎప్పుడూ మక్కువ పెంచుకోని కేజ్రీవాల్ ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు రాజీ పడకుండా రాజీనామాకే మొగ్గు చూపాడు. తద్వారా ఢిల్లీ ప్రజల దృష్టిలో హీరో అయిన కేజ్రీవాల్ తన పార్టీ విస్తరణ క్రమంలో మాత్రం ఎనలేని అపకీర్తికి మూటగట్టుకుంటున్నాడు. రాజకీయాల్లో అవినీతిని, బంధుప్రీతిని, కుట్రలను, కుళ్లును ఊడ్చిపారేయడానికి చీపురు కట్టతో బయల్దేరిన కేజ్రీవాల్ ప్రధాన రాజకీయ పార్టీల వెన్నులో వణుకు పుట్టించాడు. గుజరాత్ అభివృద్ధిపై నరేంద్రమోడీ చేస్తున్న ప్రచారంలో నిజమెంతో తెలుసుకోవడానికి ఆ రాష్ట్రానికి బయల్దేరిన కేజ్రీవాల్‌కు ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆ అవకాశం ఇవ్వలేదు. పోలీసులు ఆయన్ను అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. దీంతో లక్నో, ఢిల్లీల్లోనీ బీజేపీ కార్యాలయాల ఎదుట ఆప్ కార్యకర్తలు చేసిన ఆందోళన హింసకు దారితీసింది. ఇది కేజ్రీవాల్ క్షమాపణ చెప్పే పరిస్థితికి కారణమైంది. మెట్రో నగరాల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న కేజ్రీవాల్ రాజకీయ అనుభవ శూన్యతతో అభాసుపాలవుతున్నాడు. ముంబైలో మీడియాపై ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి కారణమయ్యాయి. రాజకీయాల్లో తొందరపాటు చర్యలు నేతలను ఆకాశం నుంచి పాతాళంలోకి పడదోస్తాయి. కేజ్రీవాల్ ఇప్పటికైతే అంతటి దారుణస్థితికి దిగజారలేదు కానీ తాను చేస్తున్న పని, దాని పర్యవసానాలపై ముందుగా కాస్త హోమ్ వర్క్ చేస్తే మంచింది. ప్రజాస్వామ్య వ్యవస్థకే చెద పట్టించిన రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా దూసుకువచ్చిన ఆప్ లాంటి పార్టీలు మిగతా పార్టీల్లాగే నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటును ప్రదర్శిస్తే దాని ప్రజాస్వామ్య వ్యవస్థే భారీ ముల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కేజ్రీవాల్ పాలకుడిగా కంటే ప్రతిపక్ష నేతగానే బాగా పనిచేస్తాడనే అభిప్రాయం ఈ మధ్య ఢిల్లీ ప్రజల్లో వ్యక్తమవుతుంది. కేజ్రీవాల్ తన తొందరపాటు వల్ల ప్రజల్లో గూడుకట్టుకున్న విశ్వాసాన్ని మంచుగడ్డలా కరిగేందుకు కారకుడవుతున్నాడు. మిగతా రాజకీయ పక్షాల్లా తప్పించుకు తిరగడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే.. కానీ కేజ్రీవాల్ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు తథ్యం.