ఫైళ్ళ పరిష్కారంపై దృష్టి కేంద్రీకరిస్తున్న కలెక్టర్‌

ఏలూరు, మార్చి 15  : ఒకపక్క మున్సిపల్‌ ఎన్నికలు, మరోవైపు జిల్లాపరిషత్‌ ఎన్నికలు, ఇంకోవైపు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలతో క్షణక్షణం బిజీగా ఉంటున్న జిల్లా కలెక్టర్‌ సిద్ధార్థ్‌ జైన్‌ ఫైళ్ళ పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత నిస్తున్నారు. స్థానిక జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో శనివారం ఎన్నికల అధికారుల సమావేశంలో కలెక్టర్‌ 50కుపైగా ఫ్ళైను అక్కడికక్కడే పరిశీలించి పరిష్కరించారు. గత నెలరోజులు నుండి ఎన్నికల వాతావరణం వేడెక్కడంతో కలెక్టర్‌ దైనందిన పరిపాలనతో పాటు ఎన్నికలకు సంబందించి పలుఫైళ్ళను పరిష్కరించాల్సి రావడంతో క్షణం తీరిక లేకుండా బిజీ ఉంటున్నారు. ఎన్నికల వల్ల సాధారణ ఫైళ్ల పరిష్కారం జాప్యం జరగకూడదనే ఉద్దేశ్యంతో రెండు బ్యాగ్‌లలో ఫైళ్ళను కారులోనే ఉంచుకుని తీరిక దొరికినప్పుడల్లా వాటి పరిష్కారంపై దృష్టి  కేంద్రీకరించడం జరుగుతోంది. జిల్లా పరిషత్‌ ఎన్నికల నిర్వాహణ కూడా ఒక సవాల్‌గా స్వీకరించి ప్రశాంత వాతావరణంలో సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించడానికి జాయింట్‌ కలెక్టర్‌ డి.బాబూరావునాయుడు కూడా కలెక్టర్‌కు ఎంతో సహకరిస్తున్నారు. కలెక్టర్‌ ఆదేశాలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకుని వాటిని క్షేత్రస్థాయిలో కూడా పటిష్టంగా అమలు జరిగేలా బాబురావునాయుడు ప్రత్యేక కృషి చేస్తున్నారు. శనివారం ఏలూరు జడ్పీ కార్యాలయంలో జడ్పీటీసీ, యంపీటీసీ ఎన్నికల ఏర్పాట్లలో కూడా ఏ అధికారీ అలసత్వంతో ఉండకుండా వారిని చైతన్యపరచడానికి బాబురావునాయుడు ఎన్నికల నిబంధనలపై క్విజ్‌ పోటీ నిర్వహించి అధికారులకు సరైన అవగాహన కల్పించారు.