తెరాసకు చెరుకు సుధాకర్‌ రాజీనామా


తెలంగాణ తల్లికి పూల మాల
బరువెక్కిన హృదయంతో విలపించిన సుధాకర్‌
హైదరాబాద్‌, మార్చి 25 (జనంసాక్షి) :టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు చెరుకు సుధాకర్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా కేసీ ఆర్‌ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగానే తాను రాజీనామా చేస్తున్నట్టు సుధాకర్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి బ రువెక్కిన హృదయంతో ఆయన విలపించారు. కేసీఆర్‌ వైఖరిని సవాల్‌గా తీసు కొని బయటకు వెళ్తున్నట్లు వెల్లడించారు. పార్టీలోని సీనియర్లను కేసీఆర్‌ డమ్మీ లుగా మారుస్తున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికలలో స్వతంత్య్ర అభ్యర్థి గానైనా పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. తన భవిష్యత్తు కార్యాచరణపై స న్నిహితులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు. ఉద్యమమిత్రులతో చర్చిం చి ఏపార్టీలోకి వెళ్లాలనేది నిర్ణయించుకుంటానని సుధాకర్‌ తెలిపారు. గతకొంత కాలంగా అధినేత వైఖరితో మనస్తాపంవ చెందిన చెరుకు
సుధాకర్‌ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసిన ఉద్యమకారులను అణచివేసే విధంగా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ తన వల్లే వచ్చిందన్న భ్రమలో కేసీఆర్‌ ఉన్నారని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేయాలని తాను భావించానని, అయితే గత ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్‌ టికెట్‌ను నిరాకరించడం బాధాకరమన్నారు. ఎన్నికల్లో అవకాశం ఇస్తే డిపాజిట్‌ కూడా దక్కదని కేసీఆర్‌ హేళన చేసే విధంగా ఉద్యమకారులను అవమానపరుస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు తాము ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నామని ఆయన తెలిపారు. కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు క్షణాలలో ఆందోళనలు చేపట్టిన తమలాంటి ఉద్యమ కారులను కేసీఆర్‌కు తగదని ఆయన హితువు పలికారు. కేసీఆర్‌ చెప్పే ప్రకారం తెలంగాణ పునర్నిర్మాణం ఆయన వల్ల సాధ్యం కాదని సుధాకర్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమ కారులపై దాడులు చేసిన వారిని పార్టీలోకి తీసుకుంటూ ఉద్యమకారులకు టికెట్లు నిరాకరించడం బాధాకరమని ఆయన అన్నారు. కేసీఆర్‌ వైఖరితో ఉద్యమకారులు మానసిక క్షోభకు గురవుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన ఘనత ముమ్మాటికీ సోనియాగాంధీదే అని ఆయన అన్నారు. అయితే ఉద్యమస్ఫూర్తికి విరుద్ధంగా లోక్‌సభ స్థానాలలో కాంగ్రెస్‌ అభ్యర్థులపై పోటీకి దింపడం కేసీఆర్‌కు సరికాదని ఆయన అన్నారు. దీంతో ఢిల్లీకి తప్పుడు సంకేతాలు వెళ్లినట్టు అవుతుందని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్‌లో కొందరు నేతలు కావాలనే తనను బయటకు పంపే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. తాను ఏ పొరపాటు చేశానని కేసీఆర్‌ తనను బయటకు పంపారని ఆయన ప్రశ్నించారు. పీడీయాక్ట్‌ కింద జైలుకు వెళ్లినా తాను బాధ పడేవాడిని కానని, టీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వెళ్లడం బాధగా ఉందని ఆయన అన్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నించిన కొండా దంపతులను ఏ విధంగా టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని ఆయన ప్రశ్నించారు. తాను ఏపార్టీల చేరేది ఇంకా నిర్ణయించుకోలేదని ఆయన తెలిపారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి తాను అండగా ఉన్నానని సుధాకర్‌ ఆవేదనతో అన్నారు. నకిరేకల్‌ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో తన భార్యను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయిస్తానని ఆయన తెలిపారు.