కొలిక్కివస్తున్న సీపీఐ, కాంగ్రెస్‌ పొత్తు


జనగామలో పొన్నాల, నారాయణ భేటీ
హైదరాబాద్‌/జనగామ, మార్చి 28 (జనంసాక్షి) :
రాష్ట్రంలో కాంగ్రెస్‌, సీపీఐ మధ్య పొత్తు చర్చలు కొలిక్కి వస్తున్నాయి. శుక్రవారం వరంగల్‌ జిల్లా జనగామాలో టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ భేటీ అయ్యారు. 22 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలను సీపీఐ ఆశిస్తోందని, ఈమేరకు ఆ పార్టీతో చర్చలు జరిపామని పొన్నాల తెలిపారు. వారి డిమాండ్‌ను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి వారి ఆదేశాల మేరకు తదుపరి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే పొత్తులపై స్పష్టత వస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌, సీపీఐ కలిసి పోటీచేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే పొత్తులపై అలాంటి అవకాశాలు ఉంటాయనుకోవడం లేదన్నారు. కాంగ్రెస్‌ పొత్తలుకు సూత్రప్రాయంగా అంగీకరించినా టీఆర్‌ఎస్‌ కలసి రావడం లేదన్నారు. పొత్తులపై చర్చించేందుకు ముందు ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ఆంధ్రాలో కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ వైకాపాలతో పొత్తు ఉండదని, అక్కడ సీపీఎంతో కలిసి పనిచేసే అవకాశం ఉందని నారాయణ పేర్కొన్నారు.