మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను గుర్తించాం


పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశాం

సీమాంధ్రలో 12న నోటిఫికేషన్‌ : భన్వర్‌లాల్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9 (జనంసాక్షి) :రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాం తాలను గుర్తించామని, ఎన్నికల నిర్వహణకు ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ అన్నారు. సీమాంధ్రలో ని 25 పార్లమెంటు, 175 అసెంబ్లీ స్థానాలకు

ఈనెల 12న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. రెండో దశలో ఇక్కడ మే7న ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. సచివాలయంలోని హెచ్‌ బ్లాక్‌లో ఎలక్షన్‌ మీడియా సెంటర్‌ను బుధవారం భన్వర్‌లాల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అంబేద్కర్‌ జయంతి, గుడ్‌ ఫ్రైడేలాంటి సందర్భాల్లో (13, 14, 18 తేదీల్లో) నామినేషన్లు స్వీకరించబోమని చెప్పారు. పోలింగ్‌ స్టేషన్లలో కనీస సౌకర్యాలు కల్పిస్తామని, ఎండల నుంచి రక్షణకోసం టెంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఓటర్లు ఏదైనా గుర్తింపు కార్డు చూపించి ఓటు వేయవచ్చన్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌ జరుగుతుందని భన్వర్‌లాల్‌ తెలిపారు. తనిఖీల్లో ఇప్పటివరకు రూ. 90 కోట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు పార్టీల తరఫున పనిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మంగళవారం వరకు తెలంగాణ ప్రాంతంలో ఎంపీ స్థానాలకు 143, ఎమ్మెల్యే స్థానాలకు 1103 నామినేషన్లు దాఖలయ్యాయని, బుధవారం మధ్యాహ్నం మూడు గంటలతో నామినేషన్ల ఘట్టం పూర్తయిందని, తుది నామినేషన్ల సంఖ్య రావడానికి కొంత సమయం పడుతుందని ఆయన చెప్పారు. ఎన్నికల సందర్భంగా పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో దాదాపు 90 కోట్ల రూపాయిలకు పైగా డబ్బు స్వాధీనం చేసుకున్నట్టు భన్వర్‌లాల్‌ చెప్పారు.