మేయర్‌, చైర్మన్ల ఎన్నికల్లో జాప్యం


ఎమ్మెల్యే, ఎంపీలు ప్రమాణం చేసే వరకు ఆగాల్సిందే : రమాకాంత్‌
హైదరాబాద్‌, మే 13 (జనంసాక్షి) :
నగర, పురపాలక సంస్థలు, జిల్లా, మండల పరి షత్‌ ఎన్నికల ఫలితాలు వెలువడినా మేయర్‌, చైర్మ న్ల ఎంపిక ఆలస్యం కానుంది. ఎంపీలు, ఎమ్మెల్యే ప్రమాణస్వీకారం అనంతరం, జూన్‌ 2 తర్వాతే న గర, పురపాలక, స్థానిక సంస్థల అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా మేయర్‌, చైర్మన్ల ఎన్నికలో ఓటు వేసే హక్కు ఉండడంతో.. వారు లోక్‌సభ, శాసనసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసే వరకూ ఈ ఎన్నికలు వాయిపదా పడనున్నాయి. లోక్‌సభ, శాసనసభ సభ్యుల ప్రమాణ స్వీకారం త ర్వాతే మునిసిపల్‌, జిల్లా, మండల పరిషత్‌ అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కార్పొరేషన్లు, మునిసిపాలిటీలలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ఉండడం మేయర్‌, చైర్మన్‌ ఎన్నికలో వారికి ఓటు వేసే హక్కు ఉండడంతో ఈ
నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసే వరకూ స్థానిక సంస్థల అధ్యక్షుల ఎన్నికల ప్రక్రియ చేపట్టబోమని ఆయన స్పష్టం చేశారు. అప్పటివరకూ మేయర్‌, చైర్మన్ల ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ జారీ చేయబోమని తెలిపారు. మే 16వ తేదీ సాయంత్రం కల్లా ఎంపీ, ఎమ్మెల్యేల ఫలితాలు వెల్లడవుతాయని చెప్పారు. ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల్లో ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ఉంటారన్నారు. వారికి కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో ఓటు వేసే హక్కు ఉంటుందని.. జిల్లా, మండల పరిషత్‌లలో మాత్రం ఓటు వేసే హక్కు లేదని తెలిపారు. అయితే, ఆయా సమావేశాల్లో పాల్గొనే హక్కు వారికి ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో వారు లేకుండా మేయర్‌, చైర్మన్ల ఎన్నిక నిర్వహించడం సమంజసం కాదన్నారు. అయితే, ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే కార్పొరేషన్లు, మునిసిపాలిటీ అధ్యక్షుల ఎన్నికలో ఓటు వేసే హక్కు వస్తుందని వివరించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తారనేది నిర్ణయించే అధికారం తమకు లేదని రమాకాంత్‌రెడ్డి చెప్పారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి సంబంధించి శాసనసభ సచివాలయం, ఎంపీలకు సంబంధించి లోక్‌సభ సెక్రటేరియట్‌ నిర్ణయం తీసుకుంటాయన్నారు. వారం, పది రోజుల్లో ప్రమాణ స్వీకారం పూర్తి చేయగలిగితే, ఆ తర్వాత మేయర్‌, చైర్మన్ల ఎన్నిక చేపడతామన్నారు. ఒకవేళ ఆ ప్రక్రియ ఆలస్యమైతే, ఆలస్యంగానే ఎన్నిక నిర్వహిస్తామని తెలిపారు.మేయర్‌, చైర్మన్‌, ఎంపీపీ ఎన్నిక సమైక్య రాష్ట్రంలో జరుగుతుందా? లేక రెండు రాష్ట్రాల్లో జరుగుతుందా? జూన్‌ 2 కంటే ముందు నిర్వహించాలా? లేక తర్వాత అన్నది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రమాణ స్వీకారం ఎప్పుడనేది తేలిన తర్వాతే స్పష్టత వస్తుందని చెప్పారు. వాళ్ల ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మూడు రోజుల నోటీసు ఇచ్చి పరోక్ష ఎన్నిక ద్వారా అధ్యక్షుల ఎన్నిక కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. బ్యాలెట్‌ బాక్సుల్లోకి నీరు వచ్చినట్లు తన దృష్టికి వచ్చిందని రమాకాంత్‌రెడ్డి తెలిపారు. ‘కొన్ని చోట్ల బ్యాలెట్‌ తడిసిపోయాయని ఫిర్యాదులు వచ్చాయి. బ్యాలెట్‌ పత్రాలకు చెదలు పట్టిందని తెలిసింది. అయితే, బ్యాలెట్‌ పత్రాలు లెక్కింపు చేయడం కుదరకపోతే రీపోలింగ్‌ నిర్వహిస్తామని’ చెప్పారు. తనకు తెలిసినంత వరకూ 30-35 రోజుల పాటు బ్యాలెట్‌ బాక్సులు, ఈవీఎంలు భద్రపరచలేదని వివరించారు. బ్యాలెట్‌ బాక్సుల భద్రతకు సంబంధించి ఎన్నికల సంఘం వైఫల్యం ఏవిూ లేదని స్పష్టం చేశారు. బ్యాలెట్‌ బాక్సులను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూంలను ఎప్పుడు పడితే అప్పుడు తెరిచే ప్రసక్తి ఉండదని చెప్పారు. ఒకవేళ మధ్యలో తెరవదలిస్తే వెబ్‌కాస్టింగ్‌తో పాటు అభ్యర్థుల సమక్షంలోనే తెరవాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో స్ట్రాంగ్‌ రూంలలో పరిస్థితి ఏమిటన్నది ఎప్పటికప్పుడు సవిూక్షించడం కుదరదని చెప్పారు. తూర్పుగోదావరిలో తడిసిపోయినట్లుగా, నెల్లూరు జిల్లాలో చెదలు పట్టినట్లు తెలిసిందన్నారు. బ్యాలెట్‌ పత్రాలు లెక్కింపు చేయడం కుదరకపోతే ఆయా ప్రాంతాల్లో రీపోలింగ్‌ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అలాగే, రెండు జిల్లాల్లో మునిసిపల్‌ కౌంటింగ్‌ సందర్భంగా రెండు ఈవీఎంలు మొరాయించాయని చెప్పారు. ఈవీఎంలు తయారు చేసిన ఈసీఐఎల్‌ సంస్థ నిపుణులు అభ్యర్థుల సమక్షంలో ఈవీఎంల నుంచి సమాచారాన్ని సేకరించి ఫలితాలు వెల్లడిస్తారని తెలిపారు. అది కూడా వీలు కాకపోతే రెండు ప్రాంతాల్లో రీకౌంటింగ్‌ చేస్తామన్నారు.పోలవరం మండలంలో ప్రజలు ఎప్పుడు సిద్దంగా ఉన్నామని చెబితే అప్పుడు పోలింగ్‌ నిర్వహిస్తామని రమాకాంత్‌రెడ్డి చెప్పారు. పలు గ్రామాల ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరించారని గుర్తు చేయగా ఆయన పై విధంగా స్పందించారు. తాము నోటీసు ఇస్తే వారు బహిష్కరిస్తారని, ప్రతీసారి ఇదే పరిస్థితి తలెత్తుందున్నారు. అందుకే వాళ్లు ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని చెబితే అప్పుడు ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. పోలవరం బాధితులు పోలింగ్‌ బహిష్కరించినందున ఏమైనా చర్యలు తీసుకుంటారా? అని విలేకరులు ప్రశ్నించగా.. ఓటు వేయని వాళ్ల విూద ఎక్కడైనా చర్యలు తీసుకుంటారా? అని ఆయన ఎదురు ప్రశ్నించారు.