నిర్మాణ లోపమే కారణమా?

సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి మునిసిపల్‌ ఎన్నికల్లో మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది. జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో తిరుగులేని ఆధిక్యం సొంతం చేసుకున్న ఉద్యమ పార్టీ దక్షిణ తెలంగాణలో తన ఉనికిని చాటుకుంది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అపూర్వమైన ఫలితాలు సాధించబోతుందని ఎగ్జిట్‌పోల్స్‌ లెక్కలు చెప్తున్నాయి. టీఆర్‌ఎస్‌ తిరుగులేని ఆధిక్యంతో తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని అన్ని సర్వేలు ఘంటాపథంగా చెప్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఇంతటి ఊపును సృష్టించిన టీఆర్‌ఎస్‌ మునిసిపల్‌ ఎన్నికల్లో డీలా పడటానికి సంస్థాగత నిర్మాణ లోపమే కారణమని ఆ పార్టీ శ్రేణులే పేర్కొంటున్నాయి. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కూడా తమతోనే సాధ్యమంటూ కేసీఆర్‌ బలంగా చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం సర్వశక్తులు ఒడ్డిన కేసీఆర్‌ మునిసిపల్‌ ఎన్నికలను లెక్కలోకే తీసుకోలేదు. జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పక్షాన ప్రచారం చేయకున్నా ఉత్తర తెలంగాణలో టీఆర్‌ఎస్‌ బలీయమైన శక్తిగా నిలిచింది. ఉద్యమ పార్టీగా 14 ఏళ్లుగా ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీ సంస్థాగత నిర్మాణంలో బాగా వెనుకబడింది. అలాగే సొంత కేడర్‌ను తయారు చేసుకోవడం, సుశిక్షితులైన సైన్యాన్ని సిద్ధం చేసుకోవడంలో వెనుకబడి పోయింది. తెలంగాణ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టి పార్టీని బలోపేతం చేసి ఉంటే స్థానిక ఫలితాలు మరోలా ఉండేవి. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసి ఉంటే అది ఉప ఎన్నికల పార్టీ అన్న విమర్శలు వచ్చేవి కావు. పార్టీ నిర్మాణం గట్టిగా ఉంటే రేపు ప్రభుత్వం ఏర్పాటులో కిందిస్థాయిలో పథకాలను తీసుకుని వెళ్లడం కూడా సులువుగా ఉంటుంది. గ్రామస్థాయి నుంచి అసెంబ్లీ, పార్లమెంట్‌ వరకు నాయకులను, నమ్మినబంటులను తయారు చేసుకోవాలి. సమస్యలపై వారు అవగాహన కలిగి ఉండేలా చూడాలి. ఉద్యమాన్ని అన్ని వైపులా ఉరకలెత్తించిన కేసీఆర్‌ ఈ విషయంలో మాత్రం వెనకడుగు వేయడం వల్లే మునిసిపాలిటీల్లో ప్రతికూల ఫలితాలు సాధించారు. ప్రజలకు ఏం కావాలో, ఏం చేస్తే వారు ఆదరిస్తారో తెలుసుకోవాలి. తెలంగాణలో 53 పురపాలక, మూడు నగరపాలక సంస్థలకు ఎన్నికలు నిర్వహించగా టీఆర్‌ఎస్‌ కేవలం తొమ్మిది మునిసిపాలిటీ, ఒక కార్పొరేషన్‌తోనే సరిపెట్టుకుంది. ఉద్యమ ఖిల్లాగా పేరుగాంచిన కరీంనగర్‌ మినహా మిగతా జిల్లాల్లో పార్టీకి స్పష్టమైన ఆధిక్యం కనిపించలేదు. ఉత్తర తెలంగాణలో పట్టున్న వరంగల్‌ సైతం టీఆర్‌ఎస్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇదేదో తమకు అవసరం లేని ఎన్నికలని టీఆర్‌ఎస్‌ కొట్టి పారేయడానికి లేదు. ఫలితాలు ఆశించినట్లుగానే ఉన్నాయని సరిపెట్టుకుంటే ప్రజలునమ్మరు. మెదక్‌ జిల్లాలో కేసీఆర్‌ శాసనసభకు పోటీచేసిన గజ్వేల్‌లో కూడా అత్యధిక వార్డులు సాధించలేకపోయింది. ఇక్కడ హరీష్‌ రావు చాలానే కష్టపడ్డారు. అయినా ఎందుకు విజయం సాధించలేదో ఆలోచన చేసుకోవాలి. కరీంనగర్‌లోని మెట్‌పల్లి, జమ్మికుంట, హుస్నాబాద్‌, హుజూరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఐజ పురపాలికల్లో మాత్రమే పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లో జరిగిన ఈ ఎన్నికల్లో ఏడు జిల్లాల్లో పార్టీ ఒక్క మున్సిపాల్టీలో కూడా స్పష్టమైన ఆధిక్యత చూపలేకపోయింది. పార్టీ వైఫల్యానికి ప్రధాన కారణం పుర ఎన్నికలను నిర్లక్ష్యం చేయడమేనని చెప్పుకోవాలి. ఫలితాలు గొప్పగా, పార్టీ వూహించిన ఆశించిన స్థాయిలో రాకపోయినా.. గత మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ఈసారి కొంచెం ఎక్కువ స్థానాలు తెరాస కైవసం చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై పార్టీ కేటాయించిన సమయంలో మున్సిపాలిటీలకు పావువంతు కూడా కేటాయించలేదు. ఫలితంగానే చేదు ఫలితాలను చవిచూడాల్సి వచ్చింది. దీంతోపాటు ఉద్యమ నిర్మాణంపై చూపిన శ్రద్ధ పార్టీ సంస్థాగత నిర్మాణంపై చూపకపోవడం కూడా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపింది. అయితే, సార్వత్రిక ఎన్నికలకు నెలరోజుల ముందు జరిగిన మున్సిపల్‌ ఎన్నికల ప్రభావం కేవలం అభ్యర్థుల గుణగణాలు, స్థానిక అంశాలకే పరిమితమని, సార్వత్రిక ఎన్నికలపై దీని ప్రభావం ఏ మాత్రం ఉండదని తెరాస నేతలు విశ్లేషిస్తున్నారు. అంటే స్థానికంగా బలమైన నేతలను రంగంలోకి దింపలేదని అర్థం చేసుకోవాలి. సార్వత్రిక ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి 107 శాసనసభ నియోజకవర్గాల్లో పర్యటించిన పార్టీ అధినేత కేసీఆర్‌ పుర ఎన్నికల్లో మాత్రం ప్రచారం చేయలేదు. పార్టీ అగ్రనేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌, ఈటెల రాజేందర్‌ కూడా ప్రచారంలో పాల్గొనలేదు. వీటన్నింటితోపాటు మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు అంశం చర్చల్లో ఉంది. దీని ప్రభావం కూడా ఫలితాలపై పడిందని నేతలు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహించిన మహబూబ్‌నగర్‌ పార్లమెంటు పరిధిలోని మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీలో ఈ సారి కాంగ్రెస్‌ పార్టీ అధికారపీఠానికి చేరువలో ఉంది. జిల్లాలోని ఐజ మున్సిపాలిటీలో తెరాస భారీ ఆధిక్యం సాధించింది 20 వార్డుల్లో 16 చోట్ల విజయం సాధించింది. వనపర్తిలో భారీ ఆశలు పెటుకున్నప్పటికీ 26 వార్డుల్లో కేవలం రెండింటినే దక్కించుకుంది. వీటన్నింటినీ విశ్లేషించుకుని ముందుకు సాగితేనే పార్టీ పటిష్టతకు దోహదం చేస్తుంది. అయితే జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల్లో మాత్రం టీఆర్‌ఎస్‌ గణనీయమైన స్థాయిలో స్థానాలు గెల్చుకుంది. కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జెడ్పీ పీఠాలను దక్కించుకోగా, మెదక్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ప్రభావం చూపగలిగింది. తెలంగాణలో 6,525 ఎంపీటీసీ స్థానాలుండగా వాటిలో టీఆర్‌ఎస్‌ 1900 వరకు స్థానాలు దక్కించుకోగలిగింది. కాంగ్రెస్‌ 2,400 వరకు స్థానాల్లో గెలుపొందింది. 443 జెడ్పీటీసీ స్థానాల్లో మాత్రం టీఆర్‌ఎస్‌ 191 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్‌ పార్టీ 176 స్థానాలు గెలుచుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో తెలంగాణవాదం బలంగా ఉండటం స్థానిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు లాభించగా పట్టణ ప్రాంతాల్లో పార్టీ నిర్మాణాన్ని విస్మరించడం ఆ పార్టీకి చేదు ఫలితాలను ఇచ్చింది. తెలంగాణలో అధికారాన్ని చేపట్టబోయే పార్టీగా ప్రచారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ ఇప్పటికైనా సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించాలి. ప్రభుత్వ ఫలాలు ప్రజలకు చేరుతున్నాయో లేదో పర్యవేక్షించడానికి పార్టీ నిర్మాణం లేకపోతే కష్టమే. కేసీఆర్‌ ఇప్పటికైనా దీనిపై దృష్టి సారిస్తే మంచిది.