తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ప్రమాణం

01-main-03ffff

మహమూద్‌ అలీ, రాజయ్య

ఉప ముఖ్యమంత్రులు

11 కేబినెట్‌ మంత్రుల

ప్రమాణ స్వీకారం

పేదలు, వికలాంగుల

పెన్షన్‌ పెంపు

విశ్వనగరంగా హైదరాబాద్‌

ప్రతి హామీని నెరవేరుస్తా

ప్రభుత్వ ఉద్యోగులకు

స్పెషల్‌ ఇంక్రిమెంట్‌

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు

పోలీసులకు ఇక వీక్లీ హాఫ్‌

మహిళలపై దాడులను ఉపేక్షించం

మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ

సంక్షేమ శాఖలు నావద్దే

వీరి అభివృద్ధికే పెద్దపీట

హైదరాబాద్‌, జూన్‌ 2 (జనంసాక్షి) :

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సో మవారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో ఆయనతో గవ ర్నర్‌ ప్రమాణం చేయించారు. ప్రమాణస్వీకారానికి ముందు కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఉదయం 7. 30 గంటలకు అసెంబ్లీ ఎదురుగల గన్‌పార్క్‌ వద్దకు వెళ్లి తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అటు నుంచి నేరు గా 8 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. అక్కడ ముందుగా నిర్ణయించిన నిర్ణయం ప్రకారం 8.20 గం టలకు గవర్నర్‌ కేసీఆర్‌చే ముఖ్యమంత్రిగా ప్రమా ణస్వీకారం చేయించారు. ఆయనతో పాటు మరో 11మంది మంత్రులు

పదవీ స్వీకారం చేశారు. వరంగల్‌ జిల్లాకు చెందిన డాక్టర్‌. పి.రాజయ్య (స్టేషన్‌ ఘన్‌పూర్‌), నల్గొండ జిల్లాకు చెందిన జగదీశ్వర్‌రెడ్డి, మెదక్‌ జిల్లాకు చెందిన హరీష్‌రావు, కరీంనగర్‌ జిల్లాకు చెందిన కల్వకుంట్ల తారక రామారావు (సిరిసిల్ల), ఈటెల రాజేందర్‌ (హుజూరాబాద్‌), నిజామాబాద్‌ జిల్లాకు చెందిన పోచారం శ్రీనివాసరెడ్డి(బాన్స్‌వాడ), ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన జోగురామన్న, రంగారెడ్డి జిల్లాకు చెందిన పద్మం మహీందర్‌రెడ్డి, తాండూరు, హైదరాబాద్‌కు చెందిన మహమూద్‌ ఆలీ(ఎమ్మెల్సీ), టి.పద్మారావు (సికింద్రాబాద్‌), నాయినీ నరసింహారెడ్డిలు కేసీఆర్‌ మంత్రివర్గంలో తొలి తెలంగాణ ప్రభుత్వంలో మంత్రులుగా పదవీ స్వీకారం చేశారు. అయితే చాలా మంది ఆశావహుల పేర్లు జాబితాలో చోటు చేసుకోలేదు. ఉపముఖ్యమంత్రి పదవీ ఇస్తానన్న కొప్పుల ఈశ్వర్‌కు కేసిఆర్‌ మొండి చేయి చూపారు. తొలి జాబితాలో మహబూబ్‌నగర్‌, ఖమ్మం జిల్లాలకు ప్రాతినిధ్యం దొరకలేదు. మహిళలకు ఒక్కరికీ అవకాశం కల్పించలేదు. కేసిఆర్‌ మంత్రి వర్గంలో అగ్రవర్ణాల వారికి ఆరుగురికి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారికి ఒకరికి, మైనార్టీకి చెందిన వారికి ఒకరికి, బలహీన వర్గాలకు మూడు బెర్తులు లభించాయి. సామాజిక సమతుల్యం పాటించినట్లుగా కనిపించలేదు. ఉద్యోగ సంఘాలనేతలకు రెండు మంత్రి పదవులు ఇస్తానన్న కేసిఆర్‌ ఒక్కరికి స్థానం కల్పించలేదు. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో కొంతమేర నైరాశ్యం నెలకొంది.

ఎన్నికల హామీలో ఇచ్చిన విధంగా రాజకీయ అవినీతిని బొందపెట్టడంతో తెలంగాణ సర్వతో ముఖాభివృద్దికి కృషి చేస్తానని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు. 29వ రాష్ట్రంలో తెలంగాణ ఆవిర్భావం ఓ మధుర ఘట్టమని చంద్రశేఖర్‌రావు అభివర్ణించారు. సోమవారం పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి కేసీఆర్‌ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ప్రజా ఉద్యమాల విజయమని, తెలంగాణ విజయం అమరుల త్యాగ ఫలమని కొనియాడారు. ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర ప్రశంసనీయమన్నారు. ఉద్యమ స్ఫూర్తితోనే అభివృదిలోనూ దూసుకెళతామని, దేశంలో ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ది చెందేలా కృషి చేస్తామని అన్నారు. ఇందుకు రాజకీయాల్లో అవినీతి లేకుండా చూస్తామన్నారు. అవినీతిని బొందపెట్టి అధికారుల సహకారంతో ముందుకు సాగుతామన్నారు. అభివృద్దిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తానన్నారు. పాలన పారదర్శత పాటిస్తామని, సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తామన్నారు. రాజకీయ అవినీతిని సమూలంగా అంతమొదిస్తామని, రాజకీయ అవినీతికి పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని కేసీఆర్‌ హెచ్చరించారు. ఉద్యమంలో సకల జనుల సమ్మెల సువర్ణ అక్షరాలతో లిఖించబడినదిగా అభివర్ణించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగుతుందని సీఎం కేసీఆర్‌ హావిూ ఇచ్చారు. ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ ఇచ్చిన హావిూలను నెరవేరుస్తామని ఆయన తెలిపారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లతో పాటు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని చెప్పారు. సర్వీసు నిబంధనలను సరళీకృతం చేయనున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. వీలైనంత త్వరగా పీఆర్సీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలో ఉద్యోగులలకు హెల్త్‌కార్డులు జారీ చేస్తామన్నారు. వృద్ధులు, వితంతువులకు త్వరలో రూ.1000, వికలాంగులకు రూ.1500 ఫించన్‌లు ఇస్తామన్నారు. బీడీ కార్మికులకు వెయ్యి భృతిని, బలహీన వర్గాలకు రెండు బెడ్‌రూమ్‌ల ఇల్లు కట్టిస్తామని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో దళితులు, బీసీ, మైనార్టీల కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తామన్న కేసీఆర్‌ దళితులకే కోసం రూ.50 వేల కోట్లు కేటాయిస్తామని వెల్లడించారు. ఒక్క రూపాయి కూడా అవినీతి జరగనివ్వమని స్పష్టం చేశారు.

విశ్వనరంగా హైదరాబాద్‌

హైదరాబాద్‌ను విశ్వనగరంగా మలుస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో కేసీఆర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమే జ్‌ను తీర్చిదిద్దుతామన్నారు. మురికివాడల్లేని నగరంగా రాజధానిని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. శాంతి భద్రతల విషయంలో తెరాస ప్రభుత్వం నిక్కచ్చిగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. పరి శ్రమలు, పెట్టుబడులను ఆకర్షించడానికి ఒక విధానం ప్రకటిస్తామన్నారు. పోలీసు శాఖలో ఖాళీల భరీ ్తకి యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. పోలీసులకు వారానికి ఒకరోజు సెలవు ఉం డే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రియల్‌ ఎస్టేట్‌ను గాడిలో పెట్టి ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామని వెల్లడించారు. తెలంగాణలో పౌల్టీ, ఫార్మారంగాలకు భారీ ప్రోత్సాహం అంది స్తామన్నారు.

తెలంగాణ ఉద్యోగులకు కేసీఆర్‌ వరాలు

తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా కేసీఆర్‌ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్‌ ప్రకటిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని ప్రకటించారు. అవినీతి, పార దర్శక పాలనకు కంకణబద్ధులై ఉన్నామని స్పష్టం చేశారు.వీలైనంత త్వరగా పీఆర్సీ అమలు, త్వరలో హెల్త్‌ కార్డులు అందజేస్తామన్నారు. వృద్దాప్య, వితంతువులకు నెలకు రూ.వెయ్యి పింఛను ఇస్తా మన్నారు. వికలాంగులకు రూ.1500, బీడీ కార్మికులకు రూ.వెయ్యి పింఛను ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రజలు ఆత్మగౌరవంతో జీవించేలా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు కట్టిస్తామన్నారు. దేశానికి విత్తనాగారంగా తెలంగాణ నిలుస్తుందన్నారు. గోదావరి, కృష్ణా జలాలతో తెలంగాణ భూములు తడుపుతామని పేర్కొ న్నారు. తెలంగాణలో విద్యుత్‌ కొరత ఉండటం బాధాకరమే అయినా… రాబోయే ఏళ్లలో మిగులు విద్యుత్‌ ఉండేలా కృషి చేస్తామన్నారు. త్వరలో రూ.లక్షలోపు రుణాలు మాఫీ చేస్తామని కేసీఆర్‌ ప్రక టించారు.చరిత్రలో తెలంగాణ ఉద్యమం శాశ్వతంగా నిలిచిపోతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీ ఆర్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ స్పెషల్‌ ఇంక్రిమెంట్‌ ఇవ్వనున్నట్లు చెప్పారు. తెరాస పాలన ప్రజలే కేంద్రబిందువుగా సాగుతుందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెరాస పాలన ఉంటుందన్నారు. రాజకీయ అవినీతిని తుదముట్టిస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ అవ తరణ ప్రజా ఉద్యమ, అమర వీరుల విజయమేనని ఆయన అభివర్ణించారు. 1969 నుంచి ఉద్యమాలు జరిగినా ఈ దఫా ఒక కొత్త చారిత్రక ఘట్టాన్ని తెలంగాణ ప్రజలు ఆవిష్కరించి తెలంగాణను సాధించారన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర అనిర్వచనీయమని, శ్లాఘనీయమని, సువర్ణ అక్షకాలతో లిఖించదగినదని ఆయన పేర్కొన్నారు. 13 ఏళ్లుగా అహింసా మార్గంలో నడిచిన తెలంగాణ ఉద్యమం అనన్య సామాన్యమని ఆయన అభివర్ణించారు. ప్రపంచ చరిత్రకే ఒక ఆదర్శ వంతంగా తెలంగాణ ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఇదే ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లి రాష్ట్రాన్ని అభ్యదయం వైపు తీసుకువెళతామని ఆయన హామీ ఇచ్చారు. కోటి ఆశలతో తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌ పాలన వైపు చూస్తున్నారని ప్రజలే కేంద్ర బిందువుగా వారి సమస్యలే ఇతి వృత్తంగా ముందుకు పోతామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. రాజకీయ అవినీతిని కూకటివేళ్లతో సమూలంగా అంతం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. అవినీతికి పాల్పడితే ఎంతటివారినైనా కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. తెలంగాణ ఉద్యోగుల పట్ల తమ ప్రభుత్వం స్నేహ పూర్వకంగా వ్యవహరిస్తుందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్‌ ఇస్తామన్నారు. ప్రతీకార్యాలయంలో అధునాతన సౌకర్యాలను కల్పిస్తామని, ప్రతి ఉద్యోగికి, విశ్రాంత ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వంతో సమానంగా వేతనాలు ఇస్తామన్నారు. సర్వీసు నిబంధనలను సరళీకృతం చేస్తామన్నారు. మెరుగైన వేతన సవరణ సంఘాన్ని (పీఆర్సీ) త్వరలోనే అమలు చేస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ప్రతి ఉద్యోగికి హెల్త్‌కార్డులను ఇవ్వనున్నట్టు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని, పథకాల అమలులో అవినీతి రహితంగా ఉండాలన్న విషయానికి తాము కంకణ బద్ధులమై ఉన్నామన్నారు. ఇప్పటి వరకు సంక్షేమంపై ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరిని అవలంబించాయన్నారు. వృద్ధులకు, వితంతువులకు వెయ్యి రూపాయలు, వికలాంగులకు 1500 రూపాయల పింఛన్‌ను ఇవ్వనున్నట్టు కేసీఆర్‌ వెల్లడించారు. బీడీ కార్మికులకు నెలకు వెయ్యి రూపాయల భృతి ఇస్తామని, భారత దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమానికి పెద్ద పీట వేస్తామన్నారు. తెలంగాణలో పేదలు ఆత్మగౌరవంతో, నాగరీకతతో జీవించేందుకు 125 చదరపు గజాలలో రెండు బెడ్‌రూమ్‌లు, ఒక హాలు, ఒక కిచెన్‌, ఉచితంగా నిర్మిస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం దళిత, గిరిజనులు, బీసీలు, మైనారిటీల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తామన్నారు. ఐదు సంవత్సరాలలో ఈ వర్గాలకు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని, కేవలం దళిత అభివృద్ధికే రూ.50 వేల కోట్లను కేటాయిస్తామన్నారు. నిప్పు కణికలాంటి అధికారులను ఈ శాఖకు తీసుకున్నామని, ఈ సంక్షేమ శాఖను తన వద్దే ఉంచుకున్నట్టు ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్ధంగా, పారదర్శకంగా పనిచేసేందుకు, మేధావులు, నిష్ణాతులతో కూడిన తెలంగాణ రాష్ట్ర సలహా మండలిని ఏర్పాటు చేస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్ద పీట అగ్ర తాంబూలం ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. రైతులకు లక్ష రూపాయలలోపు రుణాలను మాఫీని త్వరలోనే అమలు చేస్తామన్నారు. ప్రపంచంలోనే వ్యవసాయ శాస్త్రవేత్తలంతా తెలంగాణలోని పది జిల్లాల్లో విత్తనాలు పండించేందుకు సానుకూలమని చెప్పారని, ఇందుకోసం 75శాతం సబ్సిడీతో గ్రీన్‌హౌస్‌ కల్టివేషన్‌ను ప్రోత్సహిస్తామన్నారు. రైతులు దిగుబడి పెంచుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తామన్నారు. పైలెట్‌ ప్రాజెక్టుల ద్వారా జిల్లాకు వెయ్యి ఎకరాలలో విత్తనాల అభివృద్ధిని ప్రోత్సహిస్తామని, వ్యవసాయ పునరుజ్జీవనానికి కృషి చేస్తామన్నారు. తెలంగాణ భూములన్నీ కృష్ణా, గోదావరి జలాలతో పునీతం కావాలన్నదే తమ లక్ష్యమన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. త్వరలోనే వీటిని పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే ప్రపంచంలో రెండు రంగాల్లో తెలంగాణ ముందుందని, ఫార్మ, ఐటీ రంగాలలో దేశంలో మూడింట ఒక వంతు తెలంగాణ నుంచే ఉత్పత్తి అవుతున్నాయన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సకల హంగులతో ప్రపంచం నివ్వెర పోయేలా హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడం ఖాయమన్నారు. సామాజిక జీవనంలో శాంతి భద్రతలకు ప్రాముఖ్యత ఇవ్వాలని, వీటి విషయంపై టీఆర్‌ఎస్‌ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేసిన కేసీఆర్‌ దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. ప్రపంచ స్థాయి గూఢచారి వ్యవస్థను తాయారు చేస్తామని, ఆరు నుంచి 10వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కచ్చితంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్‌ విభాగాల్లో ఉన్న సెంట్రల్‌ పోలీస్‌, ఏఆర్‌ పోలీసు, ట్రాఫిక్‌ పోలీసు అన్ని కాకుండా అన్ని శాఖలను కలిపి ఒకే గొడుకు కిందకు తీసుకువస్తామన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. పోలీసులకు సామాజిక భద్రత కల్పించేందుకు వారానికి ఒక ఒక రోజు సెలవు దినంగా ప్రకటిస్తామన్నారు. పోలీసు శాఖలో పాత బడిన వాహనాల స్థానాల్లో కొత్తవాహనాలు సమకూరుస్తామన్నారు. ట్రాఫిక్‌ పోలీసులు పడుతున్న ఇబ్బందులు తనకు తెలుసు అని, వారికి స్పెషల్‌ మెడికల్‌ అలవెన్స్‌ ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. పని వేళలు కూడా రెండు గంటలు తగ్గిస్తామన్నారు.పోలీసు వ్యవస్థకు కావాల్సిన నిధులను ఎప్పటికప్పుడు మంజూరు చేస్తామన్నారు. హైదరాబాద్‌నగరంలో ఐటీ ఐఆర్‌ వంటి సంస్థలు ఏర్పడబోతున్నాయని, అంతర్జాతీయ ఐటీ కంపెనీలు కూడా తెలంగాణకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. జంటనగరాలు హైదరా బాద్‌ కమిషనరేట్‌ పరిధిలో శాంతి భద్రతలను పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. అం తర్జాతీయ స్థాయిలో పోలీసు కంట్రోల్‌ రూమ్‌లను కార్యాలయాలను నిర్మించనున్నట్టు ఆయన తెలి పారు. తాము చేపట్టబోయే పథకాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని శాసనసభ ద్వారా తెలియ ుజేస్తానని కేసీఆర్‌ ప్రకటించారు. కేంద్రంతో, పక్క రాష్ట్రాలతో సామరస్య పూర్వకంగా తత్ససం బంధాలు కొనసాగిస్తామన్నారు. సర్వేజనోసుఖినోభవంతు అన్న మాదిరిగా అందరూ ఆరోగ్యంగా, సుఖంగా ఉండాలని కేసీఆర్‌ ఆకాంక్షించారు.

ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్‌ నిబంధనలను సరళీకృతం చేస్తానని తెలం గాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హామీనిచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా సోమవారం ప్రమాణస్వీకారం ఆయన సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో పోలీసు గౌరవవందనం స్వీకరించారు. అనంతరం అక్కడి నుండి నేరుగా 12.15 గంటలకు తెలంగాణ రాష్ట్రానికి నిర్మించిన నూతన గేట్‌ (మింట్‌ కాంపౌండ్‌) నుంచి సచివాలయంలోకి ప్రవేశించారు. వస్తూనే సచివాలయంలోని నల్లపోచమ్మ దేవాలయంలో ఎంపి కవిత, కె.కేశవరావుతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సచివాలయం తెలంగాణ ఉద్యోగుల సంఘం సి బ్లాక్‌ ఎదుట ఏర్పాటు చేసిన స్వాగత సభలో పాల్గొని ప్రసంగించారు. ఉద్యోగుల సర్వీస్‌ నిబంధనలకు సంబంధించి లావుపాటి పుస్తకం ఉందని, ఇంత లావుపాటి పుస్తకం ఉద్యోగులకు అవసరం లేదని, దానిని ఒకటి, రెండు పేజీలకు కుదించి సరళీకృతంచేసి రూపొందిస్తామన్నారు. ఆ బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఉద్యోగులకు వసతులు, సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్‌కార్డులను త్వరలో అందజేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్‌ ఇంక్రిమెంట్‌ ఇస్తామన్నారు. పిఆర్‌టి అంశంపై మాట్లాడుతూ, దీనిపై ఎంతో రాద్ధాంతం చేస్తున్నారని, లేఖలు, పిటిషన్లతో నానా ఇబ్బందులు పడుతున్నారని, ఇకపై అలాంటి ఇబ్బందులు ఉద్యోగులు పడే అవసరం లేదన్నారు. సాధ్యమైనంత త్వరలో పిఆర్‌సి అమలు చేస్తామని అన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందిస్తామని అన్నారు. ఉద్యోగులకు ఎలాంటి సమస్యలున్నా నేరుగా తనతో మాట్లాడవచ్చని, మధ్యవర్తిత్వం అవసరం లేదన్నారు. తాను ఆశించిన ప్రగతి, బంగారు తెలంగాణ సాధించాలంటే ఉద్యోగుల పాత్ర కీలకమైందన్నారు. ప్రభుత్వం ప్రతినిత్యం ఉద్యోగులతో స్నేహశీలతతో వ్యవహరిస్తుందన్నారు. ఉద్యోగులు తనకు మిత్రులు, అన్నా, అక్క, చెల్లెళ్లతో సమానమని అన్నారు. ఉద్యోగులంటే గత ప్రభుత్వాలు దుష్టులుగా, సమాజంలో వేరేవారికి చూసేవారని అన్నారు. ఇప్పుడు అలాంటివి ఉండబోవని అన్నారు. కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం కావున మనకు ఇంకా నిర్దిష్టమైన జీవోలు, చట్టాలు లేవని, వాటిని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రజలు నేటిరోజు కోసం ఎంతో ఆశతో ఎదురు చూశారని, వారి కలలు నేడు సాకారమయ్యాయని అన్నారు. మనకు బాస్సులెవ్వరూ లేరని, బాస్సంటే ప్రజలేనని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఉద్యోగులు రోజుకో గంట ఎక్కువ పనిచేస్తామని హామీనిచ్చినందుకు కెసిఆర్‌ వారిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి బంగారు తెలంగాణాను సాధించుకుందామని అన్నారు. తెలంగాణ బంగారు పిచుకవంటిదని, దీన్ని ఇన్నాళ్ళు బంధించి చెరబట్టారని అన్నారు. నేటితో ఆ బంధాలు తెగిపోయాయని అన్నారు. కాలం ఎంతో విలువైందని, దీనిని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉద్యమాలు, ఆందోళనలు, సమ్మెలకు ఆస్కారం ఇవ్వరాదన్నారు. సమస్యలు ఏవైనా ఉంటే ఇట్టే పరిష్కరించుకుందామన్నారు. సామరస్యంతో కలిసి పనిచేసి తెలంగాణ శక్తి చాటాలని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం సచివాలయం సి బ్లాక్‌లోని ఆరవ అంతస్తులో సిఎం కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నం 12.15 గంటలకు నూతన ద్వారం ద్వారా సచివాలయంలోకి ప్రవేశించిన ఆయన నల్లపోచమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటుపిమ్మట సచివాలయ ఉద్యోగులు నిర్వహించిన ఆహ్వాన సభలో పాల్గొని, అక్కడినుంచి సి బ్లాక్‌లోకి వెళ్ళారు. అక్కడ ఆయనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో పాటు పలువురు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆయన సిఎం కార్యాలయంలోకి ప్రవేశించారు. సిఎం స్థానంపై అధిరోహించిన ఆయన తెలంగాణ రాజముద్రను ఖరారు చేస్తూ రూపొందించిన ఫైలుపై మొదటి సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్‌ ఎంపి కవిత, టిఆర్‌ఎస్‌ సీనియర్‌ కె.కేశవరావు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ మంత్రివర్గం శాఖలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. కెసిఆర్‌కు ముఖ్యమంత్రితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమం, మునిసిపల్‌, పట్టణాభివృద్ధి, విద్యుత్‌, బొగ్గు, జిఎడి తదితర శాఖలు కేటాయించారు. మహమూద్‌ అలీకి రెవెన్యూశాఖతో పాటు ఉపముఖ్యమంత్రి, రిలీఫ్‌, రియాబిటేషన్‌, విఎల్‌సి, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలు కేటాయించారు. అలాగే టి.రాజయ్యకు ఉపముఖ్యమంత్రితో పాటు వైద్యఆరోగ్యశాఖను కేటాయించారు. నాయిని నర్సింహారెడ్డికి హోంమంత్రితోపాటు జైళ్ళు, ఫైర్‌ సర్వీస్‌, సైనికుల సంక్షేమం, లేబర్‌ ఇంప్లాయింట్‌శాఖను కేటాయించారు. కాగా, ఈటెల రాజేందర్‌కు ఆర్థికశాఖతో పాటు ప్లానింగ్‌, చిన్నమొత్తాల పొదుపు, అక్షరాస్యత, కంజూమర్‌ ఎఫైర్స్‌, తూనికలు కొలతలు, సివిల్‌ సప్లయ్‌ శాఖలు కేటాయించారు. పోచారం శ్రీనివాసరెడ్డికి వ్యవసాయంతో పాటు హార్టికల్చర్‌, పశుసంవర్ధక, మత్స, పాడి పరిశ్రమాభివృద్ధి, విత్తనాభివృద్ధి శాఖలను కేటాయించారు. హరీష్‌రావుకు నీటి పారుదల శాఖతో పాటు మార్కెటింగ్‌శాఖను కేటాయించారు. పద్మారావుకు ఎక్సైజ్‌శాఖ, మహేందర్‌రెడ్డికి రవాణాశాఖ, కెటిఆర్‌కు ఐటి, పంచాయితీరాజ్‌ శాఖలు కేటాయించారు. జోగు రామన్నకు అడవులు, పర్యావరణ పరిరక్షణశాఖలు కేటాయించారు. టి.జగదీష్‌రెడ్డికి విద్యాశాఖ కేటాయించారు. వీటిని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదం తెలిపారు.

ముఖ్యమంత్రిగా కొలువుదీరిన కె.చంద్రశేఖరరావు వడివడిగా నిర్ణయాలు చేపడుతున్నారు. రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పాలనా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అనుభవజ్ఞులైన ఆరుగురు ఐఎఎస్‌ అధికారులను ప్రభుత్వ సలహాదారులుగా నియమిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. వీరిలో నలుగురు రిటైర్డ్‌ అధికారులు ఉన్నారు. వీరిలో ఆర్‌.విద్యాసాగరరావు, ఎకె గోయల్‌, ఎ.రామలక్ష్మణ్‌, బివి పాపారావు, కెవి రమణాచారి, జిఆర్‌రెడ్డిలు ఉన్నారు. వీరంతా ఏడాది పాటు ప్రభుత్వ సలహాదారులుగా పదవిలో కొనసాగు తున్నారు.

అమరవీరుల స్తూపానికి కేసీఆర్‌ ఘన నివాళి

కోట్లాది తెలంగాణ ప్రజల స్వప్నాన్ని సాకారం చేసిన తెలంగాణ రాష్ట్రసమితి రథసారథి కె. చంద్రశేఖరరావు సోమవారం ఉదయం పండితులు నిర్ణయించిన శుభ ముహూర్తాన నవ రాష్ట్రమైన తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానపికి ముందు తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. గన్‌పార్క్‌ వద్ద ఆయన అమరులకు నివాళలు అర్పించారు. అక్కడి నుంచి ఆయన రాజ్‌భన్‌కు చేరుకున్నారు. ఆయనకు పార్టీ శ్రేణులు, ఎంపీలు ఎమ్మెల్యలు, అధికారుల ఘనంగా స్వాగతం పలికారు. గన్‌ పార్క్‌ నుంచి కేసీఆర్‌ రాజ్‌భవన్‌ చేరుకోవడంతోనే అక్కడ ఆయనకు ఘనస్వాగతం లభించింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ప్రమాణస్వీకార మ¬త్సవానికి రాజ్‌భవన్‌ను అందంగా అలంకరించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన అతిధులకు మంగళవాద్యాల నడుమ స్వాగతం పలికారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన కేసీఆర్‌ ఉదయం సరిగ్గా 8.13 గంటలకు రాజ్‌భవన్‌లోకి ప్రవేశించారు. కేసీఆర్‌ ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌ సమక్షంలో సంతకం చేశారు. అంతకుముందు ఆయన తమ స్వగృహంనుంచి నేరుగా గన్‌పార్క్‌కు చేరుకుని ముకుళిత హస్తాలతో వినమ్రంగా నమస్కరిస్తూ అమరవీరులకు నివాళి అర్పించారు. అనంతరం ఆయన నేరుగా రాజ్‌భవన్‌ చేరుకున్నారు. తారక రామారావు కేబినెట్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తిన్నగా వెళ్లి తండ్రి కేసీఆర్‌ పాదాలకు నమస్కారం చేశారు. కేబినెట్‌లో మొదట అసలు ఆరుగురే ఉంటారని భావించారు. అయితే ఈ జాబితాలో కొన్ని మార్పులు చేర్పులు సోమవారం ఉదయం వరకూ జరుగుతూనే ఉన్నాయని తెలిసింది. సోమవారం 11 మంది మాత్రమే ప్రమాణం చేసినా మరో ఆరుగురికి రెండో విడత కేబినెట్‌ విస్తరణలో అవకాశం దొరుకుతుందని భావిస్తున్నారు. సామాజిక వర్గాల సవిూకరణల ప్రకారమే కేసీఆర్‌ కేబినెట్‌ను రూపొందించినట్టు తెలుస్తున్నది. వీరిలో మొత్తం నలుగురు రెడ్డి సామాజిక వర్గీయులు, బీసీలు ముగ్గురు, సీఎంతో కలిపి ముగ్గురు వెలమ, ఒక ఎస్సీ, ఒక మైనారిటీలకు చెందినవారు. కాగా, ఈ కేబినెట్‌లో ఎస్టీలకు, మహిళలకు ప్రాతినిధ్యం లభించలేదు. అలాగే జిల్లాల ప్రకారం చూస్తే ఖమ్మం, మహబూబ్‌నగర్‌లకు కూడా ప్రాతినిధ్యం అందని ద్రాక్షే అయ్యింది. మాల సామాజిక సంఘానికి చెందిన కొప్పుల ఈశ్వర్‌కు ఈ కేబినెట్‌లో చోటు లభిస్తుందని ఆశించారు. దాంతో ఆయన అసంతృప్తి చెందినట్టు తెలుస్తున్నది. అయితే ఆయన స్పీకర్‌గా వెళ్లవచ్చునని పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి. అలాగే ఉద్యోగ సంఘాలనుంచి స్వామి గౌడ్‌ లేదా శ్రీనివాస్‌ గౌడ్‌కు కేబినెట్‌ విస్తరణలో చోటు లభించవచ్చు. అలాగే వరంగల్‌కు చెందిన మాజీ మంత్రి కొండా సురేఖకు కూడా కేబినెట్‌లో మంత్రిగా చోటు లభిస్తుందని భావించారు. ఆమెకు కూడా కేబినెట్‌ విస్తరణలో అవకాశం దక్కవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఉద్యమంలో ముందున్న స్వామిగౌడ్‌, శ్రీనివాస్‌గౌడ్‌లకు స్థానం దక్కలేదు. అలాగే కెసిఆర్‌ను పార్టీ పెట్టినప్పటినుంచి వెన్నంటి ఉన్న మధుసూధనాచారికి కూడా మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. ఖమ్మం నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే జలగం వెంకట్రావుకు కూడా స్థానం దక్కలేదు. ముందుగా ఆయనకు మంత్రి పదవి ఇస్తారని అనుకున్నా సామాజిక సమీకరణాల కారణంగా ఇవ్వలేకపోయారు.