వందనం చాలు.. పాదాభివందనం వద్దు

narendramdi

భాజపా ఎంపీలకు మోడీ హితవు

న్యూఢిల్లీ, జూన్‌ 6 (జనంసాక్షి) :

పార్టీ పార్లమెంట్‌ సభ్యులు తనకు పాదాభివందనాలు చేస్తూ వ్యక్తి పూజతో కాలం గడపవద్దని నమస్కారం సరిపోతుందని ప్రధాని నరేంద్రమోడీ హితవు పలికారు. సమస్యలపై నిర్లక్ష్యం వద్దని క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రధానమంత్రి మోడీ బీజేపీ ఎంపీలకు సూచించారు. 16వ లోక్‌సభ ఎన్నికల తర్వాత సభ్యుల ప్రమాణ స్వీకారం ముగిసిన నేపథ్యంలో మోడీ శుక్రవారం పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. 20 నిమిషాల పాటు ప్రసంగించిన ఆయన తొలిసారిగా ఎన్నికైన ఎంపీలకు పలు సూచనలు చేశారు. సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని సున్నితంగా హెచ్చరించారు. పార్లమెంట్‌ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని పూర్తిగా సన్నద్ధమై వచ్చి సభలో ప్రసంగించాలని స్పష్టం చేశారు. సమస్యలను బాగా అధ్యయనం చేయాలని కింది స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎలాంటి సమస్యనూ నిర్లక్ష్యం చేయకూడదన్నారు. క్షేత్ర స్థాయిలో సంబంధాలు పటిష్టం చేసుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో నిస్తేజం దరికి రానీయొద్దని తెలిపారు. ప్రభుత్వ పథకాలు, సందేశాలను క్షేత్ర స్థాయిలోని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అతిపెద్ద బాధ్యత ఎంపీలపై ఉందన్నారు. లోక్‌సభ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. చర్చల్లో పాల్గొనడం ద్వారా వివిధ అంశాలపై విస్తృత అవగాహన పెంపొందించుకోవచ్చన్నారు. తరచూ పాదాభివందనం చేస్తుండడంపై మోడీ అసహనం వ్యక్తం చేశారు. తనకు కానీ, పార్టీలోని ఇతర నేతలకు ఎంపీలు పాదాభివందనం చేయొద్దని సూచించారు. వ్యక్తి ఆరాధన మంచిది కాదని స్పష్టం చేశారు. పాదాభివందనాలు చేయడం మానేసి పార్లమెంటేరియన్లుగా కష్టపడి పని చేయాలని హితవు పలికారు. మీడియాతో మర్యాదపూర్వకంగా మెలగాలని అనవసర వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. అవసరమైతే తమ నియోజకవర్గ సమస్యలపై మాట్లాడాలని తెలిపారు. బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ మాట్లాడుతూ.. సామాన్య ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పని చేయాలని సూచించారు. అలా చేయడం వల్లే ఇద్దరు ఎంపీలు ఉన్న పార్టీ ప్రస్తుత లోక్‌సభలో 282 మంది ఎంపీలను గెలుచుకుందన్నారు. సాధారణ ప్రజల ఆకాంక్షల కోసం కష్టపడి పని చేయాలని పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ కోరారు.