మింగ మెతుకు లేకున్నా మీసాలకు సంపెంగ నూనెందుకు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హంగూ ఆర్భాటాల పేరుతో అక్షరాల రూ.30 కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. పదేళ్ల తర్వాత అధికారం వచ్చిందనే సంతోషంలో బాబు అట్టహాసంగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయించాడు. అధికారయంత్రాంగాన్నంతా గుంటూరులోనే మోహరింపజేసి ఏర్పాట్లు చేయిస్తున్నాడు. 70 ఎకరాల సువిశాల స్థలంలో షామియానాలు, చైనా టెంట్లు ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి గుంటూరు నగరం వరకు భారీ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. గుంటూరు నగరాన్ని పసుపుమయం చేసేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లను ఆ పార్టీ ముఖ్యులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఐదు లక్షల మంది ప్రజలు, టీడీపీ కార్యకర్తలు పాల్గొనేలా ప్రమాణ స్వీకారోత్సవానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ వర్షం కురిసినా, పెద్ద ఎత్తున గాలిదుమారం వీచినా ఎలాంటి ఇబ్బంది కలుగకుండా రెయిన్ ప్రూఫ్ టెంట్లు ఇతర భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 50 వేల మంది ముఖ్యమైన అతిథులు కూర్చునేలా ఈ టెంట్ల కింద కుర్చీలు వేశారు. ప్రమాణ స్వీకారం చేయబోతున్నది రాత్రి వేళ కావడంతో భారీ ఎత్తున ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారు. గుంటూరు నగరమంతా ఫ్లడ్‌లైట్ల వెలుతులో వెలిగిపోయేలా తీర్చిదిద్దారు. బాబు ప్రమాణ స్వీకారానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాయకుడు హంగూ ఆర్భాటాలతో ప్రమాణం చేయడం తప్పుకాదేమో కానీ ఆ రాష్ట్రం కొత్తగా ఏర్పడింది. విపరీతమైన లోటు బడ్జెట్ ఉన్నది. అవశేష ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్న ఆలోగా కొత్త రాజధాని నిర్మించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సీమాంధ్ర ప్రాంతంలో పర్యటించి రాజధాని ఏర్పాటుకు అనువుగా ఉన్న ప్రాంతాలపై సమాచారం సేకరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చర్చించి ఒక ప్రాంతాన్ని ఎంచుకొని రాజధానిగా నిర్మించే అవకాశముంది. అందుకోసం విజయవాడ, గుంటూరు నగరాల మధ్య ఉన్న స్థలాన్ని అనువైనదిగా ఎంపిక చేశారు. గుంటూరు కాబోయే రాజధాని అని సంకేతాలిచ్చేందుకే చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని అక్కడ పెట్టుకున్నట్టు టీడీపీ శ్రేణులు చెప్తున్నాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏ ఒక్కరూ కూడా ఇంత భారీ స్థాయిలో ప్రమాణ స్వీకారానికి ఖర్చు చేయలేదు. ఒకవేళ ప్రజల మధ్య ప్రమాణ స్వీకారం చేయదలిస్తే లాల్‌బహదూర్ స్టేడియాన్ని అందుకు ఉపయోగించుకునేవారు. అక్కడ వేదిక ఏర్పాట్లు మినహా మిగతా కొత్త ఏర్పాట్లేవి అవసరం లేదు. అందుకు అంతగా డబ్బు ఖర్చూ కాదు. మొన్నటికి మొన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడివడిన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన సింప్లిసిటీని చాటుకున్నారు. రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా నిర్వహించిన కార్యక్రమంలో కేసీఆర్‌తో పాటు 11 మంది కేబినెట్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మిగులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రే ప్రమాణ స్వీకారానికి హంగూ ఆర్భాటాలు లేకుండా జాగ్రత్త వహిస్తే తీవ్రమైన లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం ప్రమాణ స్వీకారానికి 70 ఎకరాల భారీ స్థలంలో ఏర్పాట్లు అవసరమా? కొత్త రాజధాని పేరుతో రూ.5 వేలు, రూ.10 వేలు ఇవ్వాలంటూ చందాలు అడుగుతున్న ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి రూ.30 కోట్ల ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేయడం సమర్థనీయమా? దీన్ని నిలదీసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌పై టీడీపీ శ్రేణులు ఎదురుదాడైతే చేయగలిగాయి కానీ ఆయన ప్రశ్నలోని నిజాయితీకి సమాధానం మాత్రం చెప్పలేకపోతున్నాయి. ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ప్రమాణ స్వీకార ఏర్పాట్లను సమర్థించినా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఇంత భారీగా డబ్బును వెచ్చించడం అవసరమా? అనే సగటు సీమాంధ్ర పౌరుడి ప్రశ్నకు మాత్రం వాళ్లు సమాధానం చెప్పి తీరాలి. సీమాంధ్రలో అధికారమే పరమావధిగా అలవికాని హామీలిచ్చిన చంద్రబాబు రుణమాఫీపై ఎన్ని పిల్లిమొగ్గలు వేశాడో..
సీమాంధ్ర ప్రజలకు, రైతులకు రుణమాఫీ వల్ల తలెత్తే అనర్థాల పేరుతో వారికి అనుకూలమైన మీడియాలో ఎలాంటి కథనాలు వండి వడ్డించారో అందరికీ తెలిసిందే. తన మొదటి సంతకం రుణమాఫీ ఫైలు పైనే చేస్తామని చంద్రబాబు బయటికి చెప్తున్నా పలానా తేదీ నుంచి రుణాలు మాఫీ చేస్తామనే స్పష్టత ఇంతవరకు రాలేదు. రుణ మాఫీ పేరుతో రైతులకు కొత్త రుణాలు ఇవ్వడంపైనా అనేక సందేహాలు ముసురుకుంటున్నాయి. రైతులకు బాండ్లు జారీ చేసి చేతులు దులుపుకోవాలనే ప్రయత్నంలో బాబు అండ్ కో ఉన్నట్లు సుస్పష్టంగా తెలుస్తోంది. రైతులు, డ్వాక్రా మహిళలకు చెందిన రుణాలు లక్ష కోట్ల వరకు ఉన్నాయి. అవన్నీ మాఫీ చేస్తే ఆంధ్రప్రదేశ్ సర్కారు తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోతుంది. కొత్త రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు సరిపోయే అవకాశాలే లేవు. ఈనేపథ్యంలో ప్రమాణ స్వీకారం పేరుతో టీడీపీ, బాబు చేస్తున్న ఆర్భాటం ప్రజాధనాన్ని ముమ్మాటికీ దుర్వినియోగం చేయడమే. దీనిపై టీడీపీ నేతలు ఎంతగా ఎదురుదాడి చేసినా ఈ ప్రశ్న వెనుక ఉన్న చేదు నిజాన్ని అంగీకరించక తప్పదు. ఇవ్వాల కాకపోయినా రేపైనా ప్రజలు కచ్చితంగా దీనిపై ప్రశ్నిస్తారు. ప్రజల నుంచి ఎంతమేరకు విరాళాలు సేకరిస్తే రూ.30 కోట్లు అవుతాయో టీడీపీ నేతలు విస్మరిస్తున్నారా? కేసీఆర్‌లాగా చంద్రబాబు నిరాడంబరంగా ప్రమాణ చేసి తన హుందా తనాన్ని చాటుకోవాల్సింది. అసలే లోటు బడ్జెట్, అప్పుల ఊబిలో చిక్కుకున్న సీమాంధ్ర ప్రజలను మరిన్ని కష్టాల్లోకి నెట్టడం మినహా ఈ భారీ ఏర్పాట్ల వల్ల ఒనగూరేదేమీ లేదు. ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూడాలంటే నిర్దిష్టమైన పారిశ్రామిక విధానంతో ముందుకెళ్లాలే తప్ప ఆర్భాటాలతో కాదు. ఈ విషయాన్ని టీడీపీ నేతలు గుర్తిస్తే మంచిది. మింగ మెతుకు లేకున్నా మీసాలకు సంపెంగ నూనె చందంగా బాబు తన ప్రమాణ స్వీకారంలో ఆర్భాటం ద్వారా సీమాంధ్ర అభివృద్ధిని మేడిపండు చేయదల్చుకున్నాడా? ఇవే కాదు ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముమ్మాటికీ బాబు అండ్ కో పైన ఉన్నది.