విద్యార్థుల నిర్లక్ష్యం.. అధికారుల అలక్ష్యం


high-couts
కళాశాల యాజమాన్యం పట్టింపులేనితనంతోనే విద్యార్థుల బలి
మెజిస్టీరియల్‌ కమిటీ నివేదిక
వీఎన్‌ఆర్‌ విజ్ఞానజ్యోతి కళాశాలకు హిమాచల్‌ హైకోర్టు తాకీదులు
హైదరాబాద్‌, జూన్‌ 20 (జనంసాక్షి) :
విద్యార్థులు, లార్జీ డ్యా మ్‌ అధికారుల నిర్లక్ష్యం, వీఎన్‌ఆర్‌ విజ్ఞాన్‌జ్యోతి ఇంజినీరింగ్‌ కళాశాల పట్టింపులేని తనంతోనే 24 మంది విద్యార్థులు బియాస్‌ నదిలో కొట్టు కుపోయారని ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మెజిస్టీరియల్‌ కమిటీ నివేదించింది. లార్జీ డ్యామ్‌ అధికారులు ఎలాంటి హెచ్చరికలు లేకుండా నీటిని కిందికి వదిలి 24 మంది మృతికి కారణమయ్యారని పేర్కొంది. అదే సమయంలో విద్యార్థులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, పెద్ద ఎత్తున నీళ్లు వస్తున్న ఒడ్డుకు చేరడానికి ప్రయత్నించలేదని తేల్చింది. కళాశాల యాజమాన్యం ఇండస్ట్రియల్‌ టూర్‌ పేరుతో విద్యార్థులు పంపి వారు ఎక్కడికి వెళ్తున్నారో పర్యవేక్షించకుండా ఈ పెను ప్రమాదానికి కారణమయ్యిందని పేర్కొంది. మరో వైపు వీఎన్‌ఆర్‌ విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్‌ కళాశాలకు హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీచేసింది. పదిహేను రోజుల క్రితం కళాశాలకు చెందిన సుమరు 42 మంది విద్యార్థుల్లో 24 మంది విద్యార్థులు బియాస్‌ నదిలో కొట్టుకుపోయిన ఉదంతంపై సుమోటోగా తీసుకున్న హిమాచల్‌ హైకోర్టు నేడు కళాశాల యాజమాన్యానికి నోటీసులు జారీచేసింది. కళాశాలకు చెందిన విద్యార్థులు బియాస్‌ నదిలో దిగేందుకు ఎవరూ అనుమతించారు. అన్నదానిపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని కోర్టు నోటీసులో పేర్కొంది. ఇలాఉండగా బియాస్‌ నదిలో విద్యార్థుల విషాధంపై మండి డివిజణ్‌ కమిషన్‌ శుక్రవారం తన నివేదికను హైకోర్టుకు సమర్పించింది. డ్యామ్‌ అధికారుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని డివిజన్‌ ఆ నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా డ్యామ్‌ నుంచి ఒక గంటలో 45 క్యూసెక్కుల నీరు విడుదలైందని, నీటి విడుదల సమయంలో స్పష్టమైన నిబందనలు పాటించలేదని, వార్నింగ్‌ సిస్టమ్‌ సరిగా లేదని పవర్‌హౌస్‌లో అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో విద్యార్థులు మృతి చెందారని డివిజన్‌ కమిషన్‌ హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఇప్పటి వరకు 13 మృతదేహాలను మాత్రమే వెలికితీశారు. విద్యార్థుల మృతదేహాలకోసం అక్కడ ముమ్మర గాలింపు చర్యలు కొనసాగున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గత వారం మంత్రి నాయిని నరసింహారెడ్డి గాలింపు చర్యలను పర్యవేక్షించగా, ప్రస్తుతం మంత్రి మహేందర్‌రెడ్డి తెలంగాణకు చెందిన పలువురు గజ ఈతగాళ్లను తీసుకువెళ్లి దగ్గరుండి గాలింపును కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు మృతి చెందిన కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 5 లక్షలు, హిమాచల్‌ ప్రభుత్వం రూ.1.50 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించాయి.