తెలంగాణ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా అల్లం నారాయణ

allam
హైదరాబాద్‌, జూన్‌ 26 (జనంసాక్షి) : 
తెలంగాణ ప్రెస్‌ అకాడమీ తొలి చైర్మన్‌గా నమస్తే తెలంగాణ ఎడిటర్‌ అల్లం నారాయణ నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం శుక్రవా రం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది. సుదీర్ఘకాలంగా పాత్రికేయ వృత్తిలో ఉన్న అల్లం నారాయణ 
సీమాంధ్ర యాజమాన్యంలోని పత్రికల్లో పనిచేస్తూ కూడా తెలంగాణవాదాన్ని బలంగా వినిపించారు. తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఏర్పాటులో కీలక భూమిక పోషించి కలం వీరులను ఉద్యమంలో భాగస్వాములను చేయడంలో ఆయన పాత్ర కీలకం. తెలంగాణ అస్థిత్వాన్ని చాటడంలో, తెలంగాణ సాహిత్యాన్ని, భావజాలాన్ని పరివ్యాప్తం చేయడంలో అల్లం కీలక పాత్ర పోషించారు. జర్నలిస్టుగా వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి అయ్యారు అల్లం నారాయణ. తనతోపాటు తెలంగాణ జర్నలిస్టులను కలుపుకుని ఐక్య ఉద్యమాలు సాగించారు. ఉద్యమకారుడిగా మంచి గుర్తింపు ఉన్న అల్లం నారాయణతోనే జర్నలిస్టుల సమస్యల పరిష్కారంతో పునర్నిర్మాణంలోనూ ఆయన కీలక బాధ్యతలు అప్పగించే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అల్లం నారాయణ ఎంపిక పట్ల మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఘంటా చక్రపాణి, వి. ప్రకాశ్‌, ఐజేయూ నాయకుడు శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు తుల ఉమ, సీనియర్‌ జర్నలిస్టులు కల్లూరి శ్రీనివాస్‌రెడ్డి, ఎన్‌. వేణుగోపాల్‌, పీవోడబ్య్లూ అధ్యక్షురాలు సంధ్య, ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, ప్రముఖ కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్‌, సీనియర్‌ సంపాదకులు, జర్నలిస్టులు, వివిధ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.