మండల పరిషతుల్లోనూ కారుదే జోరు
టీఆర్‌ఎస్ 201, కాంగ్రెస్ 112 ఎంపీపీలు కైవసం
వరంగల్, నల్గొండ జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిక్యం
హైదరాబాద్, జూలై 4 (జనంసాక్షి) :
పరిషత్ పోరులో కారు దూసుకుపోయింది. మెజార్టీ మండల పరిషత్‌లను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ కూడా పట్టు నిలుపుకొంది. నల్లగొండ, వరంగల్, మెదక్ జిల్లాల్లో ఆ పార్టీ గత ప్రాభవాన్ని నిలబెట్టుకొంది. తెలంగాణలోని 396 మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు శుక్రవారం నిర్వహించగా 372 ఎంపీపీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. మిగతా 24 మండలాల్లో వివిధ కారణాలతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. టీఆర్‌ఎస్ తనకు పట్టున్న ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలోనూ పాగా వేసింది. టీఆర్‌ఎస్ 201, కాంగ్రెస్ 112 ఎంపీపీలు కైవసం చేసుకోగా, టీడీపీ 37, ఇతరులు 22 చోట్ల పీఠాలు దక్కించుకున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కారు వేగంగా దూసుకుపోయింది. ఈ జిల్లాల్లో ఏకంగా వందకు పైగా మండల పరిషత్‌లను సొంతం చేసుకుంది. ఇక పెద్దగా బలం లేని మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోనూ గులాబీ జెండా రెపరెపలాడింది. నల్లగొండ, వరంగల్, మెదక్ జిల్లాల్లో హస్తం పార్టీ హవా కొనసాగింది. మునిసిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపని తెలుగుదేశం పార్టీ స్థానిక సంస్థల్లో కొంత మేర పుంజుకొంది. రంగారెడ్డి, వరంగల్, మహబూబ్‌నగర్‌లతో పాటు పలు జిల్లాల్లో బోణి కొట్టింది. కొన్నిచోట్ల బీజేపీ అధికారం దక్కించుకొంది.
గులాబీ రెపరెపలు..
తెలంగాణలోని 443 జడ్పీటీసీ, 6,480 ఎంపీటీసీలకు ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయి. 69 స్థానాలు ఏకగ్రీవం కాగా.. ఎన్నికలు నిర్వహించిన స్థానాల్లో మే 13న కౌంటింగ్ నిర్వహించారు. కాంగ్రెస్ 2,351 ఎంపీటీసీలను గెలుచుకోగా, టీఆర్‌ఎస్ 1,860 స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ 1,061, బీజేపీ 275, సీపీఎం 145, వైఎస్సార్‌సీపీ 121, సీపీఐ 80, బీఎస్పీ 28, లోక్‌సత్తా 1, ఇతరులు 23, స్వతంత్రులు 522 చోట్ల గెలుపొందారు. అయితే, సంఖ్యాపరంగా ఎక్కువ ఎంపీటీసీలను కాంగ్రెస్ కైవసం చేసుకున్నప్పటికీ.. ఎంపీపీలను దక్కించుకోవడంలో విఫలమైంది. శుక్రవారం 393 ఎంపీపీలకు ఎన్నిక నిర్వహించగా.. మెజార్టీ స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. సాధారణ ఎన్నికల్లో చతికిలబడడం, టీఆర్‌ఎస్ అధికారం చేపట్టడం వంటి పరిణామాలతో మెజార్టీ ఎంపీపీలను గెలుచుకోవడంలో హస్తం పార్టీ వెనుకబడింది.
నిజామాబాద్‌లో కారు ¬రు..
నిజామాబాద్ జిల్లాలో టీఆర్‌ఎస్ హవా కొనసాగింది. జిల్లాలో ఉన్న తొమ్మిది ఎమ్మెల్యేలు, ఒక కార్పొరేషన్, రెండు మునిసిపాలిటీలను దక్కించుకొని సత్తా చాటిన టీఆర్‌ఎస్ మండలాల్లోనూ పాగా వేసింది. జిల్లాలో మొత్తం 36 మండలాలు ఉండగా.. ఇప్పటివరకు 24 ఎంపీపీలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ తొమ్మిదింటిని కైవసం చేసుకుంది. టీడీపీ ఒక్క చోట కూడా బోణీ కొట్టలేదు. బోధన్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి, జుక్కల్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ తన ప్రాభవాన్ని నిలుపుకొంది. భిక్కనూర్ ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది.
కరీంనగర్‌లో కారుకు ఎదురే లేదు..
కరీంనగర్ జిల్లాలో టీఆర్‌ఎస్‌కు ఎదురే లేకుండా పోయింది. వెల్లడైన ఫలితాలను బట్టి మెజార్టీ మండల పరిషత్‌లను టీఆర్‌ఎస్ సొంతం చేసుకుంది. మునిసిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన గులాబీ పార్టీ స్థానిక సంస్థల్లోనూ జోరు కొనసాగించింది. మొత్తం 57 మండల పరిషత్‌లు ఉండగా.. మెజార్టీ ఎంపీపీలను దక్కించుకొంది. ఏకంగా 41 మండల పరిషత్‌లను కైవసం చేసుకొని తనకు ఎదురే లేదని మరోసారి నిరూపించింది. కాంగ్రెస్ 10 ఎంపీపీలను దక్కించుకొని రెండో స్థానానికే పరిమితమైంది. 8 మండలాల్లో టీడీపీ, మరో ఐదు మండలాల్లో బీజేపీ, ఇతరులు అధికారం దక్కించుకున్నారు. రెండుచోట్ల ఎంపీపీ ఎన్నిక వాయిదా శనివారానికి వాయిదా పడింది. వేములవాడ, కోరుట్ల, కరీంనగర్, సిరిసిల్ల నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ సత్తా చాటుకుంది.
ఆదిలాబాద్‌లో టీఆర్‌ఎస్ హవా..
ఆదిలాబాద్ జిల్లాలో కారు జోరుకు అడ్డే లేకుండా మొత్తం 52 మండల పరిషత్‌లకు గాను ఏకంగా 42 ఎంపీపీలను కైవసం చేసుకొని ఎదురులేని శక్తిగా నిలబడింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కేవలం 3 స్థానాలకే పరిమితం కాగా.. తెలుగుదేశం పార్టీ 5 మండల పరిషత్‌లను దక్కించుకొని పరువు నిలుపుకొంది. ఇతరులు ఒకచోట అధికారం చేపట్టగా మరో రెండు మండల పరిషత్ ఎన్నికలు కోరం లేక వాయిదా పడ్డాయి. ఆదిలాబాద్ జిల్లాలో తొలి నుంచి టీఆర్‌ఎస్ హవా కొనసాగుతోంది. సాధారణ ఎన్నికలతో పాటు మునిసిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటిన అధికార పార్టీ తాజాగా మండల పరిషత్‌లపై గులాబీ జెండాలను ఎగురవేసింది.
మహబూబ్‌నగర్‌లో టీఆర్‌ఎస్ పాగా
మహబూబ్‌నగర్ జిల్లాలో టీఆర్‌ఎస్ అనూహ్యంగా పుంచుకొంది. కాంగ్రెస్ పార్టీ కూడా తన పట్టు నిలుపుకొంది. మునిసిపాలిటీ ఎన్నికల్లో సత్తా చాటిన ఆ పార్టీ మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లోనూ ఫర్వాలేదనిపించింది. మొత్తం 63 ఎంపీపీలకు గాను ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల మేరకు.. టీఆర్‌ఎస్ 26 ఎంపీపీలను దక్కించుకోగా.. కాంగ్రెస్ 20 స్థానాలు కైవసం చేసుకుంది. టీడీపీ 11, బీజేపీ సహా ఇతరులు 4 మండల పరిషత్‌లను సొంతం చేసుకున్నారు. మరో ఆరు చోట్ల కోరం లేక ఎన్నిక శనివారానికి వాయిదా పడింది. మహబూబ్‌నగర్, కొడంగల్, నాగర్‌కర్నూలు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ పుంజుకొంది. గద్వాల, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పట్టు నిలుపుకొంది.
మెదక్‌లో గులాబీ గుబాళింపు
మెదక్ జిల్లాలో టీఆర్‌ఎస్ పట్టునిలుపుకోగా కాంగ్రెస్ గట్టి పోటీనిచ్చింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సొంత జిల్లాలో కాంగ్రెస్ గట్టి పోటీనివ్వడం విశేషం. మొత్తం 46 మండల పరిషత్‌లకు గాను.. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాలు మేరకు టీఆర్‌ఎస్ 26, కాంగ్రెస్ 16 మండల పరిషత్‌లను కైవసం చేసుకున్నాయి. టీడీపీ 2 ఎంపీపీలను దక్కించుకోగా ఒకచోట ఇతరులు అధికారం సొంతం చేసుకున్నారు. మరో ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. సిద్ధిపేట, గజ్వేల్, రామాయంపేట, ఆందోలు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ సత్తా చాటింది. మెదక్ నియోజకవర్గంలోని నాలుగు మండల పరిషత్‌లను టీఆర్‌ఎస్ సొంతం చేసుకుంది. జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శించింది.
రంగారెడ్డిలో పోటాపోటీ..
రంగారెడ్డి జిల్లాలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య ¬రా¬రీ పోరు నెలకొంది. జిల్లాలోని 33 మండల పరిషత్‌లకు గాను అధికార పార్టీ టీఆర్‌ఎస్ 12 ఎంపీపీలను దక్కించుకొంది. కాంగ్రెస్ 11 మండల పరిషత్‌లను సొంతం చేసుకుంది. జిల్లాల్లో గట్టి పట్టున్న టీడీపీ ఐదు ఎంపీపీలకే పరిమితమైంది. ఇతరులు రెండుచోట్ల అధికారం దక్కించుకోగా.. మూడు ఎంపీపీల ఎన్నికలు వాయిదా పడ్డాయి. పెద్దగా బలం లేని జిల్లాలో టీఆర్‌ఎస్ ఆధిక్యం సంపాదించడం విశేషం. ఎంఐఎం మద్దతుతో పలు మండల పరిషత్‌లను కైవసం చేసుకుంది. పరిగి, తాండూరు, మహేశ్వరం, చేవెళ్ల, వికారాబాద్ తదితర నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్, రాజేంద్రనగర్, మేడ్చల్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పట్టు నిలుపుకున్నాయి.
నల్లగొండ..
నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హవా కొనసాగింది. మొత్తం 59 మండల పరిషత్‌లకు గాను ఆ పార్టీ 28 ఎంపీపీలను కైవసం చేసుకొని తొలి స్థానంలో నిలిచింది. టీఆర్‌ఎస్ 12 మండల పరిషత్‌లను దక్కించుకొని రెండో స్థానానికే పరిమతితమైంది. టీడీపీ 6, బీజేపీ సహా ఇతరులు మూడుచోట్ల అధికారం సొంతం చేసుకోగా.. ఆరుచోట్ల ఎన్నిక వాయిదా పడింది. హుజూర్‌నగర్, నాగార్జునసాగర్, దేవరకొండ, నల్లగొండ, భువనగిరి, తుంగతుర్తి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ముందంజలో నిలిచింది. ఆలేరు, మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ ఆధిక్యత చాటుకున్నాయి.
వరంగల్‌లో రసవత్తరం..
వరంగల్ జిల్లాలో రసవత్తర పోరు నెలకొంది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగింది. జిల్లాలో మొత్తం 49 మండల పరిషత్‌లు ఉండగా.. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల మేరకు కాంగ్రెస్ 17, టీఆర్‌ఎస్ 16 ఎంపీపీలను దక్కించుకున్నాయి. టీడీపీ ఆరు మండల పరిషత్‌లను గెలుచుకోగా.. మరో ఆరుచోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సొంత జిల్లాలో కాంగ్రెస్ పరువు నిలుపుకొంది. నర్సంపేట, జనగామ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధిపత్రం ప్రదర్శించగా, పరకాల, మహబూబాబాద్, భూపాలపల్లి నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ సత్తా చాటింది. పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చిన నేపథ్యంలో రిజర్వేషన్లు మార్చాలంటూ కొందరు కోర్టుకు వెళ్లగా అక్కడ ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నికల నిర్వహణపై స్టే విధించిన విషయం తెలిసిందే.