వృద్ధిరేటు స్వల్పం

3

5.9 శాతమే

గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థ

సర్వేను సభలో ప్రవేశపెట్టిన జైట్లీ

న్యూఢిల్లీ, జూలై 9 (జనంసాక్షి) :

కొన్నాళ్లుగా క్షీణిస్తూ వస్తోన్న ఆర్థిక వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 5.4 నుంచి 5.9 శాతం పెరుగుతుందని అంచనా వేసింది. 2013-14లో ఆర్థిక వృద్ధి రేటు 5 శాతానికి తక్కువగా ఉందని వెల్లడించింది. రుతుపవనాల మందగమనం, ప్రతికూల పరిస్థితులు ఆర్థిక వ్యవస్థకు సవాలుగా మారాయని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో సబ్సీడీపై సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. 2014 చివరి నాటికి ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతుందని అంచనా వేసింది. కీలక వడ్డీ రేట్లు తగ్గే అవకాశముందని పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ బుధవారం లోక్‌సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌కు ముందు రోజుల ఆర్థిక సర్వే ప్రవేశపెట్టడం ఆనవాయితీ. ఆర్థిక సర్వే అంచనా ప్రకారం 2014-15కు జీడీపీ 5.4 నుంచి 5.9 శాతం మేర ఉంటుందని అంచనా. ప్రముఖ ఆర్థిక వేత్త, గత ఏప్రిల్‌లో ఆర్థిక శాఖ సలహాదారు ఐలా పట్నాయక్‌ ఈ సర్వేను రూపొందించారు. దేశీయ, బాహ్య పరిణామాల వల్ల ఆర్థిక వృద్ధి మందగించిందని ఆర్థిక సర్వే వెల్లడించింది. ‘రుతుపవనాల మందగమనం, ప్రతికూల వాతావరణం, పెట్టుబడుల క్షీణత తదితర కారణాలు ఆర్థిక వ్యవస్థకు సవాలుగా మారాయి. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణం, స్థిరత్వం లేని గ్లోబల్‌ మార్కెట్లు ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలంగా మారాయి. ఇంటా బయటా తలెత్తిన పరిస్థితులతో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది. గత రెండేళ్లలో (2012-13, 2013-14) ఆర్థిక వృద్ధి రేటు ఐదు శాతం కంటే తక్కువగా నమోదైందని’ తెలిపింది. 2013-14లో వ్యవసాయ, అనుబంధ రంగాలు 4.7 శాతం, పారిశ్రామిక రంగం 0.4 వృద్ధిని నమోదు చేశాయని సర్వే పేర్కొంది. తయారీ, మైనింగ్‌ రంగాల్లో 0.7 శాతం మేర వృద్ధి మందగించింది. ‘తయారీ, మైనింగ్‌ రంగాల్లో స్తబ్ధత నెలకొంది. తద్వారా 2013-14లో 0.7 శాతం మేర తగ్గి 1.4 శాతం మేర నమోదైంది. ఈ రెండు రంగాల్లో గత రెండేళ్ల కంటే పెట్టుబడులు తగ్గాయని’ పేర్కొంది.

భయపెడుతున్న ద్రవ్యోల్బణం

ద్రవ్యోల్బణం కొంత మేర తగ్గినప్పటికీ ఇప్పటికీ భరించే స్థాయి కంటే ఎక్కువగా ఉందని సర్వే తెలిపింది. ఈ ఏడాది ఆఖరుకు స్థూల ద్రవ్యోల్బణం తగ్గొచ్చని అంచనా వేసింది. 10.21 శాతం మేర ఉన్న ద్రవ్యోల్బణం 2013-14లో 9.49 శాతానికి తగ్గిందని పేర్కొంది. అయితే, గతేడాది కంటే ఆహార ద్రవ్యోల్బణం అధికంగా ఉందని పేర్కొంది. ప్రధానంగా పండ్లు, కూరగాయలు, చేపలు, మాంసం వంటి వాటి ధరలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.

ఆర్థిక లోటు

ఆర్థిక లోటు ఆందోళన కలిగిస్తోందని సర్వే పేర్కొంది. ఆర్థిక లోటు తగ్గాలంటే సబ్సిడీలను హేతుబద్దం చేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఆర్థిక లోటు, కరెంట్‌ అకౌంట్‌ లోటు (సీఏడీ) తగ్గడం.. దీర్ఘకాలంలో వృద్ధిరేటును పెంచతుందని పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు అంచనాలను కష్టపడి అందుకోవచ్చని తెలిపింది. వచ్చే రెండేళ్లలో ఆర్థిక లోటు తగ్గతుందని వెల్లడించింది. 2013-14లో చెల్లింపుల సమతౌల్యం (బ్యాలెన్స్‌ ఆఫ్‌ పేమెంట్స్‌) మెరుగుపడిందని వెల్లడించింది. ఇది 2012-13లో 88.2 బిలియన్‌ డాలర్లు ఉండగా 2013-14లో 32.4 బిలియన్‌ డాలర్లకు తగ్గిందని తెలిపింది. ‘గతేడాది కంటే ఎగుమతుల విలువ ఎక్కువగా ఉంది. 4.1 శాతం వృద్ధి సాధించి 312.6 బిలియన్ల డాలర్ల మేర ఎగుమతులు జరిగాయని పేర్కొంది. దిగుమతులు చాలా మేరకు తగ్గాయని, ప్రధానంగా బంగారంపై పరిమితులు విధించడం వల్ల ఇది సాధ్యమైందని తెలిపింది. ఈ ఏడాది ఎల్‌నినో వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయన్న సర్వే వ్యవసాయ రంగానికి ఊతం అందించాలని సూచించింది. ఎరువులకు పోషకాల ఆధారిత సబ్సిడీ ఇవ్వాలని పేర్కొంది. వ్యవసాయ ఉత్పత్తులకు ఉమ్మడి మార్కెట్‌ ఉండాలని అభిప్రాయపడింది. మార్కెట్ల ధరలకు అనుగుణంగా పెట్రో ఉత్పత్తుల ధరలు ఉండాలని అభిప్రాయపడింది. ప్రభుత్వ ఆర్థిక సంస్థలు తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటున్నాయని పేర్కొంది. రాబడి తగ్గిపోవడం, పెట్టబడుల ఉపసంహరణ, బడ్జెట్‌ కంటే ఎక్కువగా సబ్సిడీలు ఇవ్వడం, వడ్డీ, పెన్షన్‌ తదితర అంశాలు క్యాపిటల్‌ ఆస్తులు, క్యాపిటల్‌ వ్యయాల మధ్య తేడాను పెంచుతున్నాయని తెలిపింది. పెట్టుబడులకు ఊతమిచ్చేందుకు అనువైన వాతావరణం కల్పించాలని సర్వే అభిప్రాయపడింది. పన్నులు, వ్యయాల్లో సంస్కరణల ద్వారా ద్రవ్యోల్బణ కట్టడి, స్థిరత్వానికి ఇది ఉపకరిస్తుందని తెలిపింది.

ఉపాధి హామీలో సమూల మార్పులు

సామాజిక రంగంలో అమలు చేస్తున్న పలు పథకాలను పునఃసమీక్షించాలని సర్వే అభిప్రాయపడింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఈజీఏ), జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం), సర్వశిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) వంటి పథకాల్లో సమూల మార్పులు తేవాలని సూచించింది. సరైన మెకానిజం లేని కారణంగా సంక్షేమ పథకాల ఫలాలు లబ్ధిదారులకు చేరడం లేదని పేర్కొంది. పాలనలో అవరోధాలను తొలగించడం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, విధానాలను సరళీకరించడం వల్ల లబ్ధిదారులకు మేలు కలుగుతుందని తెలిపింది.