ముఖ్యమంత్రివి అసత్య ఆరోపణలు

` నాపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఆయన్ను కోర్టుకు లాగుతా: కేటీఆర్‌
` మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక
హైదరాబాద్‌(జనంసాక్షి): మీడియాతో చిట్‌చాట్‌ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి తనపై అసత్య ఆరోపణలు చేశారని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. దిల్లీలో సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘’నాపై ఏదైనా డ్రగ్స్‌ కేసు నమోదైందా?దానితో నాకు సంబంధమున్నట్లు ఆధారాలున్నాయా?దమ్ముంటే బయటపెట్టాలని సీఎంను సవాల్‌ చేస్తున్నా. నేరుగా నా ముందు నిలబడే ధైర్యం లేక చిట్‌చాట్లు చేస్తున్నారు. ఇలా వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సీఎంకు కొత్తకాదు. రేవంత్‌రెడ్డి.. మిమ్మల్ని కోర్టుకు లాగుతా. తప్పుడు ఆరోపణలకు మూల్యం చెల్లించుకోక తప్పదు. సీఎం క్షమాపణ చెప్పకపోతే పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని కేటీఆర్‌ అన్నారు. కేటీఆర్‌పై సీఎం చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి హరీశ్‌రావు ఖండిరచారు. బనకచర్లపై సీఎం అడ్డంగా దొరికారని.. చిట్‌చాట్‌ పేరుతో తప్పును కప్పిపుచ్చుకునేందుకు యత్నించారని ఆరోపించారు. బనకచర్లపై తాను చేసిన సవాల్‌ను సీఎం రేవంత్‌ స్వీకరించలేదన్నారు. ఈ అంశంలో ఏపీకి వత్తాసు పలకడాన్ని తప్పుపడుతున్నట్లు హరీశ్‌ చెప్పారు.

కేటీఆర్‌ పిటిషన్లపై హైకోర్టులో విచారణ
హైదరాబాద్‌(జనంసాక్షి): భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. నకిరేకల్‌ పీఎస్‌లో నమోదైన రెండు కేసులను కొట్టేయాలని కేటీఆర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ నిందితులతో తమకు సంబంధం ఉందంటూ కేటీఆర్‌ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారని నకిరేకల్‌కు చెందిన రజిత, శ్రీనివాస్‌ ఫిర్యాదు చేశారు. ఓ న్యూస్‌ వెబ్‌ సైట్‌లో వచ్చిన వార్తని షేర్‌ చేశారని పేర్కొన్నారు. వారిచ్చిన ఫిర్యాదు మేరకు కేటీఆర్‌తో పాటు మన్నె క్రిశాంక్‌, కొణతం దిలీప్‌పై మార్చి 25న కేసులు నమోదు చేశారు. ఈ కేసులను కొట్టేయాలని హైకోర్టులో కేటీఆర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.ఒకే ఘటనపై వేర్వేరు కేసులు నమోదు చేశారని ఆయన తరఫు న్యాయవాది రమణారావు తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు.. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌తో పాటు రజిత, శ్రీనివాస్‌లకు నోటీసులిచ్చింది. తదుపరి విచారణను ఆగస్టు 5కి వాయిదా వేసింది.