పెద్ద ధన్వాడ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్
హైదరాబాద్, జూలై 16 (జనంసాక్షి) : పెద్ద ధన్వాడ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ.. రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కె రామ కృష్ణారావు, డిజిపి డాక్టర్ జితేందర్‌పై ఆగ్రహం వ్యక్తంచేసింది. వారం లోపల రైతులపై పెట్టిన అక్రమ కేసులపై నివేదిక ఇవ్వాలని సూచించింది. పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై అక్రమ కేసులు పెట్టి నిర్బంధానికి గురిచేశారంటూ న్యాయవాది రామారావు పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ బృందం జూలై 28న హైదరాబాద్‌లో బహిరంగ విచారణ చేపట్టనుంది. ఉదయం 10 గంటలనుండి విచారణ చేపట్టనున్నామని జాతీయ మానవ హక్కుల కమిషన్ అధికారికంగా తెలిపింది. పిటిషనర్, బాధితులు, రైతులు, కేసులు తప్పుడు కేసులు ఎదుర్కొంటున్న వారు, వారి కుటుంబ సభ్యులు, ఇతర ప్రత్యక్ష సాక్షులు బహిరంగ విచారణలో పాల్గొనాలని కమిషన్ కోరింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక అధికారిని నియమించాలనీ ఆదేశించింది. జూలై 28న బాధితులు, వారి తరపు సాక్షులను హైదరాబాద్‌కు వచ్చేవిధంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర సర్కారుకు సూచించింది. ఈ మేరకు వారంలో చర్యలు తీసుకొని అత్యవసర నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కె రామ కృష్ణారావు, డిజిపి డాక్టర్ జితేందర్‌లను జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది.
