మా ప్రయోజనాలు మేం చూసుకుంటాం

` మీ చెప్పినట్లు ఆడాల్నా..?
` నాటో చీఫ్‌ వ్యాఖ్యలపై భారత్‌ ఘాటు ప్రతిస్పందన
న్యూఢల్లీి(జనంసాక్షి):రష్యాతో వాణిజ్య బంధాన్ని తెంచుకోకుంటే సుంకాలు విధిస్తామంటూ నాటో చీఫ్‌ చేసిన వ్యాఖ్యలపై భారత్‌ ఘాటుగా స్పందించింది. ‘నాటో’వి ద్వంద్వ ప్రమాణాలుగా అభివర్ణించింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ మీడియాతో మాట్లాడారు. నాటో చీఫ్‌ వ్యాఖ్యలు, జరుగుతున్న పరిణామాలను దగ్గర నుంచి పరిశీలిస్తున్నామని జైశ్వాల్‌ అన్నారు. భారత ప్రజల ఇంధన అవసరాలను తీర్చడం అత్యంత ప్రాధాన్య అంశమని పునరుద్ఘాటించారు. ఇందుకోసం మార్కెట్లలో అందుబాటులో ఉన్న అంశాలు, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల ఆధారంగా నడుచుకుంటామన్నారు. అదే సమయంలో ‘ద్వంద్వ ప్రమాణాల’ పట్ల అంతే జాగ్రత్త వహిస్తామని పేర్కొన్నారు.ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో రష్యా వైఖరిపై ఇటీవల ట్రంప్‌ ఆగ్రహంగా ఉన్నారు. యుద్ధం ముగింపునకు 50 రోజుల్లో ఒప్పందం కుదుర్చుకోకుంటే పెద్దఎత్తున టారిఫ్‌లు విధిస్తామని మాస్కోను హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాటో సెక్రటరీ జనరల్‌ మార్క్‌ రుట్టె అమెరికా సెనెటర్లతో సమావేశం అనంతరం మాట్లాడుతూ.. రష్యా నుంచి చైనా, భారత్‌, బ్రెజిల్‌ దేశాలు చమురు, గ్యాస్‌ కొనుగోలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామన్నారు. ఆయా దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. పుతిన్‌ శాంతి చర్చలకు ఒప్పించేలా ఆయా దేశాలు ఒత్తిడి తీసుకురావాలని, లేకుంటే ఆ మూడు దేశాలకు భారీ ఎదురుదెబ్బలు తప్పవని హెచ్చరిక ధోరణితో వ్యాఖ్యలు చేశారు. దీనిపై భారత్‌ తాజాగా స్పందించింది. మరోవైపు కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీ మాట్లాడుతూ.. రష్యా చమురుపై ఆంక్షలు విధిస్తే భారత్‌కు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఒకప్పుడు 27 దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునేవాళ్లమని, ఇప్పుడు ఆ సంఖ్య 40కి పెరిగిందన్నారు.