ఏసీపీ మహేష్‌ బాబు ఆకస్మిక మృతి

కరీంనగర్‌ జిల్లా బ్యూరో, జులై 18 (జనంసాక్షి) : కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలో విషాదం అలుముకుంది. పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజీలో ఏసీపీగా పనిచేస్తున్న మహేష్‌ శుక్రవారం గుండెపోటుతో ఆకస్మిక మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో మహేష్‌ బాధపడుతున్నారు. ఈ క్రమంలో హుజురాబాద్‌ నుండి కరీంనగర్‌ పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో విధులు నిర్వర్తించేందుకు నిత్యం వెళ్తుంటారు. శుక్రవారం ఉదయం ఉన్నట్లుండి ఒక్కసారిగా అపస్మారక స్థితికి చేరుకున్న ఏసీపీ మహేష్‌ను వెంటనే హుజురాబాద్‌ సర్కారు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయిందని గమనించిన హుజురాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు గంటకుపైగా సీపీఆర్‌ చేసినా ఫలితం లేకుండాపోయింది. మహేష్‌ మరణించినట్టుగా డాక్టర్లు ధృవీకరించడంతో ఆయన మృతదేహాన్ని స్వగ్రామమైన కరీంనగర్‌ తరలించారు. శనివారం ఉదయం అంత్యక్రియలు జరగనున్నాయి. 1995 బ్యాచ్‌కు చెందిన మహేష్‌ మృతిపట్ల పోలీసు ఉన్నతాధికారులు సంతాపం వ్యక్తంచేశారు. ఆయన సతీమణి వి మాధవి హుజురాబాద్‌ డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నారు.