మోడీ హవా తిరోగమనం

గత సార్వత్రిక ఎన్నికలకు మూడునాలుగు నెలల ముందు ప్రారంభమైన నరేంద్ర మోడీ హవా సరిగ్గా ఎన్నికలు ముగిసిన మూడు నెలలకే తిరోగమనం బాట పట్టింది. ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. మోడీ సర్కారు పనితీరుతో ఈ ఉప ఎన్నికల్లో బిజెపి బలం మరింత పెరుగుతుందన్న సర్వే అంచనాలను తారుమారుచేస్తూ ఫలితాలు వెలువడ్డాయి. బీహార్‌, మధ్యప్రదేశ్‌, కర్నాటక, పంజాబ్‌ ఈ నాలుగు రాష్ట్రాల్లో కలిపి 18అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కేవలం 7స్థానాలకు మాత్రమే బిజెపి పరిమితమైంది. బిజెపికి తగిలిన ఈ గట్టి ఎదురుదెబ్బతో ఆ పార్టీ అధినాయకత్వంలో కలవరం మొదలైంది. ఇక అంతా మోడీ మయం అని నిత్యం మోడీ భజనమంత్రాన్ని జపించే మతోన్మాదులకు ఈ ఫలితాలు మింగుడుపడడం లేదు. గత పదేళ్ళలో కాంగ్రెస్‌ పాలనలో అనేక సమస్యలతో సహవాసంచేసి విసిగివేసారిన ప్రజలు బిజెపి సంపూర్ణ మెజారిటీని కట్టబెట్టారు. సోనియా చెప్పుచేతల్లో అణిగిమనిగి ఉండి ఎలాంటి స్వతంత్ర, ప్రజోపయోగ నిర్ణయాలు తీసుకోలేని మన్మోహన్‌ సర్కారును ప్రజలు ఎట్టకేలకు ఇంటికి పంపి మోడీకి పట్టంకట్టారు. ఎన్డీఎ ప్రభుత్వం నుంచి ప్రజలు ఆశిస్తున్నది ఒకటైతే మోడీ చేస్తున్నది మరొకటి. గడిచిన మూడు నెలల్లో ధరలు ఆకాశాన్నంటాయి. రైల్వే బడ్జెట్‌లో ఎలాంటి కొత్తధనం లేదు. పైగా ఛార్జీల మోత మోగించారు. పోలవరం ముంపు గ్రామాలను బదలాయించారు. గ్యాస్‌, కిరోసిన్‌ ధరలు పెరిగాయి. ఇదేమని ప్రజలు, వివిధ రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తే ఇవన్నీ గత ప్రభుత్వ నిర్ణయాలేనని చెప్పుకొస్తున్నారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అమలుచేయడానికి ఎన్డీఎ హయాంలోని మోడీ ప్రభుత్వం అవసరమా ? గత యుపిఎ పాలన సరిగ్గాలేదనే మోడీకి ప్రజలు అధికారం కట్టబెట్టారు. ఈయన కాంగ్రెస్‌ విధానాలనే వల్లె వేస్తున్నారు తప్ప కొత్త పంథాను ఎంచుకోవడం లేదు. మోడీ తన వాక్‌చాతుర్యం, వేషధారణతో ప్రజలను నిరంతరం ఆకట్టుకునేందుకు యత్నించే మోడీ ప్రజారంజక పాలనను అందించడంలో మాత్రం వెనుకబడి ఉన్నారనడంలో సందేహం లేదు.

నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తాం.. జిడిపిలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం.. సెన్సెక్స్‌ను లాభాల బాట పట్టిస్తాం.. అని నిరంతరం వల్లె వేస్తున్న మోడీ, ఆయన మంత్రివర్గం సామాన్యుని జీవన ప్రమాణాల గురించి మాట్లాడడం లేదు. అభివృద్ధి అంటే జీవన ప్రమాణస్థాయి పెరగాలి. పేదరికం శాతం తగ్గాలి. నిరక్ష్యరాస్యతను నిర్మూలన జరగాలి. అంతేతప్ప సెన్సెక్‌ లాభాల బాట పట్టినంత మాత్రాన పేద రైతుకు, పేద కూలీకి ఒరిగేదేమీ లేదు. అధికారం చేపట్టిన 100 రోజుల్లో  ఆకాశాన్నంటిన ధరలు నేలకు దించేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పిన మోడీ మూడేళ్ళ పాలనాకాలంలో ధరలు మరింత పెరిగాయితప్ప తగ్గలేదు. ఇటీవల ఎర్రకోటపై పంద్రాగస్టు వేడుక సందర్భంగా మోడీ చేసిన ప్రసంగం ప్రజలను ఆకట్టుకోలేకపోయింది. ఎలాంటి భరోసానూ ఇవ్వలేదు. మన్మోహన్‌ ఆర్థిక విధానాలనే మోడీ ప్రభుత్వం అనుసరిస్తోంది. చాలా సందర్భాల్లో మోడీ ప్రసంగంలో గత ప్రభుత్వ విధానాలనే తాము అమలుచేస్తున్నామని ప్రకటించారు. తమ పార్టీ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలకే పేరుమార్చి వాడుకుంటున్నారని కాంగ్రెస్‌పార్టీ చేస్తున్న ఆరోపణలు నిజమేనేమో అనిపిస్తోంది. మోడీది అభివృద్ధి మంత్రంకాదని తేలిపోయింది. సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన మోడీ స్వతంత్రంగా వ్యవహరించాల్సిందిపోయి ఇద్దరు ‘నాయుళ్ళ’ ఒత్తిడితో తెలంగాణపై ఆంక్షలు పెట్టేందుకు యత్నించారు. చివరికి తెలంగాణ ప్రభుత్వం నుంచి గట్టి ప్రతిఘటన ఎదురుకావడంతో కేంద్రం వెనక్కితగ్గింది.

నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఈ ఉప ఎన్నికల ఫలితాల్లో కమలం వాడిపోవడంతో ప్రతిపక్షాలు విమర్శలకు పదునుపెట్టారు. మోడీకి దేశంలో ఎదురుగాలి ప్రారంభమైందని ప్రతిపక్షాలు విమర్శల బాణం ఎక్కుపెట్టాయి. రానున్న కాలంలోనైనా ప్రజోపయోగ నిర్ణయాలు చేస్తూ సామాన్యుని జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు మోడీ చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వం చేసిన నిర్ణయాలు నేనూ అమలుచేస్తానని చెప్పడంలో పాలనాదక్షతను అటుంచితే చేతగానితనం ప్రస్పుటమవుతుంది. పేదప్రజల స్థితిగతులు మార్చేందుకు మోడీ కొత్త విధానాలు అవలంబిస్తేనే మోడీ ప్రభుత్వం మనగలుగుతుంది. లేనిపక్షంలో గత ప్రభుత్వాల వలే కాలగర్భంలో కలువక తప్పదు.