కాశ్మీర్ ప్రజల్లో భరోసా పెంచిన మోడీ పర్యటన
నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దాదాపు మూడు నెలలు కావస్తోంది. ఈ మూడు నెల్లోల ఆయన ఆడంబరాలకు పోకుండా అభివృద్దిపైనే దృష్టి సారించారు. ఇందుకు విదేశాల్లో సైతం ఆయనను పొగడడమే నిదర్శనం. వాజ్‌పేయ్ తరవాత బిజెపి ప్రధానిగా ఆయన పేరు మెల్లగా ప్రాచుర్యానికి వస్తోంది. సహజంగానే ఆడంబరాలు, డాంబికాలకు దూరంగా ఉంటున్న మోడీ సమస్యలపై సూటిగా స్పందిస్తూ సాగుతున్నారు. బిజెపి నుంచి రెండో దేశ ప్రధానిగా ఆయన చారిత్రక ఎర్రకోట నుంచి జెండా ఎగురేయబోతున్నారు. ఎన్నో ఆశలతో ఉన్న ప్రజలకు ఆయన అరచేతిలో వైకుంఠం చూపించడం లేదు. అమలు కాని హావిూలు ఇవ్వడం లేదు. తనపనేదో తను చేసుకుంటూ పోతున్న క్రమంలో ప్రచారానికి కూడా దూరంగా ఉంటున్నారు. నిజంగా ఇది అభినందించదగ్గ విషయం. ఇటీవల కాశ్మీర్ పర్యటన అక్కడి ప్రజల్లో ఆశలు రేకెత్తించేలా ఉంది. వారిని మిగతా భారత్‌తో కలిపే ప్రయత్నం చేసినట్లుగానే భావించాలి. ఇంతకాలం కాశ్మీర్ ప్రజలు భారత్‌తో అంతగా కలసి సహజీవనం సాగించిన దాఖలాలు లేవు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జమ్ము కాశ్మీర్‌లో పర్యటించడం ఇది రెండోసారి. ఆయన పర్యటన సైనికుల్లో సమరోత్సాహాన్ని రేకెత్తించింది.
ఉద్వేగభరితమైన ఆయన ప్రసంగం ప్రజలను ఆకట్టుకుంది. గడ్డకట్టించే చలిలో సరిహద్దులను కంటికి రెప్పలా కాపాడుకొస్తున్న సైనికులకు దేశ ప్రధా నే స్వయంగా వచ్చి ప్రశంసించడం, ధైర్యవచనాలు చెప్పడం అసామాన్యమైన శక్తినిస్తుంది. ఎన్నికలకు ముందు కూడా మోడీ సైనికుల సంక్షేమంపై మాట్లాడారు. మాజీ సైనికికలు అండగా ఉంటానన్నారు. అందుకే సరిహద్దుల్లో నిత్యం కాపలా కాస్తూ ప్రాణాలు పణంగా పెట్టిన సైన్యానికి మోడీ దగ్గరయ్యారు. పాక్ కవ్వింపు చర్యలను అనుక్షణం ఎదుర్కొంటున్న సైనికబలగాలను ఉద్దేశించి మోదీ చేసిన ప్రసంగం వారి మనసులను తాకేట్టుగా ఉంది. యుద్ధంలో కంటే ఉగ్రవాదంవల్ల మరణిస్తున్న సైనికుల సంఖ్యే అధికంగా ఉందని మోదీ వాపోయారు. వారి దేశభక్తినీ, ధైర్యసాహసాలనూ ప్రశంసిస్తూ, యావత్ భారతదేశమూ వారికి రుణపడివుందనీ, అండగా ఉందనీ ప్రకటించారు. సైనికబలగాల కష్టనష్టాలేమిటో ప్రభు త్వానికి తెలుసుననీ, వాటిని తీర్చడంతో పాటు, అత్యాధునిక ఆయుధాలను సమకూరుస్తామని కూడా మోదీ మాటిచ్చారు. పాకిస్థాన్ పరోక్ష యుద్దంపై ఆయన తీవ్రంగానే స్పందించారు. కదనరంగంలో భారత్‌ను నేరుగా ఢీకొట్టే సత్తా లేకనే, పాకిస్థాన్ దొంగ దెబ్బలు తీస్తోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు పాక్ కూడా తీవ్రంగానే స్పందించింది. . మే 26న జరిగిన తన ప్రమాణస్వీకారోత్సవానికి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కూడా ఆహ్వానించి ఆశ్చర్యపరిచిన మోదీ, ఇప్పుడు సరిహద్దుల్లో జరుగుతున్న నరమేధం చూశాక కూడా విమర్శించకుండా ఉండలేకపోయారు. అంటే మన స్నేహహస్తాన్ని చేతకానితనంగా చూడవద్దని ఓ రకంగా హెచ్చరిక చేసినట్లుగానే భావించాలి. నవాజ్ షరీఫ్ అధికారంలోకి వచ్చిన తరువాత చొరబాట్లు, ఉల్లంఘనల సంఖ్య గణనీయంగా పెరిగింది. సైన్యంవిూద ఆయన ప్రభుత్వానికి పట్టులేనిమాట నిజమే కానీ, సత్సంబంధాలు నెలకొల్పుకోవాలన్న అభిలాష కూడా పాలకుల్లో బలంగా ఉన్నట్టు కనిపించడం లేదు. సరిహద్దు గ్రామాల్లోని ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పుకోవలసిన అవసరాన్ని స్పష్టం చేయడం సముచితంగా ఉంది. కార్గిల్ యుద్ధం తరువాత ఇప్పుడు అక్కడ అడుగుపెట్టిన తొలి ప్రధానిగా ఆయన ఇక్కడి ప్రజలకు చేరువయ్యే ప్రయత్నంచేశారు. వారిలో భరోసా కల్పించారు.
ఉగ్రవాదం కారణంగా దెబ్బతిన్న కుటుంబాల వారికీ, వలస పోయిన వారికీ తమ ప్రభుత్వం అండగా ఉంటుందని హావిూ ఇచ్చారు. లెహ్, లడాఖ్, కార్గిల్ ప్రాంతాల్లో అభివృద్ధికి బాటలు పరిచారు. పాక్ సైనికులు కాల్పుల విరమణ ఒప్పందాలను అతిక్రమించడం, ఉగ్రవాదులు సరిహద్దుల గుండా చొరబడటం దశాబ్దాలుగా జరుగుతున్నదే. అయితే మోదీ హెచ్చరికల తరవాత అయినా పాక్ తనవిధానంలో మార్పును తీసుకుని వస్తుందా అన్నది చూడాలి. భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్న సందర్భంలో మోడీ వ్యాఖ్యలు సమస్య తీవ్రతను తెలియచేశాయి. కాశ్మీర్ విషయంలో అటల్ బిహారీ వాజపేయి కనబరచిన చొరవ, శ్రద్ధ మోదీ కకూడా కనబర్చడం ద్వారా వారిని మిగతా ప్రజలతో మమేకం చేయాలన్న తపన కనిపించింది. దశాబ్దాలనాటి కశ్మీర్ సమస్య పరిష్కారం దిశగా మోదీ ప్రభుత్వం ఏదో ఒక వినూత్నమైన ప్రయత్నం ప్రారంభిస్తుందన్న ఆశ కాశ్మీరీల్లో ఉంది. జమ్ముతో పాటు ముస్లిం మెజారిటీ ఉన్న కశ్మీర్‌లో కూడా అడుగుపెట్టడం ద్వారా మిగతా ప్రపంచానికి ఒక సంకేతాన్నిచ్చారు. గతాన్ని మరచి కలసి సాగుదామన్న భరోసా కల్పించారు. గత పర్యటన తరహాలోనే ఈసారి కూడా ఆయన కశ్మీర్‌లోయలో పర్యటనలూ ప్రసంగాలూ చేయలేదు. ఈ దశలో కాశ్మీరీలకు కావాల్సింది భరోసానే. నిత్యం తుపాకీ మోతల నడుమ వారు కూడా విరక్తి చెంది ఉన్నారనడంలో సందేహం లేదు. ఇక్కడ శాంతి నెలకొల్పడంతో పాటు అభివృద్దికి బాటు వేస్తేనే మంచిది. ఈ ప్రయత్నంలో మోడీ సక్సెస్ అయితే భారత్ విజయం సాధించినట్లే.