అభివృద్ధి పేర పెత్తందారుల దురాక్రమణ
రాజరికం, ఫ్యూడల్, బానిస బంధనాలను తెంచుకొని సమాజం ప్రజాస్వామ్యం వైపు పరుగులు తీసింది. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు, ప్రభువులు. ప్రజలచేత ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే పాలిస్తారు. తరతరాలుగా గ్రామాల్లో పెత్తందారీ పోకడలను, అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని వెన్ను విరిచేందుకే గ్రామ స్వరాజ్యం వెల్లివిరిసింది. గ్రామ పల్లెలే ప్రగతికి పట్టుగొమ్మలని, గ్రామ స్వరాజ్యం కోసం పూజ్య బాపూజీ కలలుగన్నాడు. దేశంలో ఏ ప్రజా ప్రతినిధికి లేని విధంగా గ్రామ సర్పంచులకు మాత్రమే చెక్‌పవర్ అధికారం ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమా అని రాజ్యాంగంలో రిజర్వేషన్ వచ్చింది. తద్వారా చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కారణంగా అక్కడక్కడ దళితులు, బడుగులకు రిజర్వేషన్‌తో పీఠాలు దక్కాయి. ఇది కంటగింపుగా మారిన పెత్తందార్లు గ్రామ అభివృద్ధి కమిటీల పేరుతో సర్పంచుల చేతిలో ఉన్న అధికారాలను చట్ట వ్యతిరేకంగా లాక్కొని తమదే రాజ్యం అన్నట్లుగా తెలంగాణలోని ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో వ్యవహరిస్తున్నారు. ఈ కమిటీలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఏర్పడినవి. గ్రామంలో అక్రమంగా ఇసుక రవాణా, గుడుంబా, కిరోసిన్, పెట్రోల్ ఎవరు అమ్మాలో దగ్గర నుంచి ఎవరు కాంట్రాక్టు చేయాలో నిర్ణయించి అనధికారికంగా వారిపై పన్నులు వేస్తారు. ఈ అక్రమ అధికారంతో తామే సర్వం అని జల్సాలు చేస్తూ గ్రామం ముందు స్వాగత తోరణాలు గ్రామ అభివృద్ధి కమిటీల పేరుతో ఏర్పాటుచేస్తారు. దళితులు, బడుగులు సర్పంచులు అయిన చోట వీరి ఆధిపత్యమే కొనసాగుతోంది. గతంలో మీడియాలో వార్తలు వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో పోలీసు యంత్రాంగం కదిలినా ఈ వ్యవస్థను పూర్తిగా నిర్మూలించలేదు. తాజాగా నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం చింతలూరు గ్రామంలో రెండు రోజుల క్రితం గ్రామ సర్పంచి దళిత మహిళ అయిన గొడిగి శోభపై గ్రామ అభివృద్ధి కమిటీ వారు దాడిచేసి ఆమెను గ్రామ బహిష్కరణ చేసింది. ఆమెపై వారు చేసిన దాడి గర్హనీయం. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొని జిల్లా పంచాయతీ అధికారికి లేఖ రాసినందుకు ఆమెను, ఆమె కుటుంబాన్ని గ్రామ అభివృద్ధి కమిటీ వారు ఏకంగా గ్రామ బహిష్కరణకు పూనుకున్నారు. ఈ విషయంపై బహిరంగ విచారణ చేసిన ఎస్‌ఐ ఎవరిపై కేసులు పెట్టాడో ఇంకా తెలియాల్సి ఉంది.
ఒకవైపు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించి బంగారు తెలంగాణ నిర్మించుకోవాలని, బడుగులకు, దళితులకు అధికారాలు ఇవ్వాలని భూమిలేని నిరుపేద దళితులకు 3 ఎకరాలు భూమిని పంపిణీ చేయాలని సాంఘీక సంక్షేమ శాఖను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన దగ్గరే ఉంచుకొని తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఈ బృహత్తర కార్యక్రమం ఒకవైపు కొనసాగుతుండగా పాత రాతియుగం కాలంనాటి పెత్తందారీ పోకడలు దళితులపై ముఖ్యంగా దళిత ప్రజాప్రతినిధులపై ఆధిపత్యం చెలాయించడాన్ని చూసి పౌర సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది. చట్టవ్యతిరేకంగా రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగేలా ఏర్పాటైన ఈ గ్రామ అభివృద్ధి కమిటీలను ప్రభుత్వం వెంటనే నిషేధించాలి. నిర్వాహకులు వసూలు చేసిన డబ్బును గ్రామ పంచాయతీకి జమచేసి గ్రామ అభివృద్ధి కమిటీ కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జక్రాన్‌పల్లి మండలం చింతలూరు గ్రామంలో సంఘటన పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మహిళలకు, అణగారిన వర్గాల వారికి ప్రత్యేకంగా రిజర్వేషన్లు ప్రకటిస్తున్న ప్రభుత్వాలు వాటి అమలులోనూ చిత్తశుద్ధితో వ్యవహరించాల్సి ఉంది. గ్రామాన్ని పాలించేందుకు స్థానిక ప్రజలచేత ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ నేటికీ కొన్ని గ్రామాల్లో అక్కడ ఉన్న పెత్తందార్లు, భూస్వాములు ఆధిపత్యం చెలాయిస్తున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి సంఘటనలపై స్థానిక అధికారులు దృష్టిసారించాలి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని శిక్షించాలి. అప్పుడే రాజ్యాంగ యంత్రాంగంపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది.