పేరు మారితేనే ఉలికిపాటా ?

ఉన్నమాటంటే ఉలిక్కి పడ్డారన్నది సామెత.. ఇప్పుడు అదే జరుగుతోంది. తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ పేరును ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంనకు పెట్టారు. ఇదేదో పెద్ద తప్పయినట్లుగా భావిస్తున్నారు. నిజానికి ఎన్ని పేర్లు అలా పుట్టుకొని వచ్చాయో తెలియదు. తెలంగాణ వైతాళికుల పేర్లు లేకుండాపోయాయి. తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు పెట్టారు. తెలంగాణ ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్న కాసు బ్రహ్మానందరెడ్డి పేరును నిజాం కాలం నాటి పార్క్‌కు పెట్టారు. ఇక్కడ ఈ పేరు అవసరమా..? ఇక కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియం…బాలయోగి స్టేడియం.. ఎన్టీర్‌ మార్గ్‌..ఎన్టీఆర్‌ స్టేడియం..ఎల్‌వి ప్రసాద్‌ మార్గ్‌.. ఇవన్నీ ఆంద్రాలో ఎందుకు లేవు..ఆంధ్రాలో తెలంగాణ వారి పేరు ఒక్కటైనా ఎందుకు లేదు….తెలంగాణ ఏర్పడ్డ తరవాత కూడా ఈ పేర్లు ఉండాలా అన్నది ఆలోచించుకోవాల్సిన అవసరం తెలంగాణ పాలకులు, ప్రజలేద తప్ప సీమాంధ్రపాలకులది కాదు. దీనికి గగ్గోలు పెట్టాల్సిన అవసరం అంతకన్నా అవసరం లేదు. ఇప్పుడున్న ఆంధ్రా పేర్లను పూర్తిగా మార్చేసి తెలంగాణ వాసనలు వెదజల్లే కార్యక్రమం ఆరంభం అయ్యింది. ఇందుకు సిఎం కెసిఆర్‌ సదా అభినందనీయులు. ఇది ఆరంభం మాత్రమేనని ఆయన చేసిన ప్రకటన ఆహ్వానించదగ్గదే. తెలంగాన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు తెలంగాణ వైతాళికులను గుర్తుకు తెచ్చుకునే కార్యక్రమాలు చేపట్టవలసిందే. తెలంగాణ పరిమళాలు వెల్లివిరియాల్సిందే. ఇన్నాళ్లూ బలవంతంగా ఈ ప్రాంతంపై రుద్దింది ఇక చాలు. ఇంకా ప్రజల మనసులను గాయం చేయాలనుకుంటే ప్రజలు ఊరుకోరని తెలుగుదేశం నేతుల గుర్తుంచుకోవాలి. ఇప్పుడున్న విగ్రహాలెవరివో మనకే తెలియదు. మన పిల్లలకు ఏం చెబుతం? తండ్రికే తెలియనప్పుడు కొడుక్కేంచెబుతాడు.. మార్పులు చేయాల్సినవి చాలా ఉన్నాయి. మందిది మాకొద్దు..మాది మాకే కావాలి. జయశంకర్‌సార్‌ కూడా ఇదే విషయం పదేపదే చెప్పేవారు.అంటూ కొత్తగా జయశంకర్‌ విశ్వివాద్యాలయ ఏర్పాటు సందర్భంగా సిఎం కెసిఆర్‌ చేసిన ప్రకటన స్వాగతించాల్సిందే. తెలంగాణ ప్రాంతంపైనా, ఇక్కడి ప్రభుత్వంపైనా ఇంకా పెత్తనం సరికాదు.

ఆంధ్ర ప్రాంత నేతలకు, మంత్రులకు, ముఖ్యమంత్రిగా కెసిఆర్‌ చేసిన విజ్ఞప్తి సహేతుకంగానే ఉంది. విూ మానాన విూరు ఉండండి. మా మానాన మేం ఉంటాం. ఎవరి పని వారు చేసుకుందాం. దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడండి. మా రాష్ట్రంలోని పిల్లల ఫీజులు మేం చెల్లించుకుంటాం. విూ పిల్లల ఫీజులు విూరే చెల్లించుకోవాలి. అంటే చేసిన వినతని సానుకూలంగా తీసుకోవాలి. లక్ష కోట్లు పెట్టి రాజధాని కట్టుకునే వారు విూ పిల్లల ఫీజులు కట్టుకోలేరా? సింగపూర్‌ తరహాలో రాజధానిని తీర్చిదిద్దుకుంటామని చెప్పిన వారు  పిల్లల ఫీజులు చెల్లించుకునేందుకు చేతగాదా? అంటూ  కేసీఆర్‌ చేసిన ప్రకటనపైనా సీమాంధ్ర నేతలు ఆలోచన చేయాలి. వివాదాలకు దూరంగా ఉండాలనుకుంటే ఉండవచ్చు. కొత్తగా ఏర్పడిన ఇరు రాష్టాల్ల్రో అభివృద్ది లక్ష్యంగా పాలన సాగాలి. అంతేగానీ నీరు వివాదం.. పేరు వివాదం.. చదువు వివాదం… విద్యుత్తు వివాదం! అడుగు తీసి అడుగు వేస్తే వివాదమే అన్నది చేయడం సరికాదు. పరస్పర విమర్శలు, వాదోపవాదాలు మానాలు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం, అక్కడి మంత్రులు చేస్తున్న ప్రకటనలు తెలంగాణ వారిని కించపరిచేవిగా ఉన్నాయనడంలో సందేహంలేదు.  తెలంగాణకు వ్యతిరేకం కాదంటూనే పుల్లలు పెట్టే పనులు చేయడం సరికాదు.  హైదరాబాద్‌ శివారులోని రాజేంద్రనగర్‌లో వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరు మార్పుతో గగ్గోలు పెట్టడంలో అర్థం లేదు. ఒకవేళ అంతగా ఇష్టం ఉంటే లాంలో ఏర్పాటు చేయబోయే విశ్వవిద్యాలయానికి గుంటూరుకే చెందిన రంగా పేరు పెట్టుకోవచ్చు. ఇక్కడితో వివాదం చల్లారాలి. విమర్శలు తగ్గాలి.  రాష్ట్ర విభజన చట్టం ప్రకారమే వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరు మార్చామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర విభజన చట్టానికి సంబంధిత చట్టాలను వర్తింపజేసుకునే అధికారం తమకు ఉందని పేర్కొంటోంది.   వ్యవసాయ విశ్వవిద్యాలయానికి తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్‌ పేరు పెడితే… ఏపీ ప్రభుత్వం, నాయకులు రాష్ట్ర గవర్నర్‌ను కలిసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను చూసి వారు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. నిజానికి ఇక్కడ భూములను వేల ఎకరాలు అప్పనంగా ధారాదత్తం చేసి, ఇక్కడి వారి పేర్లుల లేకుండా చేసినందుకు ఆంధ్రావారు సిగ్గుపడాలి. తెలంగాణను ఏ విధంగా అణచివేశామా అని బాధపడాలి. కానీ అలా చేయకుండా దీనిని ఇంకా పొడిగించాలనుకోవడం సరికాదు. పేర్లు మారినంద మాత్రాన ఆక్రోశించడం వల్ల లాభం లేదు. అలా అయితే తెలంగాణ ప్రజలు ఇంకా ఆక్రోశించాల్సి ఉంటుంది. ఇప్పటికైనా ఇరు ప్రాంతాల అభివృద్ది లక్ష్యంగా ముందుకు నడవాలి. విభజనతో వచ్చిన అవకాశాలన్ని చంద్రబాబు వినయోగించుకోవాలి. ఇంతకాలం తాను అభివృద్దికి కేరాఫ్‌ అడ్రస్‌ అంటున్న బాబు ఇప్పుడు సీమాంధ్రలో పెట్టుబడులు, అభివృద్దిచేసి చూపించాలి. ఇకపోతే సీమాంధ్రలో వస్తున్న పెట్టుబడులు లేదా, వస్తున్న సంస్థలన్నీ విభజన కారణంగానే అని గుర్తుంచుకోవాలి. తెలంగాణకు సంబంధించినంత వరకు చంద్రబాబు జోక్యం తగ్గించుకుని సాగితే మంచిది.