చైనానే మనకు ఆదర్శం కావాలి
ఆధునిక ప్రపంచంలో అభివృద్ది ఎంతన్నదానికన్నా ఆరోగ్యం ఎంతవరకు ఉందన్న ప్రశ్న ఉదయిస్తోంది. కొత్తకొత్త రోగాలు సవాల్ విసురుతున్నాయి. ఆరోగ్యకరమైన సమాజం కోసం తపించే పరిస్థితులు దాపురించాయి. ఎన్నుడు ఎలాంటి రోగాలు దాడి చేస్తాయో తెలియని దుర్గతి పట్టింది. ఇదంతా ఓ రకంగా మానవ తప్పిదాలకు అనుభవిస్తున్న పాపంగా భావించాలి. గతంలో ఎన్నడూ వినని రోగాలు ఇప్పుడు దూసుకుని వస్తున్నాయి. ఇప్పుడు అలాంటిదే ఎబోలా అనే వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇది సోకితే ఇక అంతే సంగతులు. ఎయిడ్స్కన్నా ప్రాణాంతకమైనదిగా గుర్తించారు. మన్నా మధ్య సార్స్, బర్డ్‌ఫ్లూ,హెపటైటిస్,ఎయిడ్స్ కానీ వీటన్నిటినీ తలదన్నే మరో మహమ్మారి ఇప్పుడు ఎబోలా రూపంలో దూసుకుని వస్తోంది. మారుతన్న జీవన సరళి, ఆధునిక పోకడలు మొత్తం సమాజాన్ని మార్చేస్తున్న దశలో సరికొత్త వ్యాధులు సవాల్ విసరడంతో ఇప్పుడు మానవమనుగడకు ప్రమాద ఘంటికలు మోగేదిగా ఉంది. అందుకే అభివృద్దిని సాధించామనుకుంటున్న అగ్రరాజ్యాలకు వైరస్ భయాలు ఎప్పుడూ వెన్నాడుతూనే ఉన్నాయి. తాజాగా ఎబోలా వైరస్ చూసి అమెరికా సహా అగ్రరాజ్యాలన్నీ గజగజలాడుతున్నాయి. ప్రస్తుతం సియెర్రా లియోన్, లైబీరియా ప్రాంతాల్లో తీవ్రంగా ఉన్న ఈ వైరస్ నియంత్రణకు వందలాది మంది దళాలను మోహరించారు. ఇప్పటికే వేయిమందికి పైగా ఈ వైరస్ బారిన పడి మరణించినట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రకటించింది. పశ్చిమాఫ్రికా దేశాల్లో వైద్యవర్గాలు దీనిపై ఇప్పటికే చేతులెత్తేశాయి. సియెర్రా లియోన్, లైబీరియా, గినియా దేశాల్లో ఎబోలా వైరస్ అదుపు చేసేందుకు 1218 కోట్ల రూపాయల సాయాన్ని ప్రపంచబ్యాంకు ప్రకటించింది. ఈ వైరస్ను వీలైనంత త్వరగా నియంత్రించకపోతే అత్యంత దారుణమైన పరిణామాలు ఉంటాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ రం హెచ్చరించింది. గడిచిన రెండు వారాల్లోనే ఈ వైరస్ బారిన పడి 61 మంది మరణించారు. ముందుగా గినియాలోని అడవుల్లో గత ఫిబ్రవరిలో ఈ వైరస్ వ్యాప్తి మొదలైంది. అప్పటినుంచి అక్కడ మరణాల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. ఆ తర్వాత పొరుగున ఉన్న లైబీరియా, సియెర్రా లియోన్లకు ఈ వైరస్ పాకింది. ఎబోలా కేసులు కనిపించినట్టయితే వైరస్‌ను గుర్తించటానికి, పరీక్షించటానికి, నియంత్రించటానికి సిద్ధంగా ఉండాలంటూ అన్ని దేశాలకు, విమానాశ్రయాలకు పిలుపునిచ్చింది. పశ్చిమ ఆఫ్రికా వెలుపలకు ఎబోలా వ్యాపించటం ‘అనివార్యం’ అని అమెరికా అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ వైరస్ ప్రస్తుతం అదుపు తప్పిందని, 60కి పైగా ప్రాంతాల్లో విజృంభిస్తోందని వైద్యులు హెచ్చరించారు. గత నాలుగు దశాబ్దాల్లో అతిపెద్ద, చాలా తీవ్రమైన, సంక్లిష్టమైన మహమ్మారి ఇదేనని వివరించారు. 2009లో స్వైన్‌ఫ్లొ వ్యాపించిన సమయంలోనూ, గత మేలో పోలియో విషయంలోనూ ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇలాంటి అత్యవసర్థసితిని ప్రకటించింది. చాలా దేశాల్లో ఎబోలా కేసులు లేనప్పటికీ.. అంతర్జాతీయ సంఘీభావానికి ఈ ప్రకటన స్పష్టమైన పిలుపని ప్రపంచ ఆరోగ్యసంస్థ అధినేత డాక్టర్ మార్గరెట్ చాన్ పేర్కొన్నారు. ఎబోలా ఇన్‌ఫెక్షన్‌కు ప్రస్తుతం అనుమతి పొందిన చికిత్స గానీ టీకా గానీ లేదు. అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఇప్పటికే ఎబోలా చాలా తీవ్రమైందని హెచ్చరిక జారీచేసింది. మరోవైపు ఎబోలా ఇన్‌ఫెక్షన్‌ను తగ్గించే ప్రయోగ మందుల వినియోగం కోసం విధానాన్ని రూపొందించటానికి అమెరికా ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక బృందాన్ని నియమించింది. నైజీరియాలో పాట్రిక్ సాయెర్ అనే అమెరికా పౌరుడు లైబీరియా నుంచి వచ్చిన తర్వాత జూలై నెలాఖరులో మరణించాడు. అతడికి చికిత్స చేసిన వైద్యుడికి కూడా వైరస్ సోకింది!! దీంతో అసలు ఈ వైరస్ సోకిన బాధితులకు వైద్యం చేయడానికే ఆరోగ్యబృందాలు భయపడిపోతున్నాయి. పలు దేశాల్లో ఈ వైరస్‌కు భయపడి అసలు పాఠశాలలు తెరవడం మానేశారు. సాధారణ వైద్యులు వైద్యం చేసేది లేదని చెప్పడంతో భారీ సంఖ్యలో మిలటరీ వైద్యులను, వైద్య బృందాలను సియెర్రా లియోన్ తదితర ప్రాంతాలకు పంపారు. అక్కడే ఈ కేసుల సంఖ్య బాగా ఎక్కువగా ఉంది. అక్కడినుంచి ఇతర ప్రాంతాలకు పాకడానికి ముందే దీన్ని అరికట్టాలని ప్రయత్నిస్తున్నారు. దీన్ని అరికట్టే మందులు ప్రస్తుతానికి ఇంకా ప్రయోగాల దశలోనే ఉన్నాయి. పశ్చిమ ఆఫ్రికాలో విజృంభిస్తున్న ఎబోలా మహమ్మారిపై ప్రపంచ ఆరోగ్యససంస్థ ‘అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర్థసితి’ని ప్రకటించింది. ఈ వైరస్ ప్రభావిత దేశాలకు ప్రపంచ దేశాలు సహాయం చేయాలని కోరింది. ఆయా ప్రాంతాలకు వెళ్లే విమానయాన సంస్థలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిందంటే దీని తీవ్రత, ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటివరకు మనదేశంలో ఎక్కడా ఎబోలా కేసులు నమోదైనట్టు సమాచారం లేదని, దీనికి భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్ష వర్ధన్ తెలిపారు. ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటోందన్నారు. ఎబోలా వ్యాపించిన దేశాల నుంచి భారత్‌కు వచ్చేవారిని నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. పశ్చిమాఫ్రికాలో మొదలై ప్రపంచ వాసులందరినీ గడగడలాడిస్తున్న ఇబోలా వైరస్ వ్యాప్తిని ప్రపంచవ్యాప్త అంతర్జాతీయ పరిస్థితిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.