కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కాలి

ప్రభుత్వం ఎప్పటికైనా తమపై దయ చూపదా.. పాలకులు ఎన్నాళ్ళకైనా తమ శ్రమను గుర్తించి రెగ్యులరైజ్‌ చేయరా.. అనే గంపెడాశతో బతుకుతున్న 40వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను పర్మింనెంట్‌ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలీచాలని వేతనంతో బండచాకిరీ చేస్తున్న తమ బతుకులు కొత్త రాష్ట్రంలోనైనా బాగుపడుతాయనే నమ్మకంతో వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికుల కుటుంబాలు  బతుకీడుస్తున్నాయి. సమైక్య రాష్ట్రంలో ఆంధ్రా నాయకుల దోపిడీతో అన్నీ కోల్పోయాం. తెలంగాణ ఉద్యోగుల కార్మికుల శ్రమను, ఇక్కడి వనరులను దోచుకున్నారు. వారి పాలనలో ఇక మనగలగలేమని భావించి వేలాది ఉద్యోగులు, కార్మికులు తమ కుటుంబాలతో సహా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నారు. అందరూ సంఘటితమై మిలిటెంట్‌ పోరాటం నడిపారు. ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇప్పటికైనా తాము కష్టాల నుంచి గట్టెక్కుతామని వారు భావిస్తున్నారు. ఎంతో మంది ఉద్యోగులు తమ గరిష్ట వయో:పరిమితి కోల్పోయి కూడా తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఇన్ని అష్టకష్టాలు పడుతున్న తాత్కాలిక ఉద్యోగులను తక్షణమే పర్మినెంట్‌చేసి వారిని ఆదుకోవాలి. అరచేతిలో బెల్లంపెట్టి మోచేతితో నాకించిన చందంగా వ్యవహరించడం ఎంతమాత్రమూ తగదు. సమాన పనికి సమానం వేతనం ఇవ్వాలని కార్మిక సంఘాలు ఏళ్ళుగా గొత్తెతున్నాయి. శ్రమకు తగిన వేతనం ఇవ్వాలనే చట్టాన్ని గతంలో పరిపాలించిన ప్రభుత్వాలు తుంగలోతొక్కాయి. తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం అయినా వారి భవిష్యత్‌ గురించి ఆలోచించి రెగ్యులరైజ్‌ చేసి ఆదుకోవాల్సి ఉంది. టిఆర్‌ఎస్‌ అధినేత తన ఎన్నికల మేనిఫేస్టోలో పొందుపర్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తూ నిర్ణయాలు తీసుకోవడం హర్షణీయం. 40వేల మంది ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయలని ఇటీవల జరిగిన కేబినెట్‌ బేటీలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగుల్లో ఆనందం నెలకొంది. నిర్ణయం ఎప్పుడు అమలవుతుందోనని వారు ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమకు మంచి భవిష్యత్‌ ఉంటుందనీ, ఉద్యోగాలు పుష్కలంగా దొరుకుతాయని భావించిన విద్యార్థులు, నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మరుక్షణం నుంచి కొందరు ఆందోళన బాటపట్టారు. తమ పరిస్థితి ఏమిటని గొంతెత్తుతున్నారు. టిపిఎస్సీని ఏర్పాటుచేసి తమకు ఉద్యోగాలు కల్పించాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పోలీసుల లాఠీదెబ్బలకు వెరవకుండా, జైళ్ళను, ఎన్నో నిర్బంధాలను లెక్కచేయకుండా విద్యార్థులు చురుకైన పాత్ర పోషించారు. తాము ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులను బాగా చూసుకుంటామని తమ భవిష్యత్‌ బంగారు బాటగా మారుతుందిని పట్టువదలని విక్రమార్కుల్లా ఉద్యమించారు. కాంట్రాక్టు ఉద్యోగుల, విద్యార్థుల విషయంలో ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వ శాఖల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పౌర సంబంధాల శాఖ లాంటి వాటిలో దాదాపుగా 15ఏళ్ళుగా ఎలాంటి పోస్టులను ప్రభుత్వాలు భర్తీ చేయడంలేదు. ఆయా శాఖల్లో ఖాళీపోస్టుల లెక్కలు తీసి వాటి భర్తీకి ప్రభుత్వం పూనుకుంటే అందరికీ న్యాయం చేయొచ్చు. ఇప్పుడిప్పుడే కొన్ని నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంటున్న ప్రభుత్వం ఇటువైపుగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రాజకీయ నాయకుల్లో ఉన్న భేదభావాల వల్ల కొందరు నిరుద్యోగుల్లో ఆందోళన మొదలవుతోంది. ప్రభుత్వం వారి విషయంలో నిర్ణయం తీసుకుంది. మరి మీ సంగతి ఏంటి అని కొందరు నేతలు ఆందోళన రేకెత్తించేలా ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించడం సరైందికాదని కొందరు విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారు. ఎన్నో ఏళ్ళుగా వెట్టిచాకిరీ చేస్తున్న వారి బాధను కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా తమకు కొత్త నోటిఫికేషన్‌ ద్వారా ఉపాధి కల్పించాలని కోరడంలో తప్పులేదు. వారిని క్రమబద్దీకరించడం సరికాదని కొందరు ఉద్యమించడంలో అర్థంలేదు. ప్రభుత్వం అందరినీ సమాన దృష్టితో చూడాల్సిందే. అందరికీ సమాన న్యాయం చేయాల్సిందే. అప్పుడే ప్రజల ప్రభుత్వంగా గుర్తింపు పొందుతుంది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేసే విషయంలో 2003లో విడుదలైన జిఓ నెం.94ను చూపి తాత్సారం చేయడం వారిని మభ్యపెట్టడమే అవుతుంది. గతంలో వైద్య, ఆరోగ్య శాఖలోని ఎఎన్‌ఎంలను రెగ్యులరైజ్‌ చేశారు. సాంఘీక సంక్షేమ శాఖలో పనిచేస్తున్న సుమారు  2,500 మంది స్పెషల్‌ విద్యావాలంటీర్లను నేరుగా క్రమబద్దీకరించారు. వీటిపై ఎవరూ కోర్టును ఆశ్రయించకపోవడంతో ఈ క్రమబద్దీకరణ అమల్లోకి వచ్చింది. కాబట్టి నిరుద్యోగులకు కొత్త నోటిఫికేషన్ల ద్వారా ఉపాధి కల్పిస్తునే కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌చేస్తే అందరికీ న్యాయం జరుగుతుంది. అప్పుడు ఎవరిపై ఎవరూ కోర్టుకు వెళ్ళరు. వెళ్ళే అవసరం ఉండదు. అలా కాకుండా నిరుద్యోగులు ఒప్పుకోవడంలేదని కాంట్రాక్టు ఉద్యోగులను పర్మింట్‌ చేయకుండా.. కాంట్రాక్టు ఉద్యోగులు ఉద్యమిస్తారని కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేయకుండా ప్రజల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనే నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వం ప్రజావ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా బంగారు తెలంగాణను నిర్మించే పనిలో ఉన్న ముఖ్యమంత్రి కెసిఆర్‌ అందరికీ న్యాయం చేసేలా నిర్ణయం తీసుకోవాలి. తాత్సారం చేయకుండా తక్షణమే అమలుచేయాలి. అప్పుడే కాంట్రాక్టు ఉద్యోగులు, నిరుద్యోగులు, వారిని నమ్ముకొని ఉన్న కుటుంబ సభ్యులు ఆనందిస్తారు.