బాబూ అది నీవు నేర్పిన విద్యే

విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కయ్యానికి కాలు దువ్వుతోందని నీతిమాలిన ప్రకటనలతో ఆంధ్రప్రదేశ్‌ సిఎం బేరసారాలకు దిగుతున్నాడు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకుంటున్న చంద్రబాబు అనవసర రాద్దాంతం చేస్తూ తెలంగాణ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం గర్హనీయం. కలిసి నడుద్దాం.. పరస్పరం సహకరించుకుందాం.. పంతానికి దిగితే ఎలా అంటూ నీతిమాటలు వల్లె వేస్తున్న చంద్రబాబునాయుడు పీపీఎ(పవర్‌ పర్చెస్‌ అగ్రిమెంట్‌)ను రద్దుచేశాడు. తెలంగాణలో విద్యుత్‌ తక్కువగా ఉత్పత్తి అవుతుందని, సీమాంధ్రలో ఎక్కువగా ఉత్పత్తి అవుతుందని తెలంగాణ విద్యుత్‌ అవసరాలు తాము ఎందుకు తీరుస్తామని చెప్పిన బాబుకు పరస్పరం సహకరించుకుందాం అనే మాట అప్పుడు గుర్తుకురాలేదు. మాది అణాపైసా పోనిచ్చేదిలేదుగానీ పక్కోడి సొమ్ము కూడా మాకే కావాలే అనే ఆలోచన సరైందికాదు. సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు గిరిజన ప్రాంతాల్లో స్థిరపడిన వారి స్థానికతకు సంబంధించిన జీఓను ఆయన తీసుకొచ్చారు. స్థానికత విషయంలో తెలంగాణ ప్రభుత్వం చట్టప్రకారమే వెళ్తున్న మాట వాస్తవం. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్‌ఐఐటిలో ఇతర రాష్ట్రాల పిల్లలు చదివినప్పుడు వారికి ఏపి ప్రభుత్వం ఎప్పుడూ రీయింబర్స్‌మెంట్‌ చెల్లించలేదు. అదే నిబంధన ప్రస్తుతం కూడా వర్తించేలా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా తెలంగాణ బిడ్డలకు చెల్లిస్తామని అడ్డమైన వారికి ఫీజురీయింబర్స్‌మెంట్‌ చెల్లించాల్సిన అవసరం తమకు లేదని తేల్చిచెప్పారు. తెలంగాణ బిడ్డలుగా ధృవీకరించేందుకు అనగా స్థానికతకు 1956 సంవత్సరాన్ని ప్రాతిపదిక తీసుకున్నారు. కెసిఆర్‌ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు, వామపక్షాలు పూర్తిగా సమర్థిస్తున్నాయి. చంద్రబాబు తమ విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలని కయ్యానికి కాలుదువ్వి విద్యార్థుల భవిష్యత్‌కు ఆటంకం కలిగించడాన్ని ఎప్పటికప్పుడు వివిధ రాజకీయ పార్టీలు ఖండిస్తున్నాయి. అయినప్పటికీ చంద్రబాబుకు జ్ఞానోదయం కలగడంలేదు. ‘మాది మాగ్గావలె..మీది మాగ్గావలే..’ అన్నచందంగా చంద్రబాబు కుట్రపూరిత ఆలోచనలు ఉన్నాయి.

తెలంగాణ ప్రభుత్వం తమ మాటలు వినేలా లేదని భావించి ఫీజురీయింబర్స్‌మెంట్‌ పంచాయితీని కేంద్రం ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేశాడు. మొన్న మీడియాతో మాట్లాడుతూ కొత్త ప్రతిపాదన ముందుకుతీసుకొచ్చాడు. ఎలాగూ తెలంగాణ ప్రభుత్వం ముందు తాము గెలవలేమని భావించి ఒక మెట్టు దిగి బేరసారాలకు వచ్చాడు. మొత్తం ఫీజులో 58శాతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భరిస్తుందని, మిగతా 42శాతం తెలంగాణ ప్రభుత్వం భరించాలని ఓ మధ్యేమార్గంగా  ప్రతిపాదన తీసుకొచ్చాడు. అవసరమైతే ఒక అడుగు తగ్గుతానని తనకుతానే ప్రకటించుకున్నాడు. రీయింబర్స్‌మెంట్‌ విషయంలో ఆలస్యం కావడం విద్యార్థులకు నష్టం జరుగుతుందని మొసలికన్నీరు కార్చాడు.

ఎపి ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం జంకడంలేదు. ఆయన బేరసారాలకు కాస్తకూడా దిగిరావడం లేదు. తెలంగాణ బిడ్డలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించగా మిగిలిన డబ్బును ఒక విద్యార్థికి రూ.5000 చొప్పున  ప్యాకెట్‌మనీగా ఖర్చుచేయడానికైనా సిద్ధమని, లేకపోతే ల్యాప్‌ట్యాప్‌లు కొనిస్తామని ఏన్నో ఏళ్ళుగా తెలంగాణను దోచుకున్న ఆంధ్రా పాలకుల బేరసారాలకు తలొగ్గి ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇచ్చే ప్రశ్నేలేదని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం విడుదలైన నోటిఫికేషన్‌ ఆంధ్రా విద్యార్థులకు సంబంధించిందని తెలంగాణకు కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. అదే క్రమంలో ఆగస్టు 7నుంచి కొనసాగే కౌన్సెలింగ్‌లో తెలంగాణ విద్యార్థులు ఎవరూ పాల్గొనవద్దని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

తెలంగాణను నిలువునా ముంచడానికి అవసరమయ్యే ప్రణాళికలు, కుట్రలు ఎప్పటికప్పుడు వేయడంలో సీమాంధ్రులు దిట్ట. తెలంగాణలో విద్యుత్‌ వాడకం ఎక్కువ. సీమాంధ్ర పాలకులు తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు ఏర్పాటుచేయకపోవడంతో తెలంగాణ ప్రజలు బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. బొగ్గు తెలంగాణాది, విద్యుత్‌ ఉత్పత్తి ఆంధ్రాలో జరిగేది. రాష్ట్రం విడిపోయినప్పుడు కుదుర్చుకున్న పవర్‌ పర్చెస్‌ అగ్రిమెంట్‌ను తుంగలోతొక్కి బాబు ఏకపక్షంగా మా కరెంటె మీకివ్వం అని ప్రకటించి సీమాంధ్ర దురహంకారాన్ని చాటాడు. అంతకుముందే పోలవరం ముంపుగ్రామాల ఆర్డినెన్స్‌ కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం పొందేలా పావులు కదిపాడు. తెలంగాణ సర్కారును సంప్రదించకుండానే అక్కడి ప్రాంతవాసుల మన్ననలు పొందేందుకు బాబు అలా వ్యవహరించాడు. ‘నీవు నేర్పిన విద్య నీరజాక్షన’ అన్నట్టు మన సిఎం కేసీఆర్‌ కూడా ఫీజురీయింబర్స్‌మెంట్‌ విషయంలో తీసుకున్న నిర్ణయంలో తప్పేముంది.