తెలంగాణలో మాత్రమే విద్యుత్‌ కోతలు లేవు

తెలంగాణలో మాత్రమే విద్యుత్‌ కోతలు లేవు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ  ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ విద్యుత్‌ కోతలు ఉన్నాయి. ఎంతగా ఉన్నాయంటే రైతన్నలు ఆగ్రహం వెళ్లగక్కేంతగా ఉన్నాయి. దీనికి కారణం కాంగ్రెస్‌ పాలకులు. ఈ దేశాన్ని భ్రష్టుపట్టించడానికా అన్నట్లుగా గత పదేళ్లలో విద్యుత్‌ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీశారు. వారికి భవిష్యత్‌పై దృష్టి లేదనడానికి ప్రస్తుత కరెంట్‌ సమస్యలే కారణం. ఏటేటా పెరుగుతన్న జనాభాకు అనుగుణంగా కరెంట్‌ ఉత్పత్తిని పెంచడంలో వారు విఫలమయ్యారు. పదేళ్ల క్రితం సౌర తదితర విద్యుత్‌ ఉత్పత్తికి చర్యలు తీసుకుని పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేలా చేసి ఉంటే ఇవాళ మిగులు ఉత్పత్తిని సాధించి ఉండేవాళ్లం. కానీ దురదృష్టమేమంటే విద్యుత్‌ ఉత్పత్తని సాధించలేని వారు ఇటీవల ఢిల్లీలో విద్యుత్‌ కోతలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఇంతకన్నా దౌర్భాగ్యం మరోటి ఉండది. గత పదేళ్లలో కాంగ్రెస్‌ ఈ దేశాన్ని, రాష్టాన్న్రి అన్ని రంగాల్లో భ్రష్టు పట్టించిందే గాకుండా ఇప్పుడు ఆందోళనలకు దిగుతోంది.

తీవ్ర వర్షాభావం.. ఎండిపోతున్న పంటల సమస్య ఇప్పుడే కొత్తగా వచ్చింది కాదు. ఇది గత పదేళ్లుగా వస్తున్నదే. అయితే ఇప్పుడు విభజన సమయంలో ఇది ఎక్కువయ్యింది. ఎందుకంటే ఉత్పత్తి కేంద్రాలన్నీ ఆంధ్రాలో ఉండడం, విద్యుత్‌ పిపిఎలను రద్దు చేస్తామంటూ ఆంధ్రా సర్కార్‌ బెదిరించడం కూడా ఓ కారణంగా భావించాలి. ఇక్కడ రైతులను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అయితే సరఫరా అవుతున్న విద్యుత్‌ను బేరీజు వేసుకుని రైతులకు అందించడంలో అధికారులు విఫలమయ్యారనే చెప్పాలి. సిఎం కెసిఆర్‌ సొంత జిల్లా కావడంతో దీనికి ప్రాధాన్యం కలిగింది. సహజంగానే కెసిఆర్‌పై గుర్రుగా ఉన్నవారు ఈ అవకాశాలన్ని తీసుకుని సమస్యను తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేశారు. ఇందులో వారు విజయవంతం అయ్యారు. అదే దశలో తమ వైఫల్యాలను కాంగ్రెస్‌ దాచుకోలేకపోయింది. ఎందుకంటే విద్యుత కోతలకు, కొరతలకు అదే కారణమన్నది ప్రజలకు తెలుసు. అరకొరగా బోరు బావుల నుంచి వస్తున్న నీటితో పంటలు కాపాడుకోవాలన్న రైతులకు సక్రమంగా కనీసం రెండుమూడు గంటలు కూడా విద్యుత్‌ అందించకపోవడమన్నది విద్యుత్‌ అధికారుల వైఫల్యంగా గ్రహించాలి. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్న పరిస్థితికి రైతుల ఆగ్రహమే నిదర్శనంగా భావించాలి. రోజుకు కనీసం గంట కూడా సక్రమంగా విద్యుత్‌ సరఫరా చేయడం లేదంటూ నాలుగు గంటలపాటు కార్యాలయం వద్ద నిరసన వ్యక్తంచేశారు. గత కొన్ని రోజులుగా తీవ్రమైన విద్యుత్‌ కోతలను నిరసిస్తూ మెదక్‌ జిల్లా చేగుంట మండలంలోని పలు గ్రామాలకు చెందిన దాదాపు 500 మంది రైతులు నార్సింగి వద్ద 44వ నెంబరు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఆందోళన చేస్తున్న వారిపై అకారణంగా లాఠీఛార్జి చేయడం ద్వారా సమస్యను ఇంకారాజేశారు. ప్రజాస్వామ్యంలో లాఠీలకు పనిచెప్పడం అన్నది చివరి అంశం మాత్రమే కావాలని పోలీసులు ఇంకా తెలుసుకోవడం లేదు. ఇక విద్యుత్‌, వ్యవసాయ అధికారుల మధ్య సమన్వయం ఉంటే సమస్య ఇంతదాకా వచ్చేది కాదు. ఉన్నంతలో రైతులకు అక్కరకు వచ్చేలా విద్యుత్‌ సరఫరా చేసివుంటే సమస్య లాగే దాకా వచ్చేది కాదు. విద్యుత్‌ అధికారులు గ్రామాల్లో తిరుగుతూ ఎక్కడెక్కడ రైతులు పంటలు వేశారో కనుక్కుని వారికి అనుగుణంగా కరెంట్‌ ఇచ్చి ఉండాల్సింది.

విద్యుత్‌ ఉత్పత్తికి కావాల్సిన బొగ్గు తెలంగాణలో ఉంది. విద్యుత్‌ఉత్పత్తి కేంద్రాలను మాత్రం ఆంధ్రాపాలకులు కుట్రతో సీమాంధ్రలో ఏర్పాటుచేశారు. తెలంగాణలో విద్యుత్‌ మోటార్ల ఉండడం వల్ల విద్యుత్‌ వాడకం ఎక్కువ. ఆంధ్రా ప్రాంతంలో నీటి ప్రాజెక్టులు ఉండడం వల్ల రైతులు విద్యుత్‌ వాడకం తక్కువ. తెలంగాణ బొగ్గుతో ఉత్పత్తిచేసిన విద్యుత్‌ను న్యాయంగా తెలంగాణ ప్రాంతానికి ఇవ్వకుండా ఆంధ్రాప్రాంత నాయకులు ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారు. దీంతో తెలంగాణ రైతాంగం విద్యుత్‌ కష్టాలు ఎదుర్కొంటోంది. కరెంటు కోతలతో తెలంగాణ రైతాంగం అతలాకుతలం అవుతుండగా, దీనికి మరింత ఆజ్యంపోసే రీతిలో ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చట్టబద్ధంగా రావాల్సిన విద్యుత్‌ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారు. సాటి తెలుగు రాష్ట్రంలోని తెలంగాణ ప్రజలు అంధకారంలో మగ్గుతుండగా ఆంధ్ర ప్రాంతంలో రెండు పవర్‌ ప్రాజెక్టుల్లో కావాలనే విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపేశారు. విజయవాడలోని థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులోని ఒక యూనిట్‌ను నిలిపివేయడంవల్ల తెలంగాణకు రావాల్సిన 500 మెగావాట్ల విద్యుత్‌ రాకుండాపోయింది. ఒకవైపు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)ను అమలు చేయకుండా, మరొకవైపు ఉద్దేశపూర్వకంగా రెండు యూనిట్లలో విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేశారు. ఓవరాలింగ్‌ పేరుతో విద్యుత్‌ ఉత్పత్తి నిలిపివేయడం సమంజసం కాదు. తెలంగాణకు దక్కాల్సిన విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా, రైతాంగం కడగండ్లను తీర్చేలా తక్షణమే ఆ రెండు పవర్‌ యూనిట్ల నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేపట్టే విధంగా ఏపీ సర్కార్‌ను కేంద్రం ఆదేశించాలి. అప్పుడే సమస్యకు పరిష్కారం దక్కుతుంది. దాంతోపాటు విద్యుత్‌ కోతలతో పంటలు ఎండుతుండడంతో రైతులు చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం సానుకూలంగా అర్థంచేసుకోవాలి.