నాణ్యతలేని సాంకేతిక విద్య దేశానికే ప్రమాదకరం
సాంకేతిక రంగంలో రోజురోజుకూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఇంజినీరింగ్ కళాశాలలకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కళాశాలలకు వరంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన పదేళ్ళలో కళాశాలల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జాతీయ నాలెడ్జ్ కమిషన్ సిఫార్సులు, బహుళజాతి కంపెనీల అవసరాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ఈ కళాశాలల విస్తరణకు కారణాలుగా మారాయి. 1994-95 విద్యాసంవత్సరంలో 32 ఇంజినీరింగ్ కళాశాలల్లో 9,335సీట్లు ఉండగా 2014-15నాటికి ఇంజినీరింగ్ కళాశాలల సంఖ్య 700కు చేరింది. వాటిలో సీట్ల సంఖ్య 3లక్షలా 70వేలకు పెరిగింది. ఈ నేపథ్యంలోనే అత్యధిక ఇంజినీరింగ్ కళాశాలలున్న రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరించింది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అవినీతి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రేక్షకపాత్ర, అనుబంధ విశ్వవిద్యాలయాల నిర్లక్ష్య ధోరణితో ఉమ్మడి రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాలలు పుట ్టగొడుగుల్లా విస్తరించాయి. యాజమాన్య కోటా కింద సీట్లు అమ్మి కోట్లాది రూపాయలు గడించడం, ఒకే యాజమాన్యం కింద ఇబ్బడిముబ్బడిగా కళాశాలలు స్థాపించడం ద్వారా కళాశాలల సంఖ్య పెరిగిపోయింది. కేవలం ఫీజు రీయింబర్స్‌మెంటు కోసం వెలసిన కళాశాలలపై తెలంగాణ ప్రభుత్వం, జెఎన్‌టియు కొరఢా ఝళిపించడంతో కళాశాలల యాజమన్యాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విద్యను లాభసాటి వ్యాపారంగా చేసుకున్న విద్యావ్యాపారులు, రియల్ ఎస్టెట్ వ్యాపారులు తమ కళాశాలలను కొనసాగించాలని ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు కూడా యత్నించారు. ఈ ఒత్తిళ్ళకు వెరవకుండా కనీస సౌకర్యాలు లేని కళాశాలల వల్ల ఉపయోగం శూన్యమని తెగేసిన తెలంగాణ ప్రభుత్వం ఇంజినీరింగ్ కళాశాలలకు సంబంధించిన అన్ని వ్యవహారాలు జెఎన్‌టియు చూసుకుంటుందని కరాఖండిగా చెప్పింది.
ఇదిలా ఉండగా ఇంజినీరింగ్ కళాశాలల యాజమన్యాలు అనుసరిస్తున్న తీరుతో అసలు సమస్య మొదలైంది. సరైన వసతులు కల్పించకుండా, అరకొర అధ్యాపకులతో, విశ్రాంత అధ్యాపకుల సహకారంతో ఇంజినీరింగ్ విద్యను నెట్టుకొచ్చారు. కళాశాల మంజూరులో మార్గదర్శకాలను ఏ ఒక్కటీ పాటించకుండా రాజకీయ ఒత్తిళ్ళతో కళాశాలలు మంజూరయ్యాయి. కళాశాల ఏర్పాటుకు కావాల్సిన స్థలం, భవనాలు, ప్రయోగశాలలు, అర్హత కలిగిన ఉపాధ్యాయులు వంటి అంశాలను పక్కనపెట్టేశారు. కళాశాలల్లో నాణ్యతాప్రమాణాలు పాటించకపోవడంతో ప్రతి సంవత్సరం కళాశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ఫలితంగా పదుల సంఖ్యలో కళాశాలు మూతపడడం, తీవ్ర అడ్మిషన్ల కొరత ఏర్పడింది. దీన్ని గట్టేందుకు కళాశాలలు సరికొత్త విధానాలకు తెరలేపాయి. విద్యార్థులకు అనేక సదుపాయాలు ఉచితంగా బస్సుసౌకర్యం, హాస్టల్ వసతి, ల్యాప్‌టాప్‌లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లు తదితర పద్ధతుల ద్వారా అక్రమంగా అడ్మిషన్లకు యత్నించాయి. అంతేకాకుండా అడ్మిషన్లు తీసుకొస్తే ఒక్కో అడ్మిషన్‌కు కమిషన్ ఇస్తామని బ్రోకర్లను ఏర్పాటుచేసుకున్న సంఘటనలూ ఉన్నాయి. ఇలా అక్రమ అడ్మిషన్లతో నాసీరకమైన విద్యాబోధనతో ఇంజినీరింగ్ విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఉత్తీర్ణత శాతం క్రమంగా తగ్గడం ప్రారంభమైంది. ఉన్నత విద్య ఇంజినీరింగ్ పూర్తిచేసిన వారు దేనికీ పనికిరాకుండా పోతున్నారు. చివరికి డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పనిలో చేరుతున్నారు. ఇంకా కొందరు సాదాసీదా ఉద్యోగాల కోసం తమ రెజ్యూమ్‌లు పట్టుకుని తిరుగుతున్నారు. ప్రతి సంవత్సరం 2లక్షల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ విద్యను పూర్తిచేసి బయటకు వస్తుండగా అందులో కేవలం 17వేల మంది మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారు. మిగతా లక్షా 83వేల మంది ఉద్యోగాల కోసం రోడ్లపై తిరగాల్సిన దుస్థితి నెలకొంది. నాస్కామ్, ఇతర అధ్యయనాలు కూడా ఇదే వాస్తవాన్ని బయటపెట్టాయి.
విద్యా వ్యాపారంలో తమ లాభాలుతప్ప విద్యార్థుల భవిష్యత్ పట్టని ఇంజినీరింగ్ కళాశాలల ప్రక్షాళనకు గత ప్రభుత్వాలు తీసుకోలేని చర్యలను నూతన తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టింది. ఉన్నత విద్యారంగంలో విదేశాలతో పోటీపడాలంటే విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి. రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గి నాణ్యతాప్రమాణాలకు నీళ్లొదిలితే విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారడంతోపాటు భారతీయ విద్యార్థులు విదేశాల్లో పనిచేసేందుకు వెళ్తే అక్కడ మన దేశ పరువుపోయే ప్రమాదం ఉంది. వసతుల్లేని, నాసిరకమైన విద్యాబోధన చేస్తున్న కళాశాలల వల్ల ఉపయోగం లేదు. పైగా అలాంటి కళాశాలల వల్ల విద్యార్థుల భవిష్యత్ దెబ్బతినే ప్రమాదం ఉంది. కావునా సాంకేతిక రంగంలో నాణ్యతాప్రమాణాల విషయంలో ప్రభుత్వం కఠినంగానే వ్యవహరించాలి. రాజకీయ ఒత్తిళ్ళకు తావులేకుండా ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తున్న కళాశాలలను మాత్రమే కొనసాగించాలి. నాణ్యతాప్రమాణాలు పాటించని కళాశాలను రద్దుచేయాలి. అప్పుడే సమర్థవంతమైన విద్యాకుసుమాలు బయటకు వస్తాయి.