మళ్లీ ఎన్‌కౌంటర్లు మొదలయ్యాయి
ఎన్నికల ముందు వాళ్ళు అన్నలు. నక్సల్స్ సమస్య శాంతి భద్రతల సమస్య కాదు. అది సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్య. ప్రతిపక్షంలో ఉన్న అన్ని పార్టీలు ఇదే విషయాన్ని వల్లె వేశాయి. 1984లో నక్సలైట్లే నిజమైన దేశభక్తులని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.రామారావు ప్రకటించారు. ఆ తర్వాత చెన్నారెడ్డి, వైఎస్.రాజశేఖర్‌రెడ్డి వారితో చర్చలు జరుపుతామని ప్రకటించారు. 1984లో మొదట నిర్బంధాన్ని ప్రయోగించింది ఎన్‌టి.రామారావే. ఆ తర్వాత చెన్నారెడ్డి త్రిముఖ వ్యూహంతో అణిచివేతను ఎంచుకున్నాడు. ఆ తర్వాత నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి 1992లో అప్పటి పీపుల్స్‌వార్ పార్టీతో సహా దాని అనుబంధ సంస్థలలైన ఆరు ప్రజాసంఘాలపై నిషేధాన్ని విధించారు. 2004 ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు అలిపిరి ఘటన తర్వాత నక్సల్ వ్యతిరేక ఎజెండాతో ముందుకురాగా వైఎస్.రాజశేఖర్‌రెడ్డి తన ఎన్నికల మ్యానిఫేస్టోలోనే తాము అధికారంలోకి వస్తే వారితో చర్చలు జరుపుతామని ప్రకటించి అదే సంవత్సరం జూలై 21న అప్పటి పీపుల్స్ వార్ పార్టీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు. చర్చలకు పీపుల్స్‌వార్ పార్టీ పేరు మార్చుకుని మావోయిస్టు పార్టీగా చర్చలకు వచ్చింది. దాంతోపాటు జనశక్తితో కూడా చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో ఎజెండా రూపకల్పనకు విరసం సభ్యుడు వరవరరావు, కళ్యాణరావు, గద్దర్ పాల్గొన్నారు. తర్వాత నేరుగా జరిగిన చర్చల్లో మావోయిస్టు పార్టీ తరపున రామకృష్ణ, సుధాకర్, గణేష్ అగ్రనేతలు అజ్ఞాతం వీడి చర్చల్లో పాల్గొన్నారు. చర్చల్లో వారు పెట్టిన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించలేకపోయింది. రెండో విడత చర్చలు ప్రతిష్టంభన నెలకొంది. ఈ సరళిలోనే నల్లమల అడవుల్లో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి మాదవ్‌తోసహ పలువురు నల్లమల్లలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. వరుసగా మట్టా రవికుమార్ లాంటి నేతలు చనిపోయాక మావోయిస్టు పార్టీ చర్చల్లో నుంచి వెనక్కి పోయింది. తర్వాత 2005 ఆగస్టు 15న మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి హత్య తర్వాత తిరిగి మావోయిస్టు పార్టీ అనుబంధ సంస్థలు నిషేధానికి గురయ్యాయి. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి మావోయిస్టుల ఎజెండానే తమ ఎజెండానని కొత్త రాష్ట్రంలో ఎన్‌కౌంటర్‌లు ఉండవని ప్రకటించింది. అలాగే జనశక్తి చర్చల ప్రతినిధి రియాజ్ ఎన్‌కౌంటర్ తర్వాత తాము వైఎస్.మంత్రివర్గం నుంచి బయటికి వచ్చిన విషయాన్ని గుర్తుచేసింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నల్లమలలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. తెలంగాణలో ఎన్‌కౌంటర్లు ఉండవని భావించిన తరుణంలో తాజాగా ఆదిలాబాద్ జిల్లా తిర్యాని మండలం మంగీ గుట్టలో మూడు రోజుల క్రితం తుపాకులు గర్జించాయి. కానీ ఈ ఎన్‌కౌంటర్‌లో ఇరుపక్షాలు ఎలాంటి నష్టం వాటిల్లకపోవడం సంతోషించదగ్గ విషయం. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్‌కౌంటర్లుంటాయని తాజా ఉదాహరణ స్పష్టం చేసింది. మావోయిస్టుల ఎజెండా ఎన్నికల వాగ్దానమేనని తేలిపోయింది. ఎవరు అధికారంలోకి వచ్చినా చరిత్రనే పునరావృతం అవుతుందని మరోమారు స్పష్టమైంది.