హైదరాబాద్‌పై కుట్రలకు మోడీ మద్దతు పలకరాదు

గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నరేంద్రమోడీకి కేంద్రం నుంచి ఏనాడు సహకారం దక్కలేదు. బహుశా మోడీని ఎన్నిరకాల ఇబ్బందులు పెట్టారో ప్రపంచానికంతా తెలుసు. గుజరాత్‌ అభివృద్ధి లక్ష్యంగా ఆయన ముందుకు సాగకుండా అడుగడుగునా కాంగ్రెస్‌ ముళ్లకంచెలు వేసింది. ప్రజలు కూడా కాంగ్రెస్‌ వికృత చేష్టలను గమనించి తగిన బుద్ధిచెప్పారు. ఇప్పుడు ప్రధానిగా మోడీకి గతం గుర్తుంటుందనే అనుకోవాలి. రాష్ట్రాలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుందని నమ్ముతున్న నేత మన ప్రధాని మోడీ. తాను భిన్నమైన వ్యక్తిత్వం ఉన్న నేతగా మోడీ ఎదిగారు. తెలంగాణనే తీసుకుంటే తాజాగా హైదరాబాద్‌పై గవర్నర్‌కు పెత్తనం ఇవ్వడమనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దం. ఇది ఫెడరల్‌ విధానాలకు భంగం కలిగించే అంశం. ఈ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖ రాశారు. తమ హక్కులు హరించేందుకు ప్రయత్నిస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. అలాగే టిఆర్‌ఎస్‌ ఎంపీలు లోక్‌సభలో తమ నిరసన వ్యక్తంచేశారు. దీంతో కేంద్రం కాస్త వెనక్కి తగ్గింది. తాజాగా కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి గవర్నర్‌ అధికారాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. చంద్రకబాబునాయుడు, వెంకయ్యనాయుడు కలిసి కుట్ర పన్ని కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హక్కులను హరించేలా వ్యవహరించడం తగదని వారు నిరసన తెలిపారు. ఈ విషయంలో కేవలం చంద్రబాబు, వెంకయ్యనాయుడుల సమాచారానికే ప్రధాని మోడీ విలువనీయకుండా ఇతరత్రా సమాచారంతో మోడీ ముందుకుసాగాలి. కొత్త ఒరవడికి ప్రధాని మోడీ శ్రీకారం చుట్టాలి. సమాఖ్య స్ఫూర్తికి విలువనిచ్చారన్న ఖ్యాతిని సొంతం చేసుకోవాలి. విభజన చట్టంలో ఈ విషయం ఉందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెబుతూ పెత్తనం ఉండాల్సిందే అన్నరీతిలో చంద్రబాబుకు వత్తాసు పలకడం కూడా సరికాదు. గతంలో చంద్రబాబు ఎలా వ్యవహరించారో మోడీకి తెలియంది కాదు, మోడీని నియంతగా, ఊచకోతలకు కారకుడిగా అభివర్ణించి, సిఎం పదవి నుంచి మోడీని తొలగించాలన్న ప్రచారం చేసిన ఆద్యుడు చంద్రబాబు కాదా.. మోడీకి వ్యతిరేకంగా ఆయన తీసుకున్న నిర్ణయాలను అప్పుడే మరచిపోగలమా ? హైదరాబాద్‌పై పెత్తనం కోసం బాబు ఆరాటం నిజం కాదా..? ఇలాంటి విషయాలను ప్రధాని మోడీ గమనించాలి. తాజాగా గవర్నర్‌కు అధికారాలను కట్టబెట్టడమనేది కూడా ఓ వ్యూహాత్మక కుట్రల నిర్ణయం తప్ప మరోటి కాదు.

హైదరాబాద్‌లో శాంతిభద్రతలపై కేంద్ర ప్రభుత్వం గవర్నర్‌కు సర్వాధికారాలు ఇవ్వడం సరైందికాదని మేధావులు సైతం అంటున్నారు. రాష్ట్ర పరిధిలోని అంశమైన శాంతి భద్రతలను గవర్నర్‌కు కట్టబెడుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడాన్ని  తప్పుబడుతున్నారు. గవర్నర్‌కు అధికారాలు అప్పజెబుతూ ఆంధ్రవారి పెత్తనానికి కుట్ర చేస్తోందన్న విమర్శలపై మోడీ స్పందించాలి. ఈ అంశంపై న్యాయ సలహాలు తీసుకుని, జేఏసీ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తామని కోదండరామ్‌ ప్రకటించారు. ముఖ్యంగా ఇక్కడ అక్రమార్కులపై సీఎం కేసీఆర్‌ ఉక్కుపాదం మోపడంతో ఆంధ్రా సీఎం చంద్రబాబు తన తెరవెనుక ప్రయత్నాలతో కుట్రలకు తెరతీసారు. ఇక్కడ సీమాంధ్రులకు అండగా ఉంటామని, వారికి రక్షణ కల్పిస్తామని అంటున్నారు. ఇలాంటి ప్రకటనలతో ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొటే ప్రయత్నాలు చేయడం సరికాదు. అలాగే ఉమ్మడి పోలీసింగ్‌ ఏర్పాటుచేయడం ద్వారా ఇక్కడ పాగా వేయాలని చూస్తున్నారు. గతంలో హైదరాబాద్‌ను యూటీ చేయాలని డిమాండ్‌ చేసిన వారే ఇప్పుడు ఈ డిమాండ్‌ చేయడం గమనార్హం. హైదరాబాద్‌పై పెత్తనం కోసం పట్టుబడితే తెలంగాణకు అవరోధాలు కల్పించాలన్నది వారి వ్యూహంగా ఉంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రావడం అన్నది వారికి ఇంకా జీర్ణించుకోలేని అంశంగా ఉంది. హైదరాబాద్‌ తెలంగాణలో అంతర్భాగం అని అంటూనే పెత్తనం కోసం విషం కక్కుతున్నారు. చెట్టుకింద కూర్చుని అయినా పాలన చేస్తానన్న ఆంద్రా సిఎం చంద్రబాబు హైదరాబాద్‌ వదలకుండా ఇక్కడి నుంచే పాలన సాగిస్తున్నారు. ఇక్కడి నుంచి వెనక్కి పోమని చెప్పడం దారుణం కాక మరోటి కాదు.  హైదరాబాద్‌పై పెత్తనం కోసం చంద్రనబాబు ఇటీవల కేంద్రానికి లేఖ రాయడం, టిడిపి నేతలు ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలవడం వారి దుర్బుద్ధిని ప్రదర్శించింది. ఇవన్నీ ఒక ఎత్తయితే అన్ని రాష్టాల్రు సమానమంటూ కేంద్ర మంత్రి వెంకయ్య తన పక్షపాత ధోరణితో సాగడం సరికాదు. అక్రమ కట్టడాల కూల్చివేత, భూముల స్వాధీనం ఇకముందు మరింత ఉధృతంగా ఉండనుండడంతో తెలంగాణ సర్కార్‌ను అప్రతిష్ట చేసే కుట్రలు చేస్తున్నారన్న విషయం తెలుస్తోంది. అక్రమాలన్నీ చేసిన నేతలు దీనిని తట్టుకోలేకపోతున్నారు. ఇన్నాళ్లూ తెలంగాణను దోచుకున్న వారే ఇప్పుడు లేని పెత్తనం కోసం అర్రులు  చాస్తున్నారు. ఎక్కడాలేని విధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా ఇక్కడ చట్టాలు అమలు చేయాలని చూడడం అనైతికం కాక మరోటి కాదు. ఇక హైదరాబాద్‌ అడ్డాగా చేసుకుని ఇక్కడ భూములను కబ్జా చేసుకున్న వారే  తమ అక్రమ సంపాదనను కాపడుకోవడానికి లేదా దానికి రక్షణ కవచం వేసుకోవడానికి ఇంతకన్నా మార్గం లేదన్న ఆలోచన వారిలో కనిపిస్తోంది. ఇది సరైందికాదు. హైదరాబాద్‌పై కేంద్రం పెత్తనాన్ని ప్రతి తెలంగాణ బిడ్డా వ్యతిరేకించాలి. అవసరమైతే ఉద్యమానికి సిద్ధంకావాలి.