నింగికెగిసిన ఉద్యమ కెరటం
నేరం అధికారమై ప్రజల్ని నేరస్తుల్ని చేస్తున్నప్పుడు జనంవైపున నిలబడి ప్రశ్నించిన గొంతు… సిరిసిల్ల, జగిత్యాల కల్లోలిత ప్రాంత చట్టాలు ప్రజలపై కరళానృత్యం చేస్తున్నప్పుడు పోరాడిన పిడికిలది. ప్రజలకు హక్కులున్నాయని.. పౌర హక్కులున్నాయని.. పోరాడే బిడ్డలవైపు నిలబడిన పాతబస్తీ ముద్దుబిడ్డ, ప్రజలకు పాత పరిచయస్తుడు ఎంటీ ఖాన్ ఇకలేరని తెలిసి సంపాదకీయం రాయడానికి చింతిస్తున్నాం. నాయకులు.. వినాయకుల వెంట పరిగెత్తని జర్నలిస్టు మహమ్మద్ తాజొద్దిన్ అలీఖాన్. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు ఉవ్వెత్తున పోరాటాలు సాగుతున్నప్పుడు విరుచుకుపడిన నిర్భందం, ఊళ్లే జైళ్లయినప్పుడు పౌరహక్కుల సంఘంతో కలిసి నిజనిర్ధారణలకోసం ఎంటీ ఖాన్ పల్లెలకు తరలివెళ్లిన ప్రజా జర్నలిస్టు. దేశంలో మొదటిసారిగా పౌరహక్కులకు, గొంతుకలకు తాళంవేసి తన అసలు స్వరూపం చాటుకున్న ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ప్రశ్నించినందుకు అప్పుడు మొట్టమొదటి అరెస్టు ఎంటీ ఖాన్‌నే చేశారు.
తెలంగాణాలో సీమాంధ్ర పెత్తనం, ఆధిపత్యాన్ని, దోపిడీని నిగ్గదీసి ప్రశ్నించాడు. 1952లో ముల్కీ నిబంధనలను సీమాంధ్ర పాలకులు తుంగలో తొక్కినప్పుడు ఉద్యమ పతాక మన ఎంటీ ఖాన్. 1969లో సాగిన జై తెలంగాణ ఉద్యమంలో ప్రజాసంఘాలతో కలిసి ఆయన పాల్గొన్నాడు. విప్లవ రాజకీయాలు, నక్సల్బరీ ఉద్యమ సంఘీభావం ఎన్ని నిర్భందాలు ఎదురైనా ఆయన ముళ్లబాట వీడలేదు. ఇమ్రోజ్ పత్రిక ఎడిటర్ షోయబుల్లాఖాన్‌కు నిజమైన వారసుడు తాజోద్దిన్ అలీఖాన్. సుధీర్ఘ కాలంపాటు నిత్య నిర్భంధమైనప్పుడు ఆయన కన్నాభిరాన్, బాలగోపాల్‌లతో కలిసి పనిచేశాడు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం తుదకంటూ పోరాడి నిలిచిన యోధుడు. ఆయన లేనిలోటు హక్కుల ఉద్యమానికి పూడ్చుకోలేనిదే. న్యూస్‌టైమ్, ది మెయిల్, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఏపీ టైమ్స్, ట్రీబ్యూన్ పత్రికల్లో ఆయన జర్నలిస్టుగా పనిచేశాడు. ఏనాడూ నిబద్ధతను వీడలేదు. ఎన్ని గజాలు రాశామన్న దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎన్ని నిజాలు రాశామన్నదానికే ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రతి సిరాచుక్క, ప్రతి అక్షరం ప్రజా సమస్యలు, హక్కుల్ని ప్రతిబింబించాయి. పౌరహక్కుల ఉద్యమాన్ని ఎలా నడపాలో, ఎలా పోరాడాలో పాఠాలు నేర్పిన గురువు ఆయన. విరసం సభల్లో ఆయన ఉపన్యాసం అందర్నీ ఆకట్టుకునేది. చావూపుట్టుక మాత్రం ఆయనదే అయినా బతికిన జీవితకాలం ప్రజలకోసం పీడిత ప్రజల హక్కులకోసం పరితపించిన నేతగా ప్రజల హృదయాల్లో ఆయన స్థానం పదిలం. ఒక పనిని మొదలుపెట్టడం గొప్ప కాదు ఆ పని పూర్తయ్యేవరకూ ఎన్ని కష్టాలు, ఇబ్బందులు ఎన్ని వచ్చినా వెన్నుచూపకుండా మందుకెళ్ళేవారే చరిత్రలో నిలిచిపోతారు. అలాంటి వ్యక్తుల్లో తాజుద్దీన్ అలీఖాన్ ఒకరు. బతికున్నంత కాలం ప్రజల బాగు కోసమే తన పోరాటం కొనసాగింది. సమాజంలో అన్యాయానికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా ఆయన నిక్కచ్చిగా నిలబడ్డాడు. ఆటుపోట్లకు వెరవకుండా తన కలంతో ప్రజలను మేల్కొలిపారు. వర్థమాన జర్నలిస్టులకు ఆయన జీవితం ఆదర్శం. ఆయన నడిచిన అడుగుల్లో ఒక్కడుగు కలిపినా ఆయన జీవిత చరిత్ర పుటల్లో ఒక్కపేజీని ఆదర్శంగా తీసుకున్నా తెలంగాణ జర్నలిస్టుల జీవితం ధన్యం. జనంపక్షం వహించి అమరుడైన నేతకు ‘జనంసాక్షి’ శిరస్సు వంచి నమస్కరిస్తోంది.