ప్రత్యేకతను సంతరించుకున్న జెండా పండుగ
ఈ పంద్రాగస్ట్ ప్రత్యేకతను సంతరించుకుంది. గతంలో వేడుకలకు భిన్నంగా ఈ పండుగ సాగడం విశేషం. అలాగే మరెన్నో విశేషాలను ఈ పంద్రాగస్ట్ మోసుకుని వచ్చింది. ఇంతవరకు స్వాతంత్య్రం పూర్వం మాత్రమే జన్మించిన వారు ప్రధానిగా ఎర్రకోటపై జెండా ఎగురవేశారు. అయితే మోడీ స్వాతంత్య్రానంతరం జన్మించిన తొలి ప్రధానిగా ఎర్రకోట నుంచి జెండా ఎగురవేశారు. ఇక ఆంద్రప్రదేశ్ రెండు రాష్టాల్రుగా విడిపోయాక తెలంగాణ కొత్త రాష్ట్రంగా అవతరించింది. దీనికి ఉద్యమ సారథ్యం వహించిన నేతగా కెసిఆర్ సిఎంగా చరిత్రకెక్కారు. అలాగే గోల్కొండ కోట మీద నుంచి ఆయన జెండా ఎగురవేయడం కొత్తదనాన్ని ఆవిష్కరించింది. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు తొమ్మిదేళ్లు సిఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు సిఎంగా కర్నూలులో జెండా ఎగురవేశారు. గతంతో పోలిస్తే ఇలా విభిన్నంగా ఈ మారు జెండా పండుగ జరుపుకున్న ఘనత మనకు దక్కింది. ఇక కేంద్రంలో అంతా కొత్తదనమే కనిపిస్తోంది. అభివృద్ది ఎజెండాగా మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా బిజెపి తరఫున జెండా ఎగురవేశారు. వాజ్‌పేయ్ తరవాత ఆయన రెండో బిజెపి వ్యక్తిగా ఈ అవకాశాన్ని దక్కించుకున్నారు. స్వతంత్ర భారత ప్రథమ ప్రధాని నెహ్రూ, ఇందిర, రాజీవ్, పివి, వాజ్‌పేయల తరవాత మోడీ ప్రసంగాన్ని ఆలకించేందుకు దేశం ఆసక్తి ప్రదర్శించింది. గతంలో నేతల ప్రసంగాలను బేరీజు వేసుకుని ఎర్రకోట విూద నుంచి నరేంద్రమోదీ చేసిన ప్రసంగం కోసం కూడా జాతి అంతే శ్రద్ధగా ఆలకించింది. మోదీ ప్రసంగం ఈ దేశానికి కొత్త దిశను ఆవిష్కరించింది. ఏం చెప్పబోతున్నారంటూ చర్చలు విస్తృతంగా జరుగుతున్న తరుణంలో ఆయన ప్రసంగం దిశా నిర్దేశం చేసేదిలా, మన కర్తవ్యాన్ని బోధించేదిలా ఉంది. ప్రతి స్వాతంత్య దినోత్సవాన్నీ ఓ పండుగలా జరుపుకుంటూ, సాధించిన దానిని సవిూక్షించుకుంటూ, నిరాశలో మునుగుతూ, ఆశల్లో తేలుతూ, ఈ దశ నుంచి కొత్త దిశగా ప్రయాణించాలన్న తపనను వ్యక్తీకరించారు.. స్వాతంత్య్ర స్ఫూర్తితో దేశాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్దామని ప్రధాని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. ప్రధాని ¬దాలో దేశ ప్రజలకు స్వాతంత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
పార్టీలకన్నా దేశమే మిన్న… అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. అన్ని పార్టీలు కలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. నేతలు, పాలకులు దేశ నిర్మాతలు కాదు… రైతులు, కార్మికులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలే దేశానిర్మాతలని వ్యాఖ్యానించారు. కలిసి నడుద్దాం.. కలిసి ఆలోచిద్దాం… కలిసి ముందుకు నడుద్దాం… ఐకమత్యంగా దేశాభివృద్ధికి పాటుపడదామని ఉద్వేగంగా ప్రసంగించారు. ప్రతిక్షణం ప్రజల సేవలో భాగస్వామి అయ్యానా లేదా అన్నదే ముఖ్యం… దేశ హితం కోసమే అహరహం పనిచేస్తామని ప్రకటించారు. దేశాభివృద్ధి మన బాధ్యత కాదు, మన పూర్వీకుల కల అని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల కలను నిజం చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. దేశానికి ఏం చేశామని ప్రతిఒక్కరూ ఆలోచించాలని సూచించారు. దీంతో ఆయన తన విజన్ ఆవిష్కరించారు. అభివృద్ది మంత్రంగా ముందుకు సాగుదామని పిలుపునివ్వడం స్వాగతించాల్సిందే.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ వేడుకలకు ప్రత్యేకత ఉంది. రాజధాని లేని ఆంధప్రదేశ్‌లో అప్పటి ఆంధ్ర రాష్ట్రం రాజధాని కర్నూలులో వేడుకలు జరిగాయి. దీనికి సిఎం చంద్రబాబు కొత్త ఒరవడిని సృష్టించారు. స్వాతంత్య్ర దినోత్సవ స్ఫూర్తితో నవ్యాంధ్ర పునర్నిర్మాణమే ధ్యేయంగా ముందుకెళతామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. స్వాతంత్య్ర పోరాటంలో ఆంధ్రుల త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు. గతంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకలకు రాయలసీమ ముఖద్వారం కర్నూలులో జరిగే వేడుకలకు ప్రత్యేకత ఉందన్నారు. అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యత ఉండాలనేదే తమ ఉద్దేశమన్నారు. ఏకపక్ష విభజనతో కాంగ్రెస్ పార్టీ దోషిగా నిలబడిందన్నారు. రాష్ట్ర విభజన దుష్ఫలితాల నుంచి కోలుకునేందుకు కార్యదీక్షతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అభివృద్దికి నిరంతరంగా శ్రమిస్తానని చెబుతూనే ఆంధప్రదేశ్‌లో అక్టోబర్ 2 నుంచి నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆయన కర్తవ్య దీక్షను అభినందించాల్సిందే. ఇక నవ తెలంగాణలో తొలిసారిగా చరిత్రాత్మకమైన గోల్కొండ కోట వేడుకలకు వేదిక కావడం విశేషం. ఆశలు, ఆకాంక్షలు అధికంగా ఉన్న ప్రజలకు అంతా సవ్యంగా జరుగుతోందన్న భరోసా కల్పించేవిధంగా సీఎం కెసిఆర్ తన ప్రసంగాన్ని చేశారు. ఆందోళనచేస్తున్న నిరుద్యోగులకు ఉద్యోగ ప్రకటనచేశారు. 50వేల ఉద్యోగాలను కమిషన్ ద్వారా భర్తీ చేస్తామన్నారు. ఎన్నికల హావిూలను నెరవేర్చే ప్రయత్నంలో భాగంగా ఆయన ప్రసంగం కొనసాగింది. క్రీడాకారులకు పెద్దఎత్తున ప్రోత్సాహాలు అందించి వెన్నుతట్టారు. ఇక దళితులకు మూడెకరాల భూ పంపిణీకి శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి స్వాతంత్య్ర వేడుకలను గోల్కొండ కోటలో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచ ప్రసిద్ధిచెందిన వజ్ర, వైఢూర్యాల వ్యాపార కేంద్రంగా గోల్కొండ వెలుగొందిందన్నారు. శాస్త్ర విజ్ఞానానికి, వాస్తు కళా నైపుణ్యానికి ప్రతీక గోల్కొండ కోట అని కొనియాడారు. ఇక్కడ రామదాసు కీర్తనలకు రాగం పలికిందన్నారు. ఇలా తాను చెప్పినదానికి అనుగుణంగా చేయబోతున్న పనులను వివరించారు కేసీఆర్. మొత్తానికి మన పంద్రాగస్ట్ విభిన్నంగా సాగింది. మువ్వన్నెల జెండా రెప్పరెపలాడింది.