సర్కారు వద్ద డాటా ఉండాల్సిందే
ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులకు అందాలంటే సర్కారు వద్ద రాష్ట్రంలోని కుటుంబాల స్థితిగతుల సమాచారం ఉండాల్సిందే. ఒక కుటుంబం పేద కుటుంబమా.. లేదా మధ్యతరగతికి చెందిందా.. లేదా ధనిక కుటుంబమా.. ఏ కుటుంబాలకు ప్రభుత్వం ఏ రకమైన సహకారం అందించాలనే స్పష్టత కోసం సమగ్ర సర్వే అవసరం. ఈ నెల 19న సమగ్ర సర్వే నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. ఈ సర్వే ద్వారా అధికారుల నుంచి ప్రభుత్వానికి కచ్చితమైన నివేదిక అందితే సంక్షేమ పథకాలు అర్హులకు చేరే అవకాశాలుంటాయి. గత ప్రభుత్వాలు చేపట్టిన సర్వేలు తప్పులతడకలుగా ఉన్నాయి. కుటుంబాల సంఖ్యకంటే రేషన్‌కార్డుల సంఖ్యే ఎక్కువగా ఉండడమే ఇందుకు చక్కటి ఉదాహారణ. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ రంగు చొక్కాలకు మాత్రమే సంక్షేమ ఫలాలు అందాయితప్ప అర్హులైన ప్రజానీకానికి ఏమాత్రమూ అందలేదు. గతంలో సీమాంధ్ర పాలకులు ప్రవేశపెట్టిన ఏ పథకమూ తెలంగాణ ప్రజలకు ఊరటనివ్వలేదు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యక్రమమైన సకల జన సమగ్ర సర్వే ద్వారా నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో 12లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి. 3లక్షల దళిత కుటుంబాలు అర్బర్ ఏరియాలోఓ ఉన్నాయి. గత ప్రభుత్వాలు 31ఏళ్ళలో ఇప్పటివరకు ఇచ్చిన భూమి 41వేల ఎకరాలకు మించలేదు. ఒకటిరెండేళ్ళలో లక్ష దళిత కుటుంబాలకు భూమి పంచేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ళు, రాజీవ్ ఆరోగ్య శ్రీ, అభయహస్తం లాంటి పథకాలు ఏవీ కూడా అర్హులకు అందలేదు. ఇచ్చిన వారికే రేషన్ కార్డులు ఇచ్చారుతప్ప అర్హులకు ఇవ్వలేదు. గతంలో నిర్వహించిన సర్వేలు సరైన పంథాలో లేవు. జనాభా లెక్కలు తీస్తే ఒక ఫిగర్, డిఆర్‌డిఎ లెక్కలు తీస్తే మరో ఫిగర్, ఎస్సీ కార్పొరేషన్‌లో ఒకటి, ఓటర్‌లిస్టు ఒకటి, కులసంఘాలు సమర్పించే లెక్కలు, రాజకీయ పార్టీల లెక్కలు తీస్తే తెలంగాణ రాష్ట్రంలోనే మూడు రాష్ట్రాల జనాభా ఉన్నట్లనిపిస్తుంది. జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 84లక్షల కుటుంబాలుండగా ఏకంగా 91లక్షల తెల్లరేషన్ కార్డులు ఉన్నాయి. ఇవేకాక మరో 15లక్షల గులాబీ కార్డులున్నాయి. మొత్తం కలిపి 1.7కోట్ల కార్డులున్నాయి. ఈ తప్పుడు లెక్కల వల్ల ఏన్నో పొరపాట్లు జరుగుతున్నాయి. ప్రతిదానికీ తెల్ల రేషన్‌కార్డునే లింకుపెట్టి 55లక్షల ఇండ్లు కట్టించినట్లుగా గత ప్రభుత్వాలు లెక్కలు చెబుతున్నాయి. ఇవి అర్హులకు అందని దుస్థితి నెలకొంది. గృహ నిర్మాణ రంగంలో వేలకోట్ల కుంభకోణం జరిగింది. ఏన్నో ఏళ్ళుగా సీమాంధ్ర దోపిడీ పాలనతో విసిగివేసారిన ప్రజలు కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలు అడియాశలు కాకుండా ఉండాలంటే అధికారులు సమగ్ర సర్వే ద్వారా స్పష్టమైన సమచారం ఇవ్వడంతోపాటు ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు వారి వద్దకు తీసుకుపోవాల్సిన అవసరం చాలా ఉంది.
ప్రణాళిక దేనికైనా అవసరం. చదువుకైనా, పనికైనా ప్రణాళిక లేకపోతే ముందుకు వెళ్ళలేం. గుడ్డెద్దు చేల్లో పడ్డట్లుగా కాకుండా పనులు సాగాలి. ఇంట్లో రోజూ వంటచేసే ఇల్లాలు సైతం ప్రణాళిక ఉంటుంది. కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం స్తబ్దుగా ఉన్న అధికార యంత్రాంగంలో కదలిక తీసుకురానుంది. గ్రామం మొదలు రాష్ట్రం వరకు ప్రణాళికలు సిద్ధం చేసేందుకు పురమాయించారు. అప్పుడే ఎంతమంది ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు. ఎవరికి ఏమేం కావాలన్నది తెలుస్తుంది. ఇంతకాలం కాకాలెక్కలు చెప్పి, కాకమ్మ కథలు చెప్పి నడిపించారు. ఇక ముందు అలా సాగడానికి వేల్లేదని చెప్పడమే ఓ ప్రణాళిక. తెలంగాణలో ఉన్న ప్రజలకు సంబంధించి సమగ్రమైన సర్వే జరిగిన దాఖలాలు ఇప్పటివరకు లేవు. తమ ప్రభుత్వం తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వే గత సర్వేలకు పూర్తి భిన్నమైందని కేసీఆర్ చెబుతున్నారు. మూడెకరాల భూమి, ఫీజుల చెల్లింపులు, ఉచిత నిర్బంధ విద్య, ప్రతి పేదవాడికి ఇల్లు తదితర పథకాలు అమలుకావాలంటే వివరాలు సిద్ధంగా ఉండాలి. ఇందుకు ప్రజలు కూడా బాధ్యతగా భావించాలి. ఇది మన కోసం చేస్తున్న సర్వేగా గుర్తించాలి. లేకుంటే భవిష్యత్‌లో ఎన్ని పథకాలు పెట్టినా మన బతుకులు గొర్రెతోక బెత్తెడు అన్నచందంగా మిగిలిపోగలవని గుర్తుంచుకుందా.