కలహాల కాపురం కన్నా చర్చలే పరిష్కారం
ఇద్దరు చంద్రులు కలసి నడవాలన్న నిర్ణయానికి గవర్నర్ నరసింహన్ ప్రేరణ ఇచ్చారు. నిజానికి విభజన అనంతరం ఈ పని కేంద్రం చేయాల్సింది. అయితే విభజనతో సమస్యలు సృష్టించిన కాంగ్రెస్ ఇప్పుడు విమర్శలతో కాలం వెళ్లబుచ్చుతోంది. ఈ దశలో గవర్నర్ చొరవ తీసుకుని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెట్టి చర్చల వేదికను ఏర్పాటుచేశారు. కలసి నడుద్దాం, అభివృద్ధి సాధిద్దాం అన్న సంకల్పాన్ని మంత్రించారు. మొత్తానికి ఇదో శుభ సూచకంగానే భావించాలి. దీనిని రాబోయే కాలానికి ముందడుగుగా భావించాలి. అయితే తొలి ప్రయత్నం పడుతున్న దశలో పరస్పర విమర్శలకు తావీయరాదు. రెండు రాష్ట్రాల సిఎంలు విభిన్న దృక్పథంలో ముందుకుసాగాలని నిర్ణయించుకున్నారు. ఎవరి రాష్ట్రాన్ని వారు అభివృద్ధి చేసుకోవాలి. కాంగ్రెస్ విమర్శలు పట్టించుకోవాల్సిన పనిలేదు. తెలంగాణలో టిడిపి నేతలు చేస్తున్న విమర్శలు జుగుప్సాకరంగా ఉన్నాయి. ఓ వైపు ఇద్దరు సిఎంలు చర్చలు చేస్తున్న సమయంలోనూ టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి విమర్శలకు దిగడం దిగజారుడు రాజకీయాలు కాక మరోటి కాదు. నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలితప్ప అదేపనిగా విమర్శలు చేయడం సరికాదు.
రాజభవన్‌లో ముఖ్యమంత్రులిద్దరు కలిసి, రెండు రాష్ట్రాల మధ్య అంతరాలను తొలగించుకుని అభివృద్ధి దిశగా అడుగువేయాలని భావిస్తున్న తరుణంలోనూ విమర్శలు చేయడం చిల్లర రాజకీయాలకు చిరునామాతప్ప మరోటి కాదు. పరస్పర సహకారానికి బాసలు చేస్తూ, విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య రెండు నెలలుగా వేడెక్కిన వాతావరణాన్ని చల్లబరిచారు ! ఇలా గవర్నర్ అధికార నివాసమైన రాజ్‌భవన్ ఒక చారిత్రక సన్నివేశానికి వేదికైంది. గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఆంధప్రదేశ్ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ కావడం, పలు అంశలపై నిర్మోహమాటంగా చర్చించుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. చర్చల ద్వరానే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎప్పటికైనా కలహించుకోవడమన్నది మంచిదికాదు. ఆధునిక రాజకీయాలకు ఇదో కొత్త ఒరవడి కావాలి. చర్చలే ప్రజలకు నచ్చుతాయి. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి చర్చల ద్వారా సమస్యలకు చెక్ పెట్టాలని నిర్ణయించుకోవడం మంచి పరిణామంగా అందరూ భావించాలి. ఎప్పటికప్పుడు చర్చించుకుని అధికారుల స్థాయిలోనే సమస్యలను పరిష్కరించుకోవాలి. వారి వల్ల కూడా కుదరనప్పుడు తమ దృష్టికి తీసుకురావాలని సీఎస్‌లను ఆదేశించారు. నిజానికి ఇద్దరు సిఎంలు, ఇద్దరు స్పీకర్లు అంతా ఒకే రాజకీయబడిలో పాఠాలు చదివిన వారే. ఒకే దగ్గర కలసి పనిచేసిన వారే. సిద్ధాంతపరంగా విభేదాలు ఉన్నా, అభివృద్ది విషయంలో వారికి తేడాలులేవు. చర్చల అనంతరం ఇరు రాష్ట్రాల సిఎంలు మాట్లాడిన తీరు కూడా హుందాగా ఉంది. ఇరువురు కూడా కలసి సాగుదామని ప్రకటించారు. విభజన మూలంగా రెండు రాష్ట్రాల మధ్య తలెత్తిన చాలా సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉందని, వాటిని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకొంటామని ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. వివాదాలకు ఆస్కారమిస్తే సమయం అంతా దానికే సరిపోతుందని, ఈ సమస్యల మూలంగా రెండు నెలల నుంచి పాలనపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టలేకపోయామని అన్నారు. ఈ సమావేశం తొలి అడుగు అని, మంచి వాతావరణంలో సాగడం శుభపరిణామమని అన్నారు. హేతుబద్ధత లేని విభజన కారణంగా ప్రజలు, ప్రభుత్వాల మధ్య నెలకొన్న ఇబ్బందికర పరిస్థితులు ఇలాంటి సమావేశాల వల్ల క్రమంగా తొలగిపోతాయనే ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ చర్చలు ప్రాథమికమేనని, భవిష్యత్తులోనూ కలసి చర్చించుకొంటామని తెలిపారు. చిన్న చిన్న అంశాల వల్ల వివాదాలు తలెత్తడం సమర్థనీయంకాదని, చంద్రబాబుతో తాము జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అన్నింటా పరస్పరం సహకరించుకోవాలని ఇరువురు తీర్మానించారు. సమావేశంలో ఉద్యోగుల విభజనకు ఉభయులం అంగీకరించాం. రెండు రాష్ట్రాల మధ్య అవగాహన కుదిరింది. అయినా కేంద్రం నియమించిన కమలనాథన్, ప్రత్యూష్ సిన్హా కమిటీలను గౌరవిస్తాం. శాసనసభలో గదుల కేటాయింపుపై చర్చించాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిశాక తెలంగాణ బ్జడెట్ సమావేశాలు పెట్టాలనుకున్నాం. ఇలా ఉద్యోగలు విభజన మొదలు, సంస్థల కేటాయింపు, శాసనసభ సమావేశాల నిర్వహణ వరకు అన్నీ కలసి సాగాలని నిర్ణయించారు. మొత్తంగా ఇప్పుడు పడిన అడుగు అభివృద్ధికి పునాది కావాలి. ఇరు రాష్ట్రాల తెలుగువారు పురోగమించాలి. అందరికీ ఇదో కొత్త వెలుగు కావాలి. అన్నదమ్ములా విడిపోయి కలసి ఉందామన్న నినాదమే ఇక ముందుకు సాగాలని కోరుకుందాం.