ఆంక్షలులేని తెలంగాణ కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలి
తెలంగాణ ప్రజల 60ఏళ్ల కల సాకారమైంది. అదే ఆనందంతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకొని అభివృద్ధివైపు బుడిబుడి అడుగులు వేస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆంక్షలు విధించింది. రాష్ట్ర రాజధానిపై పూర్తి అధికారాలు గవర్నరే చెలాయిస్తాడని కేంద్ర ¬ంశాఖ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ పంపింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం హైదరాబాద్‌లోని జిహెచ్‌ఎంసి పరిధిలో శాంతిభద్రతల విషయంలో గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు ఉండాలని కేంద్రం చెబుతోంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలచేత ఎన్నుకున్న ప్రభుత్వాలు పాలన కొనసాగించాలి. అది సాధ్యంకాని పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించాలి. అప్పుడు రాష్ట్రపతి పాలనలో రాష్ట్రంలో గవర్నర్ సర్వాధికారిగా వ్యవహరిస్తారు. ఆ సమయంలో అన్ని అధికారాలు ఆయనే చెలాయిస్తాడు. మిగతా పరిస్థితుల్లో మంత్రివర్గ సలహామేరకు మాత్రమే గవర్నర్ నిర్ణయాలు తీసుకుంటాడు. విక్షణాధికారాలు మొత్తం కూడా రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రే చెలాయించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో ప్రజలచేత ఎన్నుకున్న ప్రభుత్వం పాలన కొనసాగిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తనవంతు కృషిచేస్తున్నారు. టిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తోంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని జిహెచ్‌ఎంసి పరిధిలో అధికారాలను గవర్నర్‌కు బదిలీచేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయడం విడ్డూరంగా ఉంది. ఉమ్మడి రాజధాని అనే సాకుతో సీమాంధ్ర పాలకుల ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. 60ఏళ్ళుగా తెలంగాణ ప్రజల మాంసపు ముద్దలకు అలవాటుపడ్డ సీమాంధ్ర పాలకులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా తెలంగాణ ప్రాంతంపై ఇంకా ఆధిపత్యం చెలాయించేందుకు కుట్ర పన్నుతున్నారు. సీమాంధ్రుల పాలనలో హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై కేసీఆర్ కొరఢా ఝళిపించడం చూసి వారి గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. తాము అక్రమంగా దోచుకొని హైదరాబాద్‌లో దాచుకున్న సొమ్మును కేసీఆర్ ఎక్కడ లాక్కొని ప్రజలకు పంచిపెడుతాడోనని వారికి కునుకుపట్టడం లేదు. అందువల్లే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్న టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ప్రధానమంత్రిపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ ప్రభుత్వంపై ఆంక్షలు పెట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి లేఖ రాయించాడనేది తెలంగాణ ప్రజల అభిప్రాయం. కేంద్రం పంపిన లేఖను పరిశీలిస్తే అడుగడుగునా తెలంగాణ ప్రభుత్వంపై ఆంక్షలు కనిపిస్తున్నాయి. మంత్రివర్గ నిర్ణయాలపై నివేదిక కోరడం, పోలీసు యంత్రాంగంలో ఉన్నత స్థాయి పోస్టుల్లో ఉన్న వారిని బదిలీచేసే అధికారం తదితర అంశాలను పరిశీలిస్తే తెలంగాణ ప్రభుత్వాన్ని కీలుబొమ్మగా చేసి ఆడించేందుకు కుట్ర పన్నుతోంది.
ఈ పరిణామాలను పరిశీలిస్తే రానున్న కాలంలో తెలంగాణ మరోసారి దోపిడీ గురయ్యే ప్రమాదం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యక్ష దోపిడీకి పాల్పడిన సీమాంధ్ర పాలకులు ప్రస్తుతం కేంద్రం పేరుతో మరోసారి మన రాష్ట్రంపై ఆధిపత్యాన్ని చెలాయించాలని కుట్ర పన్నుతున్నారు. ఈ విషయాన్ని ప్రతి తెలంగాణ బిడ్డ పసిగట్టాలి. లాఠీఛార్జీకి భయకుండా, తుపాకీ గుళ్లను ఎదుర్కొని ప్రాణాలు సైతం లెక్కచేయకుండా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ పోరాటంలో ప్రాణాలొదిలిన అమరవీరుల ఆశయాలు సాధించాలన్నా, వారి ఆత్మకు శాంతి చేకూరాలన్నా తెలంగాణ బిడ్డలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి ఆంక్షలు లేని తెలంగాణ కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలి. బంగారు తెలంగాణ నిర్మించుకోవాలనే సంకల్పంతో ముందుకెళ్తున్న తరుణంలో వస్తున్న అడ్డంకులను గట్టిగా ఎదుర్కోవాలి.