చర్చలు మంచిదే
ప్రజాస్వామ్య దేశంలో చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవు తాయి. ప్రపంచలో ఏన్నో దేశాల మధ్య యుద్ధాలు జరిగినా చివరికి శాంతి చర్చల తర్వాతే సమస్యలు పరిష్కారమయ్యాయి. దురాక్రమణలు, వివిధ దేశాల మధ్య రవాణా, సరిహద్దు వివాదాలు ఇలా ఎన్నో అంశాలకు చర్చలే పరిష్కారం చూపాయి. కక్షతో సాధించలేనిది క్షమాభిక్షతో సాధించవచ్చు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య ఎన్నో అంశాలు వివాదాస్పదమయ్యాయి. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే సీమాంధ్ర పాలకులు కుట్రలతో తెలంగాణ ప్రభుత్వాన్ని లొంగదీసుకోవడం సాధ్యంకాని పని అని గుర్తెరిగారు. సీమాంధ్ర ప్రభుత్వం కుట్రలను తెలంగాణ ప్రభుత్వం ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకెళ్లింది. చివరికి చర్చల పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎట్టకేలకు కేసీఆర్‌తో సయోధ్యకు రావడం ముదావహం. ఇద్దరి మధ్య సానుకూల వాతావరణం నెలకొనేందుకు గవర్నర్ నర్సింహన్ చేసిన ప్రయత్నం హర్షణీయం. ఇద్దరు ముఖ్యమంత్రులు పంతాలు పక్కబెట్టి కలిసి వివిధ సమ్యలపై చర్చించేందుకు అంగీకరిస్తూ సమావేశమయ్యేలా గవర్నర్ కృషిచేయడం సంతోషదాయకం.
ఏకపక్షంగా పవర్ పర్చెస్ అగ్రిమెంట్‌ను రద్దుచేసి చంద్రబాబు కయ్యానికి కాలు దువ్వాడు. ఎపీ జెన్‌కో పీపీఎల రద్దుకు బదులుగా నాగార్జునసాగర్, జూరాల విద్యుత్ నుంచి ఏపీ వాటాను తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది. ఎంసెట్ కౌన్సెలింగ్ సందర్భంగా 1956కన్నా ముందు నుంచి తెలంగాణలో ఉన్నవారికే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ ప్రాతిపదిక ఇతర అన్ని అంశాలకు వర్తింపజేసే ప్రమాదం ఉందని సీమాంధ్ర ప్రభుత్వం భయపడింది. పోలవరం ముంపు ప్రాంతాలు ఏపీలో కలుపుతూ కేంద్రం చట్టం చేసింది. ముంపు మండలాలు తెలంగాణకే చెందుతాయని, ప్రాజెక్టు డిజైన్ మార్చాలని తెలంగాణ ప్రభుత్వం వాదించింది. తెలంగాణలో ఉన్న తమ ఆస్తుల రక్షణకు ఉమ్మడి రాజధానిపై గవర్నర్‌కు విశేషాధికారాలు ఉండాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ¬ంశాఖ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయించే కుట్ర చేసింది. కేసీఆర్ గాండ్రింపులకు కేంద్రం వెనక్కి తగ్గింది. ఇంకా అసెంబ్లీ, సెక్రటేరియేట్ క్వార్టర్లు, వాహనాలపై పన్ను తదితర అంశాలపై వివాదాలు ఉన్నాయి. నదీ జలాల విడుదల, ప్రాజెక్టుల డిజైన్లు, ఉద్యోగుల పంపిణీ వంటి పలు కీలకాంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదాలు నెలకొని ఉన్నాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో విజయం సాధించి ఇరు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఎన్నికైన కేసీఆర్, చంద్రబాబు హైదరాబాద్ నగరంలోనే నివాసం ఉంటున్నా దాదాపు రెండు నెలలపాటు ఒకరినొకరు కలుసుకోలేదు. కనీసం ఎదురుపడ్డ సందర్భాలు కూడా లేవు. ఇటీవల హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేం దుకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వచ్చిన సందర్భంగా ఇద్దరు చంద్రులు కరచాలనం చేశారు. ఇదే విషయం మీడియాలో సంచలన వార్తగా పతాక శీర్షికన అన్ని పత్రికలు ప్రచురించాయి. టీవీ చానెళ్ళు ప్రసారం చేశాయి. ఆ తర్వాత గవర్నర్ ఇచ్చిన విందులో రెండోసారి ‘చంద్రులు’ కలుసుకున్నారు. మాటామాటా కలిపారు. ఇక మూడోసారి గవర్నర్ సూచనమేరకు సమస్యలపై చర్చించేందుకు ఆదివారం సమావేశమయ్యారు. ఈ సమావేశం సఫలీకృతం అయ్యిందని ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రకటించడం ఆహ్వానించదగ్గ పరిణామం. పరస్పరం ఒక అవగాహనకు వస్తే రానున్నకాలంలో పలు సమస్యలకు పరిష్కారాలు ఉంటా యని ఇరు రాష్ట్రాల ప్రజలు భావిస్తున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు వివాదాస్పద అంశాలపై చర్చించేందుకు సమావేశం కావడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు.
ఒకేసారి చర్చల్లో అన్ని సమస్యలూ పరిష్కారం కాకపోవచ్చు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న అన్ని సమస్యలు చర్చించే వీలు కలుగకపోవచ్చు. కానీ ఇచ్చిపుచ్చుకునే ధోరణి, వాస్తవిక దృక్పథంతో ముందుకెళ్తే అనేక అంశాలకు పరిష్కారాలు ఉంటాయి. ప్రతి సమస్యకూ ఓ పరిస్కారం ఉంటుందనే సత్యం. అనేక యుద్ధాలవైపు దారితీసిన అనేక పరిణామాలు చర్చలతో పరిష్కార మయ్యాయి. అనేక చర్చలు సఫలమయ్యాయి. కలిసి మాట్లాడుకోవాలి. మనసు విప్పి మాట్లాడుకొని వాస్తవికతతో ముందుకుసాగితే సమస్యలు పరిష్కారమవుతాయి.