మళ్లీ కన్యాశుల్కం
స్త్రీల గురించి గొప్పగా చెప్పుకునే దేశం మనది. ఆదిశక్తి, పరాశక్తి అని బహు రూపాల్లో స్త్రీలను కొలుస్తారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడుతారో అక్కడే దేవతలు పూజించబడుతారనేది నానుడికే పరిమితమవుతోంది. స్కానింగ్‌లో ఆడబిడ్డ అని తేలితే ఆ తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. దీంతో గర్భంలోనే ఆడ శిశువును చిదిమేస్తున్నారు. తగ్గిపోతున్న స్త్రీ, పురుష నిష్పత్తిని చూస్తే రానున్న కాలంలో ప్రమాద ఘంటికలు మోగనున్నాయి. ఈ పరిస్థితులు చూస్తే కన్యాశుల్కం నాటకాన్ని మళ్లీ ప్రదర్శించాల్సి ఉంది. దేశంలో ప్రస్తుతం ఆరేళ్లలోపు పిల్లల్లో వెయ్యి మంది బాలురకు 927మంది బాలికలు మాత్రమే ఉన్నారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి చేసిన ప్రకటన కలవరపెడుతోంది. సభ్య సమాజం తలదించుకునే విధంగా మహిళల పట్ల వివక్ష కొనసాగుతోంది. ప్రస్తుత పురుషాధిక్య సమాజంలో స్త్రీల పట్ల చిన్నచూపు పరిపాటిగా మారుతోంది. కుటుంబానికి, సంపదకు వారసుడు కావాలనే అపోహ, మగ శిశువులపై మోజు బాగా పెరుగుతోంది. ఈ ప్రమాద స్థాయిలో స్త్రీ, పురుష నిష్పత్తి తగ్గిపోవడం వెనుక చాలా కారణాలున్నాయి. దీంతో తల్లిదండ్రులు ఆడ శిశువుకు జన్మనివ్వాలంటేనే పుట్టెడు భయంతో జంకే పరిస్థితులు నేటి ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. మగ పిల్లవాడు ఎక్కడో ఒకచోట, ఎలాగోలా బతుకుతాడు.. ఆడపిల్ల రక్షణ బహుబారం అనే ఆలోచనలో ఉన్నారు. ఆడ శిశువులను కడుపులోనే చంపేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆడ పిల్లల సంఖ్య తగ్గుతుండడం వెనుక సామాజిక, ఆర్థిక కారణాలూ ఉన్నాయి. మగ పిల్లవాడు పుడితే సమాజంలో గర్వంగా చెప్పుకుంటారు. తమ కుటంబానికి సంపదకు వారసుడు పుట్టాడని తల్లి, తండ్రి ఇద్దరూ సంబరపడుతారు. స్త్రీ అయిన తల్లి కూడా మరో మహిళకు జన్మనిచ్చేందుకు సుముఖంగా లేని దుస్థితి మన దేశంలో ఉంది. ఇందుకు సమాజంలో స్త్రీల పట్ల ఉన్న చిన్నచూపు, వివక్షే కారణం. స్త్రీల పట్ల వివక్షను రూపుమాపేందుకు ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయి. అలాగే ఆడపిల్లను పెంచి పెద్దచేయడం ఒకెత్తయితే ఆమెకు పెళ్ళి చేసే సమయంలో అధిక కట్నకానుకలు సమర్పించడం మరో భారం. మగ పిల్లవాడు పుడితే వరకట్నం రూపంలో లక్షలు వస్తాయి. అదే ఆడపిల్ల పుడితే లక్షల రూపాయలు ఖర్చుపెట్టి పెంచి పెద్దచేసి చదివించి చివరికి వరకట్నం రూపంలో మరింత డబ్బు ఖర్చుపెట్టాల్సి వస్తుందని తల్లిదండ్రులు భావిస్తున్నారు.
కారణాలు ఏవైనా స్త్రీ, పురుషులు సమానం అనే ధోరణి ప్రజల్లో కనబడడం లేదు. స్త్రీలల్లో అక్షరాస్యత పెరుగుతున్నప్పటికీ వారిని వంటింటి కుందేళ్ళుగానే చూస్తున్న పరిస్థితి నేడు ఉంది. ఇంటి పని, వంటపని, పిల్లల సంరక్షణ వంటివి మాత్రమే స్త్రీలు చేసే పనులుగా సమాజంలో ఉన్న భావవాదులు చిత్రీకరిస్తున్నారు. ప్రజల్లో ఉన్న మూఢ విశ్వాసాలను పారదోలడంలో ప్రభుత్వాలు చేస్తున్న కృషి శూన్యం. ఎన్నికల సమయంలో మాత్రం స్త్రీలను సామాజిక అంశంగా పరిగణిస్తూ వారికి రిజర్వేషన్లు, వారి రక్షణకు ఏర్పాటు చేస్తామని రాజకీయ నేతలు వాగ్దానాలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో స్త్రీలకు 50శాతం రిజర్వేషన్ కల్పించారు. అయితే స్త్రీలు అధికార ¬దాలో ఉన్న చోట కూడా ఆ హక్కులను వారి భర్తలు చెలాయిస్తున్న పరిస్థితి నేడు ఉంది. మొత్తంమీద స్త్రీలు సమాజంలో చాలా తక్కువ అనే భావజాలం విస్తరిస్తోంది. ఆ కారణంగానే మహిళల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. ఆరేళ్లలోపు ఉన్న పిల్లల్లో స్త్రీ, పురుష నిష్పత్తిని పరిశీలిస్తే 1947కంటే తక్కువగా ఉందని రాజ్యసభ సాక్షిగా సంబంధిత మంత్రి వెల్లడించారు. 67ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో ఎన్నో లక్ష్యాలు సాధించాం. ఎన్నో రంగాల్లో అభివృద్ధి సాధించాం. భూమి నుంచి ఆకాశానికి నిచ్చెన వేసే స్థాయికి మన టెక్నాలజీ అభివృద్ధి చెందింది. చంద్రమండలంలో మానవులు నివసించొచ్చు అనే విషయాలను కూడా మన తెలుసుకుంటున్నాం. అక్షరాస్యతలోనూ ఎంతో అభివృద్ధి సాధించాం. కానీ నేటి కంప్యూటర్ యుగంలో స్త్రీ, పురుషులు సమానం అనే భావనలో మాత్రం చాలా వెనుకబడి ఉన్నామని గుర్తుచేసుకోవడంలో ఆశ్చర్యంలేదు. ఇందుకు మత మౌఢ్యాలే కారణం. ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సైతం గత కాలపు మూఢ ఆచార సంప్రదాయాలే మంచివని చెప్పడం చూస్తుంటే మన ఆలోచనలు పురోగమనం వైపు ఉన్నాయో.. లేదా తిరోగమనం వైపు ఉన్నాయో ఇట్టే తెలిసిపోతుంది. ఆకాశంలో సగం, భూమిలో సగం అన్నింటిలోనూ స్త్రీ పాత్రను గుర్తిస్తున్న సమాజం ఆడ శిశువుకు జన్మనిచ్చేందుకు మాత్రం మనస్ఫూర్తిగా ముందుకు రావడం లేదు. స్త్రీలకు రక్షణ కొరవడిందని చెప్పడానికి దేశ రాజధాని ఢిల్లీలో యువతిపై జరిగిన సామూహిక లైంగిక దాడే నిదర్శనం. ఇలాంటి దేశంలోనూ, రాష్ట్రంలో రోజూ కోకొల్లలుగా వెలుగుచూస్తున్నాయి.
బాలికలను రక్షించుకునేందుకు అవగాహన కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించాల్సిన అవసరముంది. ప్రపంచం మొత్తంలో వెయ్యిమంది బాలికలకు 46మంది మరణిస్తున్నారు. బాలికల మరణాల రేటు పరంగా మన దేశం 155వ స్థానంలో ఉంది. ఈ గణాంకాలు మరింత కలవరపెడుతున్నాయి. సృష్టికి మూలమైన స్త్రీ జాతి తగ్గుతూ పోతే రానున్న కాలంలో మానవ జాతి అంతరించిపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించాల్సి ఉంది. మహిళల రక్షణకు చర్యలు చేపట్టాలి. స్త్రీ, పురుషులు సమానమనే ధోరణి ప్రజల్లో బలపడేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.