ప్రజలకేం చెప్పేందుకు ఈ యాత్ర ?
తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 4 నెలలైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగింది ఓ మ¬త్తర పోరాటం. నీళ్ళు, నిధులు, నియామకాలు ప్రధాన ఎజెండాగా జరిగిన పోరాటం ఆత్మగౌరవ, అస్తిత్వ పతాకగా సాగింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలయ్యాక తెలంగాణలోని ఆబాలగోపాలం జై తెలంగాణ.. అంటూ పోరుబాట పట్టారు. వెయ్యికిపైచిలుకు అమరవీరుల త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. నూతన తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్య ఉంటుందని అందరూ ఊహించిందే. ఎందుకంటే గ్యాస్, థర్మల్, హైడ్రల్ ఆధారిత కొత్త విద్యుత్ ప్రాజెక్టులన్నీ ఆంధ్రా ప్రాంతంలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఆధిపత్యం కోసం అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు ఆంధ్రా నేతలు శతవిధాలా ప్రయత్నంచేసి చతికిలపడ్డారు. తెలంగాణలో ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి సీమాంధ్ర తాబేదార్లు తిట్లు, శాపనార్థాలు మొదలుపెట్టారు. విభజన చట్టంలో 54శాతం కరెంటు తెలంగాణకు, మిగిలిన 46శాతం కరెంటు సీమాంధ్రకు పవర్ పర్చెస్ అగ్రిమెంట్ (పీపీఏ)లో ఇరు రాష్ట్రాలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపకుండానే ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పీపీఏలను రద్దుచేశాడు. తెలంగాణ ప్రజల, ముఖ్యంగా రైతుల నోరుగొట్టిన బాబు సీమాంధ్రలో 24గంటలు కరెంటు సరఫరా చేస్తానని ప్రకటించాడు. ఈ సందర్భంలో బాబుకు నమ్మిన బంట్లు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు రేవంత్‌రెడ్డి, వగైరాలు ఏం మాట్లాడుతారోనని తెలంగాణ ప్రజలు ఎదురుచూశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎదుట ధర్నాకు దిగి తెలంగాణకు రావాల్సిన 54శాతం కరెంటు వాటాను తీసుకొస్తారని ఎంతో ఆశగా చూశారు. లేనిపక్షంలో ఆ పార్టీని వీడి తెలంగాణ ప్రజలతో మమేకమై చంద్రబాబుపై తిరగబడతారని భావించారు. కానీ తెలంగాణ ప్రజలకు చివరికి నిరాశే మిగిలింది. తెలంగాణ టీడీపీ నేతలు బాబు ఆకృత్యాలపై నోరు మెదపలేదు. అది సరిపోదన్నట్లు విద్యుత్ సమస్యపై తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.
విద్యుత్ సమస్యకు ప్రధాన కారకుడు, తెలంగాణ ప్రజల విద్యుత్ వాటాను అక్రమంగా పట్టుకెళ్ళిన తమ పార్టీ అధినేతపై తక్షణంగా ఉద్యమించాల్సిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు తెలంగాణ రాష్ట్రంలో బస్సుయాత్ర పేరుతో ప్రజల ముందుకు వెళ్ళేందుకు సిద్ధమయ్యారు. యాత్ర చేపట్టడం చూస్తుంటే దొంగే దొంగ.. దొంగ.. అంటూ అరిచిన చందంగా ఉంది తెలంగాణ టీడీపీ నేతల వ్యవహారం. తెలంగాణ విద్యుత్ కష్టాలకు అసలు కారకుడు చంద్రబాబు అని తెలిసినప్పటికీ ప్రజలను మభ్యపెట్టి కాలం గడిపేందుకే ఈ బస్సుయాత్ర అనే విమర్శలు ప్రజల నుంచి పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. తమ పార్టీ అధినేత ముందు ఆందోళన చేసి తెలంగాణ ప్రజలకు విద్యుత్ రాబట్టాల్సిందిపోయి తెలంగాణ ప్రభుత్వంపై దండయాత్రకు బయల్దేరడం ఎంతవరకు సమంజసమో వారికే తెలియాలి. బస్సు స్టార్ట్ బటన్ నొక్కేముందు పీపీఏలపై, తెలంగాణకు న్యాయంగా రావాల్సిన విద్యుత్ వాటాను ఎగబెట్టిన చంద్రబాబు వైఖరిపై సదరు నాయకులు తమ వైఖరి స్పష్టంచేయాలి. రద్దయిన పీపీఏలపై, తెలంగాణకు విద్యుత్ వాటాపై మాట్లాడకుండా ప్రజల్లోకి వెళ్తే చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలు వారిని తప్పక నిలదీస్తారు. లేదా వారు నిర్వహించే ఏ మీడియా సమావేశంలోనైనా జర్నలిస్టులు బాబు వైఖరిపై ప్రశ్నలు సంధిస్తార్న సంగతి గుర్తెరగాలి. కాబట్టి కరెంటు కష్టాలకు కారకులు ఎవరు? సమస్యకు పరిష్కార మార్గాలు ఏంటో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలకు చెప్పి తమ బస్సుయాత్ర మొదలుపెడితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది.