విస్తరిస్తున్న డ్రోన్ సేద్యం
రాజోలి, అక్టోబర్ 22 (జనంసాక్షి) :
కూలీల కొరతతో వ్యవసాయంలో
కొత్తపుంతలుమండలంలోని చిన్న ధన్వాడ, మానుదొడ్డి, పచ్చర్ల, రాజోలి గ్రామాలలో మంగళవారం కొంతమంది రైతుల పొలంలో ప్రయోగత్మకంగా కంది, పత్తి, మొక్కజొన్న, వరి పంటలపై డ్రోన్ ద్వారా పోషక ద్రవణాన్ని పిచికారీ చేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ రంగంలోకి పురుగుమందుల పిచికారీ కోసం ప్రవేశించిన డ్రోన్ వినియోగం క్రమంగా పెరుగుతూ వస్తున్నది. తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో ఎకరాలకు డ్రోన్ ద్వారా మందును పిచికారీ చేయవచ్చు. అంతేకాకుండా పురుగు మందు సైతం ఆదా అవుతుంది. డ్రోన్ సాయంతో రోజుకు 20 నుంచి 30 ఎకరాల వరకు పిచికారీ చేయవచ్చు. పెట్టుబడి ఖర్చు కొంత మేర తగ్గుతుంది. కేవలం పురుగుమందు పిచికారీ మాత్రమే కాకుండా పంటలో తెగుళ్లను కూడా డ్రోన్‌లో అమర్చిన ప్రత్యేక కెమెరా గుర్తిస్తుంది. పంట దిగుబడి అంచనాలను కూడా వేసుకోవచ్చు. డ్రోన్‌తో పిచికారీ చేస్తే పురుగు మందు కూడా పంట పొలంలో అంతటా ఒకే రీతిన పడుతుంది. పది మంది రైతులు చేసే పనిని డ్రోన్‌తో చేయవచ్చు. పురుగుమందులను పిచికారీ చేసే సందర్భాల్లో అస్వస్థతకు గురై చనిపోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఈ సమస్యకు డ్రోన్‌తో పరిష్కారం దొరుకుతుంది. గతంలో కంటే ఇప్పుడు డ్రోన్లలో అనేక మార్పులు తెచ్చారు. పైలెట్ కంట్రోలర్, రెక్కలు, చార్జర్, బ్యాటరీ సామర్థ్యం, అధునాతన కెమెరాలు, నాజిల్స్, మెమొరీ కార్డులు లేటెస్ట్ వెర్షన్లవి అమర్చుతున్నారు. అంతకు ముందు పొలం సమీపంలో ఉండే ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద బ్యాటరీలను చార్జింగ్ చేసేకునే వారు. ఇప్పుడు మినీ జనరేటర్లను వినియోగిస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం కూడా జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) సహకారంతో ఆగ్రోస్ కేంద్రాల్లో డ్రోన్లను అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నది. ఇదే జరిగితే రైతులకు డ్రోన్లు మరింతగా అందుబాటులోకి రానున్నాయి.
* ఫలితాలు అమోగం..
ప్రధానంగా పురుగుల మందుల పిచికారీ, ఎరువులు, విత్తనాలు వెదజల్లేందుకు వీటిని వినియోగిస్తున్నారు. పురుగుల మందుల పిచికారీలో డ్రోన్ల వినియోగం మంచి ఫలితాలనిస్తోంది. వరిసాగు చేసే రైతులు దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. బురదలో దిగి సాధారణ స్ప్రేయర్లతో మందుల పిచికారీ పెద్ద ప్రయాసే. చాలామంది తేళ్లు, పాము కాట్ల బారిన పడుతున్నారు. అలాగే ఎత్తులో పెరిగే పంటలకు సంబంధించి పిచికారీ కష్టమైన పని. మొక్క జొన్నతోపాటు పండ్ల తోటల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాటికి డ్రోన్లు పరిష్కారం చూపుతాయంటున్నారు నిపుణులు.
సమయం కలిసోస్తుంది..
డ్రోన్ల వాడకంతో సమయం బాగా కలిసోస్తున్నది.. ఎకరా పొలానికి 5 నుంచి 6 నిమిషాల్లో స్ప్రేయింగ్ పూర్తవుతుంది. మాములు స్ర్పేయర్లతో గంట నుంచి 2 గంటల సమయం పడుతున్నది. పంటకు తెగులు వచ్చినప్పుడు ప్రాథమిక దశలోనే పిచికారీ చేయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో కూలీలు దొరక్క పిచికారీ ఆలస్యమైతే పంట పాడైపోతుంది. ఒకవేళ డ్రోన్లను వినియోగిస్తే ఇబ్బంది తప్పుతుంది. పురుగు మందులు ఆదా చేయవచ్చు. సాధారణ స్ర్పేయర్ల పద్దతుల కంటే 30 నుంచి 40 శాతం మేర తగ్గించి స్ర్పే చేసినా మంచి ఫలితాలు వస్తుంటాయని అధికారులు పేర్కొంటున్నారు. పురుగు మందులు పిచికారీతో రైతులకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు కూడా తప్పుతాయని పేర్కొన్నారు.
డ్రోన్ల వాడకం వల్ల రైతులకు మేలు : మండల వ్యవసాయధికారి సురేఖ
ఒక్క మనిషి రిమోట్ సహాయంతో ఆపరేట్ చేయడం ద్వారా పంటపైన స్ప్రే చేయవచ్చు. డ్రోన్‌కు అమర్చబడిన ఫర్టిలైజర్/ కెమికల్ ట్యాంక్ 3 రకాల కెపాసిటీలో ఉంటాయి. కనిష్టంగా 10 లీటర్ల నుంచి 16 లీటర్లు, గరిష్ఠంగా 25 లీటర్ల ట్యాంక్ అమర్చుకోవచ్చు. డ్రోన్ ద్వారా ఒక ఎకరానికి కేవలం 8 నిమిషాల్లో మందులు పిచికారీ చేయవచ్చు. మ్యాన్యువల్ స్ప్రేయర్‌తో 300 లీటర్ల పోషక ద్రావణం అవసరమైతే, డ్రోన్ ద్వారా 10 లీటర్లు మాత్రమే సరిపోతుంది. దీనివల్ల కూలీల కొరతను అధిగమించడమే కాకుండా, కెమికల్ ఖర్చులను కూడా ఆదా చేసుకోవచ్చు. డ్రోన్లను 3 మీటర్ల ఎత్తు నుంచి 15 మీటర్ల ఎత్తు వరకు వాడవచ్చు.
* డ్రోన్‌తో పిచికారీ చేయిస్తున్న : రైతు కుర్వ నారాయణ, చిన్న ధన్వాడ
నేను ఐదెకరాల్లో వరి పొలం సాగు చేస్తున్నా. అవసరం ఉన్నప్నుడు పురుగు మందులను పిచికారీ చేయడం ఇబ్బందిగా మారింది. కూలీలు సరైన సమయంలో దొరకడం లేదు. దీంతో డ్రోన్‌తో మందులు పిచికారీ చేయిస్తున్నా. దీని వల్ల సమయం ఆదాతో పాటు, తక్కువ మందు పడుతుంది. మాకు అందుబాటులో డ్రోన్ ఉంది. ఫోన్ చేయగానే నేను పొలం వద్ద లేకున్నా మందులు పంపిస్తే చాలు వాళ్లే వచ్చి పిచికారీ చేసి పోతారు.