28న ద్రోహం చేస్తే .. తెలంగాణలో సీమాంధ్ర పార్టీల అడ్రస్‌ గల్లంతే : కేసీఆర్‌


హైదరాబాద్‌, డిసెంబర్‌ 23 (జనంసాక్షి) :
తెలంగాణ అంశంపై ఢిల్లీలో డిసెంబర్‌ 28న జరిగే అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ ద్రోహపూరితంగా వ్యవహరిస్తే ఈ పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో తెలంగాణ రాష్ట్ర సమితి తీర్థం పుచ్చుకుంటారని ఈ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణకు కాంగ్రెస్‌ ద్రోహం చేస్తే అఖిలపక్షం అనంతరం తెలంగాణలోని కాంగ్రెస్‌ కార్యకర్తలు, నేతలు టీఆర్‌ఎస్‌లోకి వలస వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల కాంగ్రెస్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాన కార్యదర్శి రాహుల్‌గాంధీ ఎందుకు ఆ పార్టీ వైఖరిని వెల్లడించలేదని కేసీఆర్‌ ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికసంఘాల ఎన్నికల్లో విజయఢంకా మోగించిన టీఎంయూ నేతలతో ఆదివారం తన నివాసంలో జరిగిన సమావేశం సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణపై కేంద్రం నిర్వహించే అఖిలపక్ష పమావేశం ఒక చౌకబారు నాటకమని టీఆర్‌ఎస్‌ అదినేత మండిపడ్డారు. అయినప్పటికీ కాంగ్రెస్‌ డొల్లతనాన్ని బట్టబయలు చేయడం కోసమే టీఆర్‌ఎస్‌ ఈ సమావేశంలో పాల్గొంటుందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటే డిసెంబర్‌ 9 ప్రకటనకు అధికార పార్టీ కట్టుబడి అమలు చేసి ఉండేదని అన్నారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు టీఆర్‌ఎస్‌ నిర్ణయించిందని పేర్కొన్నారు. మార్చి రెండో వారంలో రాష్ట్ర రాజధానిని దిగ్బంధం చేసేందుకు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.