పాక్ మాజీ వికెట్ కీపర్ వ్యాఖ్యల పట్ల హర్భజన్ సింగ్ తీవ్ర ఆగ్రహం
హర్భజన్ సింగ్ దెబ్బకు క్షమాపణలు చెప్పిన పాక్ మాజీ క్రికెటర్..
పాకిస్థాన్ క్రికెటర్లు అనుచిత వ్యాఖ్యలతో ఎప్పుడూ వివాదాల్లో నిలుస్తుంటారు. తాజాగా పాక్ జట్టు మాజీ వికెట్ కీపర్, బ్యాటర్ కమ్రాన్ అక్మల్ సిక్కు మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారం రేపింది. అక్మల్ వ్యాఖ్యలకు టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శలు వెల్లువెత్తుతుండటంతో అక్మల్ దిగొచ్చి ఎక్స్ వేదికగా క్షమాపణలు చెప్పారు. ఇంతకీ గొడవ ఏమిటంటే? ..ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ లో భాగంగా భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి న్యూయార్క్ వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 19 ఓవర్లకే ఆలౌట్ అయ్యి కేవలం 119 పరుగులు మాత్రమే చేసింది. 120 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ జట్టు తొలుత గెలుపు దిశగా పయణించినా చివరి దశలో వరుస వికెట్లు కోల్పోయి నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 113 పరుగులు మాత్రమే చేసింది. దీంతో టీమిండియా ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో పాక్ విజయం సాధించాలంటే చివరి ఓవర్లో 18 పరుగులు చేయాల్సి ఉంది. అర్ష్ దీప్ సింగ్ బౌలింగ్ కు వచ్చాడు. ఆ సమయంలో పాకిస్థాన్ లో ప్రసారమయ్యే ఓ టీవీ ఛానెల్ లో పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ సిక్కు మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో అతడి వ్యాఖ్యలకు పక్కనే ఉన్న మరో అతిథి నవ్వాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సిక్కు మతంపై పాక్ మాజీ వికెట్ కీపర్ వ్యాఖ్యల పట్ల హర్భజన్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. నువ్వు సిక్కుల గురించి నోరుపారేసుకునేముందు వారి చరిత్ర తెలుసుకోవాలి. ఆక్రమణదారులు మీ తల్లులు, సోదరీమణులను అపహరించినప్పుడు ఇదే సమయంలో సిక్కులు వారిని రక్షించారు. నిన్ను చూస్తే అవమానంగా ఉంది. కొంచెం సిక్కుల పట్ల విశ్వాసంతో ఉండు అంటూ హర్భజన్ అన్నారు. పలువురు ప్రముఖులు సైతం అక్మల్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో వివాదం ముదురుతుండటంతో కమ్రాన్ అక్మల్ దిగొచ్చాడు. ఎక్స్ వేదికగా క్షమాపణలు చెప్పాడు.
నేను ఇటీవల చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నాను. హర్భజన్ సింగ్, సిక్కు సమాజానికి క్షమాపణలు చెబుతున్నా. నా మాటలు అగౌరవంగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిక్కుల పట్ల నాకు అత్యంత గౌరవం ఉంది. ఎవరినీ నొప్పించాలనే ఉద్దేశం లేదు. నన్ను క్షమించండి అంటూ కమ్రాన్ అక్మల్ ఎక్స్ లో పేర్కొన్నాడు. దీంతో వివాదం సర్దుమణిగినట్లయింది.