హక్కుల కోసం పోరాడిన సేవాలాల్ మహరాజ్: ఎమ్మెల్యే

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):శ్రీ సద్గురు సేవాలాల్ మహరాజ్ బంజారా హక్కుల పోరాడారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చెప్పారు. శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని భారత్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన శ్రీ శ్రీ సద్గురు సేవాలాల్ మహరాజ్ 287 జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సద్గురు సేవాలాల్ మహారాజ్ బంజారా సమాజానికి ఆధ్యాత్మిక దారిదీపమని, ఆయన బోధనలు సమాజంలో నైతిక విలువలు, ఐక్యత, సేవాభావం పెంపొందించడానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. సమానత్వం, సోదరభావం, క్రమశిక్షణ వంటి విలువలను ఆయన జీవితాంతం ఆచరించి చూపారని తెలిపారు.
యువత ఆయన మార్గదర్శకాలను అనుసరించి విద్య, ఉపాధి రంగాలలో ముందుకు సాగాలని, సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన, బంజారా సమాజ అభ్యున్నతికి కట్టుబడి ఉందని, సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా అడిషనల్ ఎస్పీ నరేష్, ఆర్డీఓ హరికృష్ణ, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.



