ఓటరు జాబితా రూపకల్పనలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరం

2కె రన్‌ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్‌పాయి
హనుమకొండ, ప్రతినిధి జూన్ 18 (జనం సాక్షి) :ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అయిన ఓటరు జాబితాను మరింత సమగ్రమైనదిగా, పారదర్శకమైనదిగా రూపొందించేందుకు భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం లో ప్రతి పౌరుడు చురుకుగా భాగస్వామి కావాలని జిల్లా కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి చాహాత్ బాజ్‌పాయి పిలుపునిచ్చారు.ఎస్‌ఐఆర్-2026పై ఓటర్లలో అవగాహన పెంపొందించేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన 2కె రన్‌ను హనుమకొండ అదాలత్ సర్కిల్‌లోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ఆమె ప్రారంభించారు. అక్కడి నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థ విశ్వసనీయత ఓటరు జాబితా ఖచ్చితత్వంపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రతి ఓటరు సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన పౌరులు తమ పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో నిర్ధారించుకోవడంతో పాటు అవసరమైన సవరణలు, మార్పులు, చేర్పులు చేసుకోవాలని సూచించారు.పారదర్శకమైన, సమగ్రమైన, తప్పులులేని ఓటరు జాబితా రూపకల్పనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. మరణించిన వ్యక్తుల పేర్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాలు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన డూప్లికేట్ ఓట్లను గుర్తించి తొలగించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రవి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇ.వి. శ్రీనివాసరావు, రావు పద్మ, అమరేందర్ రెడ్డి, కుసుమ శ్యాంసుందర్, నాగబెల్లి రజనీకాంత్, ప్రవీణ్ కుమార్, సయ్యద్ ఫైజుల్లా, మున్నా, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, జిల్లా యువజన, క్రీడల అధికారి కొత్త ప్రశాంత్, టీజీవో రాష్ట్ర నాయకులు జగన్మోహన్ రావు, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు ఆకుల రాజేందర్, ఆర్డీఓ వెంకటేష్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ జగత్ సింగ్, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.



