అనాథ ఆడబిడ్డల విద్యకు భరోసా -ఉప్పల ఆశ్రమ విద్యాలయం

తలకొండపల్లిలో రూ,10 కోట్లతో ఆధునిక సౌకర్యాలతో నిర్మాణం

ఆరు నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్య…

నేడు ప్రారంభించనున్నట్లు తెలిపిన రాష్ట్ర మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గుప్తా

తలకొండపల్లి జూన్18(జనంసాక్షి):కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఆరు మండలాల్లో రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ తన ఉప్పల చారిటబుల్ ట్రస్టు ద్వారా నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా వినూత్నమైన పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు.వీటన్నిటితోపాటు కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులు లేని అనాథ ఆడబిడ్డలు,నిరుపేద బాలికలకు ఉచితంగా ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో తలకొండపల్లి ఎక్స్ రోడ్డు చౌరస్తాలో ఉప్పల చారిటేబుల్ ట్రస్ట్ సౌజన్యంతో రూ,10 కోట్లు ఖర్చు చేసి అన్ని సౌకర్యాలతో కూడిన ఉచిత ఆశ్రమ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని నిర్మించారు.ఈ ఆశ్రమ పాఠశాలను ఈ నెల 18న గురువారం ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

నిరుపేద ఆడబిడ్డలకు ఉచిత విద్య..

అనాథ ఆడబిడ్డల జీవితాలను బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దాలనే తపనతో ఉప్పల ఆశ్రమ విద్యాలయంలో అత్యాధునిక సౌకర్యాలతో నాణ్యమైన ఉచిత విద్యను అందించనున్నట్లు ఉప్పల వెంకటేష్ తెలిపారు.డిజిటల్ క్లాస్ రూమ్స్,అత్యంత సురక్షితమైన వాతావరణం,ఉచిత వసతి భోజన సౌకర్యాలు మరియు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో పాఠ్యాంశాల బోధన,నిరంతర పర్యవేక్షణతో కూడిన ఇంగ్లీష్ మీడియం విద్యను అందించనున్నట్లు ఆయన తెలిపారు.ఈ ఏడాది నుంచి తరగతులు ప్రారంభించేందుకు ఇప్పటికే విద్యార్థులను పాఠశాలలో చేర్చుకుంటున్నామని,ఇదివరకే దాదాపు 300 మంది విద్యార్థులు అడ్మిషన్ పొందినట్లు తెలిపారు.

పేదల విద్యకు ఎంతైనా ఖర్చు చేస్తాం.

అనాధ బాలికల విద్యాభ్యాసం అందించేందుకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంత ఖర్చైనా భరిస్తామని తెలిపారు.పేదరికం విద్యకు అడ్డుకాకూడదనే లక్ష్యంతో ఉచిత విద్యను అందిస్తున్నామని అన్నారు.పేదల బ్రతుకులను మార్చేది చదువుకు మాత్రమే సాధ్యమవుతుందని,అందుకు ఈ ఉచిత ఆశ్రమ పాఠశాలను అనాథ బాలికలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నియోజకవర్గ వ్యాప్తంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సేవలు

కరోనా మహమ్మారి సమయంలో ప్రజలకు ఉచితంగా ఆరోగ్య కిట్లను అందించడంతోపాటు నిరుపేదల ఇండ్ల నిర్మాణం,ఉచిత మెడికల్ క్యాంపుల నిర్వహణ,మరణించిన పేదల కుటుంబాలకు దహన సంస్కారాల నిమిత్తం రూ,3 వేలు ఆర్థిక సహాయం,పేదల విద్యాభ్యాసం కొరకు ఆర్థిక సహాయం,ఉచిత అంబులెన్స్,ఆలయాల నిర్మాణాలకు విరాళాలు,మంచి నీటి శుద్ధి కేంద్రాలు,ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా స్పోర్ట్స్ డ్రస్సులు,వంటి అనేకమైనటువంటి సేవలను ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరంతరం అందిస్తున్నామని తెలిపారు.