అరాచకశక్తులపై నిఘా..

share on facebook

– హైదరాబాద్‌పై కుట్ర

– డీజీపీ మహేందర్‌రెడ్డి

హైదరాబాద్‌,నవంబరు 26(జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలను ఆసరా చేసుకొని హైదరాబాద్‌ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని చోట్ల కొంత మంది విధ్వంసక శక్తులు మత ఘర్షణలు, విద్వేశాలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, తమకు ఖచ్చితమైన సమాచారం ఉందని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. శాంతిభద్రతల విషయంలో తెలంగాణ పోలీస్‌ వ్యవస్థ అప్రమత్తంగా ఉందన్నారు. అన్ని జిల్లాల పోలీస్‌ అధికారులు, కమిషనర్లు, కింది స్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారన్నారు. అంసాఘిక, మతత్వశక్తులు, రౌడీ షీటర్స్‌పై నిరంతరం నిఘా పెట్టినట్లు తెలిపారు. విధ్వంసక శక్తుల విషయంలో పోలీస్‌ శాఖ అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ఎవరైనా, ఎంతటివారైనా వెనుకాడేది లేదని డీజీపీ స్పష్టం చేశారు. సోషల్‌ విూడియా వేదికగా ప్రజల మనోభావాలను దెబ్బతీసి, సామరస్యపూర్వక వాతావరణాన్ని భగ్నం చేసే కుట్రలు జరుగుతున్నాయని డీజీపీ పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్‌ విూడియాపై పోలీసు శాఖ నిఘా పెట్టిందని తెలిపారు. అనేక రకాల నూతన టెక్నాజీని వినియోగించి రొచ్చగొట్టే పోస్టులు వచ్చినప్పుడు గుర్తించి, ప్రభావాన్ని తగ్గించి, నిజానిజాలను ప్రజలకు తెలియజేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అసాంఘిక శక్తుల పన్నాగంలో చిక్కుకోకుండా పోలీసులశాఖతో సమన్వయం చేసుకొని ప్రజలంతా సహాయ సహకారాలు అందించాలని కోరారు. సోషల్‌ విూడియాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి పోస్టులు వాటిని నమ్మొద్దని, ఇతరులకు షేర్‌ చేయకుండా దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతిభద్రతల విషయంలో రాష్ట్రంలో కానిస్టేబుల్‌ నుంచి కమిషనర్లు, జోనల్‌ ఐజీల వరకు భాగస్వాములను చేశామని.. నిర్భయంగా, నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా గుర్తించి, చర్యలు తీసుకునేందుకు అప్రమత్తంగా ఉన్నామన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో శాంతియుత వాతావరణంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేలా చూడడమే పోలీసుశాఖ లక్ష్యమని మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు తమ ఓటుహక్కును నిర్భయంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని కోరారు. పోలీస్‌శాఖకు సహాయ సహకారాలు అందిస్తే మరింత పకడ్బందీ చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రశాంతంగా ఓటింగ్‌ జరిగేందుకు సిబ్బంది సైతం అకుంఠిత దీక్షతో పని చేయాలని సూచించారు. మూడు కమిషనరేట్ల పరిధిలో ఎన్నికల సందర్భంగా 51,500 మంది పోలీస్‌ సిబ్బంది సివిల్‌, ఏఆర్‌, టీఎస్‌ఎస్‌పీ, ఇతర విభాగాలతో భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎక్కడ అత్యవసరం ఉన్నా తక్షణమే స్పందించేలా పెట్రోలింగ్‌, బ్లూకోట్స్‌, స్పెషల్‌ మొబైల్‌ పార్టీలు, సీనియర్‌ పోలీసుల అధికారులను పలు ఏరియాలకు ఇన్‌చార్జిలుగా నియమించినట్లు చెప్పారు.ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలపై రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన సమాచారం మేరకు పోలీస్‌ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనర్లు, ఇద్దరు జోనల్‌ ఐజీలు, రేంజ్‌ డీఐజీలు, ఏజీ లా అండ్‌ ఆర్డర్‌ పాల్గొన్నారన్నారు. తమకు వచ్చిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పసిగడుతూ విధ్వంసక శక్తులు తమ మనసులో ఉన్న ప్రణాళికను అమలు చేసే లోపే వాటిని కట్టిడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల్లో రాజకీయ నాయకుల ప్రసంగాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, రొచ్చగొట్టే వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలుంటాయన్నారు. ఇప్పటి వరకు 50 కేసులు నమోదు చేశామని, అవన్నీ విచారణలో ఉన్నాయని, చట్ట ప్రకారం చర్యలుంటాయని స్పష్టం చేశారు.

Other News

Comments are closed.