ఐదోరోజు సాగిన ఆర్టీసీ సమ్మె

share on facebook

– పూర్తిస్థాయిలో రోడ్లెక్కని బస్సులు
– తాత్కాలికంగా పోలీస్‌ రక్షణ నడుమ బస్సులను నడిపిన ప్రభుత్వం
– ఇబ్బందులు పడ్డ ప్రయాణీకులు
హైదరాబాద్‌, అక్టోబర్‌9 (జనం సాక్షి):  అటు ఆగిన చక్రాలు.. ఐదో రోజు కూడా కదల్లేదు. నాలుగు రోజులుగా నిరసన తెలుపుతున్న కార్మికులు… ఏమాత్రం తగ్గట్లేదు. ప్రభుత్వం సైతం వెనకడుగు వేయట్లేదు. వరుస నిరసనలు, వినూత్న ప్రదర్శనలు, పోటాపోటీ భేటీలు, ప్రయాణికుల ఇబ్బందుల నడుమ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఐదవ రోజుకు చేరింది. సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణీకులు ఇక్కట్లకు గురవుతున్నారు. తమ సమస్యలపై కార్మికులు ప్రభుత్వానికి వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. బుధవారం కూడా పలుచోట్ల బస్సులు రోడ్డెక్కకుండా కార్మికులు అడ్డుకుంటున్నారు. తాము సమ్మెలో ఉంటే బస్సులు ఎలా నడుపుతారంటూ అధికారులతో పలుచోట్ల వాగ్వాదానికి దిగారు. వినూత్నంగా నిరసనలు చేస్తూ తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం రోజురోజుకు రోడ్డెక్కే బస్సుల సంఖ్యను పెంచింది. దీంతో ఇటు ప్రభుత్వం, అటు కార్మికులు ఎవరికి వారే సమ్మెపై పట్టుదలగా ఉండడంతో పండుగకు వెళ్లిన ప్రజలు మాత్రం ఇబ్బందిపడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆర్టీసీ సమ్మె 5వ రోజు కొనసాగుతోంది. దీంతో ఎక్కువ సంఖ్యలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అన్నిరూట్లకు బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ పోలీసులను మోహరించి.. పటిష్ఠ బందోబస్తు మధ్య ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా.. ప్రయాణికులకు ఇబ్బందులు తప్పట్లేదు. దసరా పండగ ముగించుకున్న ప్రజలు.. వారి గమ్య స్థానాలకు చేరేందుకు బస్టాండ్లకు చేరుకుంటున్నారు. అయితే రద్దీ కూడా పెరిగి గంటలకొద్దీ పడిగాపులు కాస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు వాహనదారులు అందినకాడికి దోచుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోనూ అదే పరిస్థితి. బస్సులు రోడ్లెపైకి వచ్చినప్పటికీ వాటిని ఆర్టీసీ అధికారులు అడ్డుకుంటుంటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం పోలీసుల భద్రత నడుమ బుధవారం ఆయా జిల్లాల్లో బస్సులు నడిపింది. కానీ పూర్తిస్థాయిలో బస్సులు లేకపోవటంతో ప్రయాణీకులు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించారు. దీంతో ప్రైవేట్‌ వాహనదారులు అధిక చార్జీలతో ప్రయాణీకుల జేబులు గుల్ల
చేశారు. అదేవిధంగా పండుగకు ఊళ్లకు వెళ్లిన వారు హైదరాబాద్‌, ఆయా పట్టణాలకు చేరుకొనేందుకు బస్సులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ నెల 13 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండటంతో అప్పటలోగా పట్టణ కేంద్రాలకు వచ్చేందుకు ప్రయాణీకులు సిద్ధమవుతున్నారు. కానీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో బస్సులు నడిపే పరిస్థితి లేక పోవటంతో, ప్రైవేట్‌ వాహనాల ద్వారా పట్టణాలకు చేరుకుంటున్నారు.

Other News

Comments are closed.