యువత వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): నిరుద్యోగ యువత వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కోరారు. సింగరేణి సంస్థ సి.ఎస్.ఆర్ నిధులతో భూపాలపల్లి పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువత కోసం నిర్వహించిన డ్రోన్ టెక్నీషియన్ కోర్సు ముగింపు, సర్టిఫికెట్ల ప్రధానోత్సవ కార్యక్రమం శనివారం సింగరేణి జిఎం కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, వ్యవసాయ, సహకార, డిఆర్డీఏ, సింగరేణి తదితర శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ సాధారణంగా హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లి ఈ డ్రోన్ టెక్నీషియన్ శిక్షణ పొందాలంటే 50 వేల వరకు ఖర్చవుతుందని, అలాంటి ఖరీదైన కోర్సును మన భూపాలపల్లి ప్రాంత నిరుద్యోగ యువతకు ఇక్కడే ఉచితంగా అందించడం గర్వకారణమన్నారు. సింగరేణి, టాస్క్ ద్వారా ప్రభుత్వం తరపున స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ప్రారంభించి, మొదటి విడతగా 24 మంది నిరుద్యోగ యువతకు డ్రోన్ టెక్నాలజీలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసి సర్టిఫికెట్లు అందించినట్లు తెలిపారు. యువత డ్రగ్స్, గంజాయి, గుట్కా వంటి చెడు మార్గాల వైపు వెళ్లకుండా, నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ద్వారా శిక్షణ పొంది సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గతంలో నిర్వహించిన జాబ్ మేళా ద్వారా సుమారు 10 వేల మంది నిరుద్యోగులు హాజరుకాగా, అందులో 2,700 మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామని అన్నారు. త్వరలోనే మరిన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో మరోసారి మెగా జాబ్ మేళా నిర్వహిస్తామని వెల్లడించారు.ప్రస్తుత ఆధునిక వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం ఎంతో పెరిగిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, నాబార్డ్ ద్వారా సబ్సిడీపై రైతులకు, ఐకేపీ, డ్వాక్రా మహిళా సంఘాలకు ఈ డ్రోన్‌లను అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు సబ్సిడీ డ్రోన్ల ఎంపికలో ప్రాధాన్యత ఇస్తూ, వారు రైతులకు మందుల పిచికారీ వంటి పనుల్లో సహాయపడుతూ ఉపాధి పొందేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ఈ కేంద్రాల్లో లభించే 38 రకాల విభిన్న స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులకు కేవలం రెండు కోర్సులకు మాత్రమే ఆసక్తి చూపుతున్నారని, మిగిలిన కోర్సులపై విస్తృతంగా ప్రచారం చేసి నిరుద్యోగ యువతకు అవగాహన కల్పించాలని కోరారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. నిరుద్యోగ యువతకు అత్యాధునిక సాంకేతిక రంగాలలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తోందని తెలిపారు. సింగరేణి సంస్థ సి.ఎస్.ఆర్ నిధులతో నిరుద్యోగ యువతీ, యువకులకు నిర్వహించిన 2 వారాల ప్రత్యేక డ్రోన్ టెక్నీషియన్ కోర్సు నిర్వహించడం పట్ల అభినందించారు. ప్రస్తుతం డ్రోన్ టెక్నాలజీ అనేది ఎంతో వేగంగా విస్తరిస్తున్న అధునాతన రంగమని పేర్కొన్నారు. గత ఏడాది నాబార్డ్ సంస్థ ద్వారా భూపాలపల్లి జిల్లాలో అర్హులైన యువతకు డ్రోన్ టెక్నాలజీలో శిక్షణ ఇవ్వడానికి ఒక సమగ్ర కార్యాచరణ నివేదిక సిద్ధం చేసినట్లు తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల కొంత ఆలస్యం జరిగిందని యువతకు ఈ అవకాశాన్ని త్వరగా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సింగరేణి సి.ఎస్.ఆర్ నిధుల ద్వారా ఈ ప్రత్యేక డ్రోన్ టెక్నీషియన్ శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు. జిల్లా యంత్రాంగం చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి, యువతకు రెండు వారాల పాటు నాణ్యమైన శిక్షణ, గుర్తింపు పొందిన సర్టిఫికెట్లు అందజేయడానికి సహకరించిన సింగరేణి యాజమాన్యానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ శిక్షణ ద్వారా లభించిన సర్టిఫికెట్లతో యువత సొంతంగా డ్రోన్ ఆధారిత సేవల రంగంలో ఉపాధిని ప్రారంభించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో డ్రోన్ల వినియోగం పెరగనుండటంతో ఈ శిక్షణ పొందిన వారికి మంచి డిమాండ్ ఉంటుందన్నారు. అనంతరం యువతకు శిక్షణ సర్టిఫికెట్లు అందచేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి జిఎం రాజేశ్వర రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ బుర్ర కొమురయ్య , వైస్ చైర్‌పర్సన్ అంబాల శ్రీనివాస్, జిల్లా, నాబార్డు అధికారులు, సింగరేణి అధికారులు, శిక్షణ పూర్తి చేసుకున్న నిరుద్యోగ యువత తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు