దేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్‌ తమిళిసైదేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్‌ తమిళిసై

share on facebook


హైదరాబాద్‌: TS Assembly 2023 |  తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న సమ్మిళిత సమగ్రాభివృద్ధి యావత్‌ దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నదని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. ప్రతి రంగంలోనూ దేశం ఆశ్చర్యపోయే విధంగా అద్భుతమైన ప్రగతిని ఆవిష్కరిస్తూ పురోగమిస్తున్నదని చెప్పారు. ప్రజల ఆశీస్సులు, సీఎం కేసీఆర్‌ పరిపాలనా దక్షత వల్ల తెలంగాణ అపూర్వ విజయాలు సాధించిందన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. ఒకప్పుడు కరెంటు కోతలతో అంధకారంలో కొట్టుమిట్టాడిన తెలంగాణ.. ప్రభుత్వ అవిరళ కృషితో నేడు 24 గంటల విద్యుత్‌ సరఫరాతో వెలుగు జిలుగుల రాష్ట్రంగా విరాజిల్లుతున్నదని చెప్పారు. వ్యవసాయం కుదేలై విలవిలలాడిన నేల.. నేడు దేశానికే అన్నం పెట్టే ధాన్యాగారంగా అవతరించిందని పేర్కొన్నారు. తాగునీటి కోసం తల్లడిల్లిన పరిస్థితుల నుంచి పూర్తిగా బయటపడి, 100 శాతం గ్రామాల్లో ఇంటింటికీ ఉచితంగా స్వచ్ఛమైన, సురక్షితమైన జలాలను సరఫరా చేస్తున్నది వెల్లడించారు. ఒకనాడు పాడుబడినట్టున్న తెలంగాణ గ్రామాల రూపురేఖలు మారి, నేడు అత్యున్నత జీవన ప్రమాణాలతో ఆదర్శవంతంగా తయారయ్యాయని తెలిపారు. పెట్టుబడులకు స్వర్గధామంగా, ప్రపంచ స్థాయి సంస్థలకు గమ్యస్థానంగా, ఐటీ రంగంలో మేటి రాష్ట్రంగా ప్రగతిపథంలో పరుగులు పెడుతున్నది. పర్యావరణ పరిరక్షణలోనూ, పచ్చదనం పెంపుదలలోనూ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నదని చెప్పారు. 2014-15లో రూ.62 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర ఆదయం.. ప్రభుత్వ కృషివల్ల 2021 నాటికి రూ.1 లక్షా 84 వేల కోట్లకు పెరిగిందన్నారు. రాష్ట్రం సిద్ధించేనాటికి రూ.లక్షా 24 వేలుగా ఉన్న తలసరి ఆదాయం.. 2022-23 నాటికి రూ.3.17 లక్షలకు చేరిందని వెల్లడించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాల్లోనూ అభివృద్ధి రెట్టింపుస్థాయిలో జరిగిందన్నారు. అన్నిరంగాల్లో పెట్టుబడి వ్యయాన్ని అధికంగా చేస్తూ అనూహ్యమైన ప్రగతిని సాధించిన ప్రభుత్వాన్ని అభినందించారు.

Other News

Comments are closed.